- డ్యామ్ సేఫ్టీకి సంబంధించి అధికారులకు ఈఎన్సీ జనరల్ గైడ్‌లైన్స్
- డ్యామ్ బ్రేక్ అనాలిసిస్, డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ను చేపట్టాలి
- అన్ని ప్రధాన డ్యాముల గేట్లకు రిపేర్లుంటే చేయాలి
- ఇన్స్పెక్షన్, సర్వైలెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ క్రమం తప్పొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల భద్రతపై ఇరిగేషన్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను పరిశీలించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జనరల్ అనిల్ కుమార్.. చాలా ప్రాజెక్టుల్లో లోపాలను గుర్తించారు. పలు చోట్ల కట్టలు బలహీనంగా ఉంటే.. కొన్ని ప్రాజెక్టుల గేట్లు చాలా బలహీనంగా ఉన్నట్టు తేల్చారు. వాటి ఆపరేషన్ కూడా సరిగా లేదని నిర్ధారించారు. డ్యాముల భద్రతకు వెంటనే ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్(ఈఏపీ)ను తయారు చేయాలని ఆదేశించారు.
ఈ క్రమంలోనే ఈ నెలలో డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించి.. డ్యాముల నిర్వహణను పటిష్టపరచాలని సూచించారు. దానికి సంబంధించి పలు గైడ్‌లైన్స్‌ను తాజాగా జారీ చేశారు. జరగకూడని ప్రమాదాలు జరగకముందే డ్యాముల సర్వైలెన్స్, ఆపరేషన్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ను మెరుగుపరచాలని అధికారులకు ఈఎన్సీ సూచించారు. ఈ నెలాఖరులోపు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గేట్లకు రిపేర్లు చేయండి
ప్రాజెక్టుల గేట్లను క్రమం తప్పకుండా పరీక్షించాలని, సమస్యలు లేకుండా చూసుకోవాలని గైడ్‌లైన్స్‌లో ఈఎన్సీ అనిల్ కుమార్ సూచించారు. రిపేర్లుంటే వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ‘‘గేట్లు తుప్పుపట్టకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ మెకానికల్, హైడ్రాలిక్ మెకానికల్ కాంపొనెంట్లకు ఆయిల్ లేదా గ్రీస్‌తో లూబ్రికేషన్ చేయాలి. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనల ప్రకారం రిపేర్లు, మెయింటెనెన్స్ పనులను రిజిస్టర్లు, లాగ్‌బుక్‌లలో క్రమం తప్పకుండా నమోదు చేయాలి.
వాటిని ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఇన్స్పెక్షన్ అధికారులు పరిశీలించాలి. గేట్లకు సంబంధించిన అన్ని జనరేటర్లు పనిచేస్తున్నాయో లేదో చూసుకుని.. రిపేర్లు చేయించాల్సి వస్తే చేయించాలి. డ్యాముల వద్ద కబ్జాలు, ఆక్రమణలు ఏవైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో తొలగించాలి. ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టాలి’’ అని పేర్కొన్నారు.
ALSO READ : నీటివాటా పాపం బీఆర్ఎస్దే!
కాల్వలను పటిష్టం చేయండి
కాల్వల నిర్వహణను పటిష్టపరచాలని అధికారులకు ఈఎన్సీ సూచించారు. కాల్వల గట్లకు ఇరువైపులా చెట్లను నాటాలని, తద్వారా కాల్వ హద్దులను నిర్ధారించాలని స్పష్టం చేశారు. కాల్వల రెగ్యులేటర్లు, ఆక్వాడక్ట్లు, రిటెయినింగ్ వాల్స్, కెనాల్ హెడ్‌వర్క్స్‌కు 25 మీటర్ల వరకు ఎలాంటి పెద్ద చెట్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు ఉంటే తొలగించాలని ఆదేశించారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మాన్యువల్ ప్రకారం అన్ని నిర్దేశిత డ్యాములకు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్(ఈఏపీ)ను సిద్ధం చేయాలని ఈఎన్సీ అనిల్ ఆదేశించారు. డ్యాముల పూర్తి డిశ్చార్జ్ సామర్థ్యం ప్రకారం ఆయా డ్యాములకు డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ టెస్టులు చేయాలని, డ్యాముకు దిగువన ఏవైనా లోపాలుంటే సరిచేయాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల స్థాయిలపై రెవెన్యూ అధికారులకు సూచించి.. దాని ప్రకారం అక్కడి నుంచి ప్రజలను తరలించే అంశాలపై సూచనలు చేయాలన్నారు. అన్ని డ్యాములకు సమగ్ర డ్యామ్ భద్రత పరీక్షలను నిర్వహించాలని ఆదేశాలిచ్చారు.
దీనిపై ఫిబ్రవరి 15 నుంచి పూర్తి స్థాయిలో వాలంతరీలో శిక్షణను తీసుకోవాలని, మే 15 నాటికి అన్నింటినీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. డ్యాములకు ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తిగా ఆ డ్యామ్ ఓనర్లదే బాధ్యత అని తేల్చి చెప్పారు. డ్యాముల దగ్గర చెట్లు పెరిగితే వాటిని తొలగించాలన్నారు. జంగిల్ క్లియరెన్స్‌కు ప్రత్యేకంగా అంచనాలను తయారు చేయాలన్నారు. ఎలక్ట్రికల్ మెకానికల్, హైడ్రాలిక్ మెకానికల్ రిపేర్ల అంచనాలను సీఈ స్థాయిలో ఏర్పాటు చేసే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కమిటీతో సంప్రదింపులు జరిపి సిద్ధం చేయాలని సూచించారు.