డెడ్ స్టోరేజీకి చేరువలో జూరాల !.సాగునీరు నిలిపివేత

డెడ్ స్టోరేజీకి చేరువలో జూరాల !.సాగునీరు నిలిపివేత
  • అందుబాటులో ఉన్న నీరు అర టీఎంసీ కన్నా తక్కువే
  • ఇయ్యాల్టి నుంచి ఆయకట్టు పంట కాల్వలకు బంద్  
  • ఈ నెల 15 వరకు సాగునీరు ఇవ్వలేమన్న ఇరిగేషన్ ఆఫీసర్లు  
  • ప్రస్తుతం ఉన్న 0.382 టీఎంసీలు తాగునీటి అవసరాలకే..
  • ఈనెల చివరి వరకు నీరు ఇవ్వాలని ఆయకట్టు రైతుల డిమాండ్

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ లో డెడ్ స్టోరేజ్ అంచుకు చేరడంతో ఆయకట్టుకు సాగునీరు నిలిపివేస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు తేల్చిచెప్పారు. బుధవారం వరకు మాత్రమే కాల్వలకు నీరిచ్చి గురువారం నుంచి పంట కాల్వలకు బంద్ పెడతామ ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.382 టీఎంసీ( సగానికి తక్కువ) మాత్రమే ఉంది. ఆ నీటికి కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాల్సి ఉంది. ప్రాజెక్టులో గ్రాస్ కింద 3.002 టీఎంసీల నీరు ఉంది. దీంతో సాగునీటి అవసరాలకు వాడుకోవడానికి వీలులేదు.

ఏప్రిల్15 వరకు ఆయకుట్టుకు సాగునీరు అందిస్తామని గత నెలలో ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రకటించారు. చెప్పిన టైం కంటే వారం రోజుల ముందే నీటి విడుదలపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక నుంచి నీరు వస్తుందని భావించారు. చివరకు రాకపోవడంతో ఆయకట్టు రైతులకు నీరు అందని పరిస్థితి దాపురించింది. కొద్ది రోజుల కింద తెలంగాణ మంత్రుల బృందం నాలుగు టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా ఒక టీఎంసీ మాత్రమే వదిలింది.

అవి జూరాలకు చేరే సరికి 0.5 టీఎంసీ మాత్రమే అయ్యాయి. గత నెలలోనే ఆర్డీఎస్ తెలంగాణ వాటా(ఇండెంట్) కంప్లీట్ కాగా.. ఇంకా పంటలు చేతికి రాలేదు. ఇంకోవైపు ఏపీలోని కర్నూలు టౌన్ తాగునీటికి తుంగభద్ర నదిలోని ఆ రాష్ట్ర వాటా కింద (ఇండెంట్) ప్రస్తుతం వస్తుండ డంతో రైతులకు నీరు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ నీరు డి--–22 కాల్వల వరకే అందుతుంది. లేదంటే ఆర్డీఎస్ రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది. ఇక నడిగడ్డకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.  

వారబందీ పద్ధతిన నీరు ఇచ్చినా..

ఆయకట్టుకు వారబందీగా (వారంలో మూడు రోజులు) నీరు ఇచ్చినా సాగునీటి కష్టాలు తప్పవు. ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ప్రస్తుత యాసంగిలో ఎడమ కాల్వ కింద15 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 20 వేల ఎకరాల పంటలకు మాత్రమే వారబందీ నీటిని ఇస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటరీ 31 కెనాల్ నుంచి గద్వాల మండలం అనంతపురం వరకు ఆయకట్టు పరిధిలోని 15 వేల ఎకరాలకు ఈనెల 15 వరకు విడుదల చేస్తామని పేర్కొన్నారు.   బుధవారం ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 315 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. అనంతరం ఆయకట్టుకు నీరు బంద్ పెడతామని ఆఫీసర్లు నిర్ణయించారు. 

