పాలమూరు–రంగారెడ్డి పనులు స్పీడప్ చేయాలి : ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు

పాలమూరు–రంగారెడ్డి పనులు స్పీడప్ చేయాలి : ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు
  • రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం 
  • కాళేశ్వరం లింక్‌‌‌‌ 5లో ప్యాకేజీ 15, ప్యాకేజీ 21 పనులపైనా చర్చ
  • దేవాదుల ప్యాకేజీ 6 పనులకు రూ.200 కోట్ల అదనపు ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌‌‌లోని 2, 3, 4, 6, 7, 11, 14, 15, 17 ప్యాకేజీల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు నిర్ణయించారు. శుక్రవారం జలసౌధలో రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్​సీ) సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌ లో పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన 15 అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ 6, 7 ప్యాకేజీలకు సంబంధించి కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌‌‌లోని డిజైన్, డ్రాయింగ్స్ ప్రిపరేషన్, ఉత్తర ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ల ఎస్టిమేట్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసేందుకు ఆఫీసర్లు ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. 

ఆరో ప్యాకేజీలోని 4.27 లక్షల ఎకరాలు, 7వ ప్యాకేజీలో 3.24 లక్షల ఎకరాల ఆయకట్టును గుర్తించేందుకు డిటెయిల్డ్ బ్లాక్‌‌‌‌ సర్వే చేయించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. తొలుత ప్యాకేజీ 3, 4లోని బ్యాలెన్స్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అదనపు సమయంపైనా యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ 4లోని నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లకు మధ్య కాలువ, సొరంగం తవ్వకం పనులకు సంబంధించి టెండర్‌‌‌‌ను ఈ ఏడాది చివరి వరకు పొడిగించేందుకు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. 

దాంతో పాటు ప్యాకేజీ 11లోని వెంకటాద్రి బ్యాలెన్సింగ్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ నుంచి వట్టెం పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ వరకు బండ్​నిర్మాణం, ప్యాకేజీ 14, 15లోని కురుమూర్తిరాయ రిజర్వాయర్‌‌‌‌ నుంచి కరివెన వరకు, ప్యాకేజీ17లోని ఉద్ధండపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి టెండర్ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌నూ ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించే అంశంపై చర్చించినట్టు తెలిసింది.  

కాళేశ్వరం లింక్ ప్యాకేజీలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లోని లింక్‌‌‌‌ 5, ప్యాకేజీ 15లో వాటర్ కన్వేయర్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ డిజైన్లు, అక్కడ చేయాల్సిన టెస్టులపై కూడా ఎస్ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌సీలో చర్చించారు. ఇందులో భాగంగా కురేలి ఆనకట్ట నుంచి చిట్యాల కెనాల్ రీచ్ 1 వరకు 63 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చర్చకు వచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించి టెండర్ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ను జూన్‌‌‌‌ 30 వరకు పొడిగించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. 

ఇదే ప్రాజెక్టులోని ప్యాకేజీ 21కింద మాసాని రిజర్వాయర్ నుంచి 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులకు సంబంధించి టెస్టులు, డిజైన్లపైనా చర్చించినట్టు తెలిసింది. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని ఇందిరమ్మ వరద కాల్వ రీఇంజనీరింగ్, కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌లోని ప్యాకేజీ 29, 26 డిజైన్లు, నిర్మాణం, ఎర్త్​వర్క్ పనులపై కూడా చర్చించారు. 

దేవాదులకు అదనంగా రూ.200 కోట్లు

దేవాదుల ప్రాజెక్టులోని ఫేజ్ 3, ప్యాకేజీ 6లో పాలకుర్తి ట్యాంక్ పునరుద్ధరణ, హెడ్ స్లూయిస్ నిర్మాణం, చెన్నూరు ట్యాంక్ పనులపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. నశ్కల్ చెరువు నుంచి పాలకుర్తి చెరువు వరకు ప్రధాన కాల్వ పనులకు సంబంధించి వ్యయ అంచనాలను పెంచినట్టు తెలిసింది. ప్రస్తుత అంచనాలకన్నా అదనంగా మరో రూ.200 కోట్లకు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, దీనిపై పూర్తి స్థాయిలో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. నల్గొండ జిల్లాలోని ఏఎంఆర్​పీ కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ నిర్మాణం, డిజైన్లు, డ్రాయింగ్స్ ప్రిపరేషన్లకు సంబంధించి చర్చించారు. అవసరమైన చోట డిస్ట్రిబ్యూటరీ నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌ను పటిష్టపరచడంపైనా అధికారులు ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది.