మహిళా సంఘం బిల్డింగ్​ కట్టాలి..  పొద్దునకల్లా ఇరిగేషన్​ బిల్డింగ్​ ఖాళీ చేయండి

చెన్నూర్​, వెలుగు: పట్టణంలో మైనర్​ ఇరిగేషన్​ ఆఫీస్​ బిల్డింగ్​ను శనివారం ఉదయం లోపు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆఫీస్​ నుంచి ఇరిగేషన్​ ఆఫీసర్లకు శుక్రవారం సాయంత్రం నోటీసులు అందినట్టు సమాచారం. ఆ బిల్డింగ్​ను కూల్చి ఆ జాగలో మహిళా సంఘం భవనాన్ని కట్టనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వంద బెడ్ల ఆస్పత్రి కోసం ఇప్పటికే పట్టణంలోని ప్రకృతి వనాన్ని తొలగించారు. ఈ రెండు ఘటనల్లో ఎమ్మెల్యే తీరుపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. బస్టాండ్​ సమీపంలోని మైనర్​ ఇరిగేషన్​ బిల్డింగ్​ను రూ.10 లక్షల తో 2013లో నిర్మించి 2017లో ఓపెన్​ చేశారు. ప్రస్తుతం అందులో ఇరిగేషన్​ డీఈతో పాటు ఆ శాఖకు సంబంధించిన పలువురు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 50 ఏండ్లు ఉండేలా నిర్మించారు. ఈ బిల్డింగ్​ శిథిలావస్థకు చేరిందని తప్పుడు రిపోర్టులు తయారు చేసి, ఇరిగేషన్​ ఉన్నతాధికారులకు పంపి కూల్చేందుకు పర్మిషన్​ పొందినట్టు సమాచారం. ఇరిగేషన్​ ఆఫీస్​ను టెంపరరీగా మార్కెట్​ యార్డులోకి షిఫ్ట్​ చేయాలని, తర్వాత ఎల్లక్కపేటలోని సింగరేణి క్వార్టర్​ను పర్మినెంట్​గా కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది.

శనివారం ఉదయం 9గంటల్లోగా ఆఫీసును ఖాళీ చేయాలని, లేకుంటే సామాన్లు ఉన్నా కూడా బిల్డింగ్​ను కూల్చేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆఫీస్​ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఇందుకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నుంచి ఎన్​వోసీ కూడా లేదని సమాచారం. అయినా ఉన్నట్టుండి ఆఫీస్​ ఖాళీ చేయమనడంతో ఇరిగేషన్​ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎన్​వోసీ లేకుండా బిల్డింగ్​ను ఎట్ల కూల్చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వంద బెడ్స్​ హాస్పిటల్​ నిర్మాణం కోసం పట్టణంలోని అస్నాద్​ ఎక్స్​రోడ్డులో ఉన్న పట్టణ ప్రకృతి వనాన్ని కూడా మాయం చేశారు. దీనిని 2019లో రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. సుమారు 5వేల మొక్కలను పెంచిగా వాటిని పీకేశారు. పార్క్​ స్థలాన్ని పూర్తిగా చదును చేశారు. ఈ నెల 15న ఫైనాన్స్​, హెల్త్​ మినిస్టర్​ హరీష్​రావు చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండడంతో హడావుడిగా ఈ పనులు చేపడుతున్నారు.