ప్రజా తీర్పు మోదీపై అవిశ్వాసమే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

మేళ్లచెరువు, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా ఇచ్చిన తీర్పు మోదీపై అవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని షాదీఖానా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేనందునే 63 సీట్లు తగ్గాయని, అదే సమయంలో కాంగ్రెస్ బలం రెట్టింపు అయిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే తీర్పును ప్రజలిచ్చారని తెలిపారు. కాంగ్రెస్​ నల్గొండ ఎంపీ అభ్యర్థికి 5 లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చిందని, ఇది దేశంలోనే రెండో అతిపెద్ద మెజార్టీ అని అన్నారు.

హుజూర్​నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచే అత్యధిక మెజార్టీ రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మేళ్లచెరువులో కొత్త షాదీఖానా నిర్మాణానికి కోటిన్నర నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు భాస్కర్ రెడ్డి, సైదేశ్వర్ రావు, గోవిందరెడ్డి, రామచందర్ రావు, మునావర్, శ్రీనివాసరెడ్డి, వెంకట్రామిరెడ్డి, శంభిరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.