ఏపీ ఇండెంట్ తో ఆర్డీఎస్ కు నీరు

ఆర్డీఎస్ ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తుంగభద్ర నదిలోని తెలంగాణ వాటాను గత నెలలోనే 5 విడుతలుగా పూర్తిగా వాడుకుంది. ఆయకట్టు కింద పంటలు చేతికి రాలేదు. ప్రస్తుతం ఏపీ ఇండెంట్ నీరు ఆర్డీఎస్ కు వస్తుండగా.. ఆ నీటినే ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో నీరు ఇవ్వాలని రైతులు కలెక్టరేట్ ముట్టడి, రోడ్డు ఎక్కడం లాంటి నిరసన కార్యక్రమాలు చేశారు. అదృష్టవశాత్తు ఏపీ వాటా కింద ఏపీలోని కర్నూలు సిటీ తాగునీటి కోసం ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో అక్కడి నుంచి నీటిని తీసుకునే పరిస్థితి వచ్చింది.

ఆ నీరు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు.  వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్లు చెప్పినట్లు ఈనెల15 వరకే నీరు ఇవ్వాల్సి ఉండగా.. తమ పంటలు చేతికి రావాలంటే ఈనెల చివరినాటికి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు అంతకుముందే బంద్ చేయడంతో ఆందోళన చెందుతున్నారు.

మూడు ప్రాజెక్టుల్లో 72 వేల ఎకరాలకు సాగునీరు

యాసంగిలో నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల ప్రాజెక్టు, ఆర్టీఎస్ ప్రాజెక్టుల కింద మొత్తం ఆయకట్టు 2.66 లక్షల ఎకరాల ఉంది. ఇందులో ఈసారి యాసంగిలో 72 వేల ఎకరాలకు వారబందీన సాగునీరు అందించాలని ఇరిగేషన్ ఆఫీసర్లు నిర్ణయించారు. ప్రస్తుతం నెట్టెంపాడు ప్రాజెక్టు కింద అనుకున్న స్థాయిలో నీరు ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు వస్తున్నాయి. 

మూడు తడులకు ఇస్తేనే మేలు

మరో మూడు తడులకు ఈనెల చివరి నాటికి నీళ్లు ఇస్తేనే రైతులకు పంటలు ఎండిపోవు. లేదంటే పంటలు చేతికి రాని పరిస్థితి ఉంటుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు మాత్రం బుధవారం వరకు మాత్రమే నీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు.  కానీ పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా.. మరో మూడు తడులకు ఇస్తేనే పంట చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో నీరు లేకపోవటంతో ఇవ్వలేమని ఆఫీసర్లు చేతులెత్తేస్తుండగా.. ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇయ్యాల్టి నుంచినీటి విడుదల బంద్

జూరాల ప్రాజెక్టులో అర టీఎంసీ లోపే నీరుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంట పొలాలకు నీరు ఇవ్వలేం. బుధవారం సాయంత్రం వరకు మాత్రమే విడుదల చేస్తాం. ఆ తర్వాత బంద్ పెడతాం. వాస్తవంగా మంత్రి ఆదేశాలకు మేరకే మరో రెండు రోజులు రిస్క్ చేసి నీటిని ఇస్తున్నాం. గురువారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తాం.– రహీముద్దీన్, ఎస్ సీ జూరాల ప్రాజెక్టు

ఏపీ ఇండెంట్ తోనే సాగు నీరు  

ఆర్డీఎస్ ఆయకట్టుకు ప్రస్తుతం ఏపీ ఇండెంట్ తోనే సాగు నీరు అందుతుంది.  ఆ నీటిని డి-–22 వరకు ఇస్తున్నాం. మన ఇండెంట్ కాకపోవడంతో ఎప్పటి వరకు వస్తాయో చెప్పలేం. తుంగభద్ర నదిలో తెలంగాణ నీటి వాటాను గత నెలలోనే మొత్తం వాడుకున్నాం.– విజయ భాస్కర్ రెడ్డి,  ఈఈ ఆర్టీఎస్