పంట కాల్వ నిర్మాణంలో నాణ్యతకు తూట్లు .. స్పందించని ఇరిగేషన్​ అధికారులు

పంట కాల్వ నిర్మాణంలో నాణ్యతకు తూట్లు .. స్పందించని ఇరిగేషన్​ అధికారులు

లింగంపేట, వెలుగు: పదికాలాల పాటు పంటపొలాలకు సాగునీటిని అందించే పంట కాలువ నిర్మాణ పనుల్లో  కాంట్రాక్టర్​ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. లింగంపేట శివారులోని మత్తడి కాలువ నుండి చీరపేండ్ల కుంట వరకు ఉన్న సాగునీటి కాలువ  పూడుకపోవడంతో పాటు ఆక్రమణలకు గురైంది.  సాగునీరు అందక  పొలాలు బీళ్లుగా మారాయి. సమస్యను  ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు దృష్టికి కాంగ్రెస్​పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలువ మరమ్మతులకు రూ.49 లక్షల  మంజూరు చేశారు.  కాలువ, కల్వర్టుల నిర్మాణాల కోసం టెండర్లు పిలిచి పనులను ఓ కాంట్రాక్టర్​కు అప్పగించారు.

 ఇటీవల కాంట్రాక్టర్​ నిర్మాణాలను ప్రారంభించాడు.  అయితే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు.  పంట కాలువలో పేరుకుపోయిన బురదమట్టిని తొలగించకుండానే సైడ్​వాల్ నిర్మాణం చేపట్టాడు. ​గురువారం రాత్రి 7 గంటల వరకు బురద మట్టిలోనే పనులు చేపట్టడంపై లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, పలువురు రైతులు ఇరిగేషన్​ ఏఈఈపై ఆగ్రహం వ్యక్తం జేశారు. తాను ఇన్​చార్జిగా  వచ్చానని తనకేం తెలియదని చెప్పడంతో ఫోన్​లో ఇరిగేషన్ ఎస్ఈకి ఫిర్యాదు చేశారు.​

 ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నా ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్​తో ఇరిగేషన్​అధికారులు కుమ్మక్కయి నాణ్యత పాటించకున్నా పట్టించుకోవడంలేదని,   పనులు నాణ్యతగా  చేపట్టకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని మాజీ ఎంపీపీ ముదాం సాయిలు హెచ్చరించారు. ఈ విషయంపై డీఈఈ మనోహర్​రెడ్డిని వివరణ కోరగా లింగంపేటలో చేపట్టిన కాలువ, కల్వర్టుల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు 

తీసుకుంటామన్నారు.