- వరదల కారణంగా టన్నెల్ దెబ్బతినడంతో పైప్‌లు వేసి తాత్కాలిక పనులు
- ఆ ప్రయత్నం విఫలం కావడంతో టన్నెల్ పేల్చివేసిన ఆఫీసర్లు
- వేగంగా కొత్త యూటీ నిర్మాణ పనులు, మూడు రోజుల్లో నీరు ఇచ్చేలా చర్యలు
కూసుమంచి, వెలుగు : ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని సాగర్ కాల్వలో దెబ్బతిన్న అండర్ టన్నెల్‌ను ఆదివారం ఇరిగేషన్ ఆఫీసర్లు పేల్చివేశారు. వరదకు ఒక వైపు కూలిన అండర్ టన్నెల్‌ను, కాల్వకు పడిన గండిని ఇటీవలే పూడ్చివేశారు. టన్నెల్ కింద పైప్‌లు వేసి పనులు చేపట్టారు. శనివారం నీటి విడుదలకు ప్రయత్నించడంతో టన్నెల్ మరో వైపు కూలిపోయింది. ప్యాచ్ వర్క్ చేసేందుకు సైతం వీలు లేకపోవడంతో టన్నెల్‌ను పేల్చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆదివారం టన్నెల్‌ను పేల్చివేసిన తర్వాత శిథిలాలు తొలగించి బయట పడేశారు. స్లాబ్ కింద పేరుకున్న సిల్ట్, యూటీ నుంచి వచ్చిన రాళ్లను తొలగించారు. పైపులు బిగించిన అనంతరం కాంక్రీట్ వర్క్ చేసి మూడు రోజుల్లో టన్నెల్‌ను తిరిగి నిర్మించి సాగు నీటిని విడుదల చేస్తామని ఐబీ ఆఫీసర్లు చెబుతున్నారు. పనులను ఆదివారం ఐబీ ఎస్‌ఈ నర్సింగరావు, ఈఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్‌రెడ్డి పరిశీలించారు.