కూసుమంచి, వెలుగు: ఇరిగేషన్ శాఖలోని ఓ కింది స్థాయి అధికారి.. బుధవారం పాలేరు ఎడమ కాలువ గేట్ల లీకుల్లోని గడ్డిని తొలగించి నీరు ప్రవహించేలా చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 12.50 అడుగుల మేర నీరు ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీరు రాకపోవడంతో సాగర్ డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో పాలేరు జలాశయంలోని నీటిని ఐబీ అధికారులు జాగ్రత్తగా వాడుతున్నారు.
మూడు జిల్లాలకు తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకం కింద రోజుకు 125 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల కొందరు రైతులు పాత కాలువ ద్వారా సాగు నీరు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరినప్పటికీ, చేయలేదు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుంటున్నారు. అయితే కొందరు రైతుల నుంచి అమ్యామ్యాలు అందుకున్న ఐబీ శాఖలోని ఓ కింది స్థాయి అధికారి బుధవారం ఎడమ కాలువ గేట్ల లీకేజీలోని గడ్డిని తొలగించి, గోరీలపాడు తండా, పెరికసింగారం వరకు నీరు చేరేలా చేసినట్లు సమాచారం.
పాలేరు, మల్లాయిగూడెం, హాట్యాతండా గ్రామాల రైతుల మోటార్లు కాలువపై ఉండగా, వాటి విద్యుత్ వైర్లు తొలగిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే తాగునీటి కష్టాలు తప్పవని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.