
- అందుకు జంఝావతి రబ్బర్ డ్యామ్‌ను స్టడీ చేసిన అధికారులు
- దాని డిజైన్లు, నిర్మాణం, ఖర్చు ఆధారంగా ప్రణాళికలు
- రూ.వంద కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చని అంచనాలు
హైదరాబాద్, వెలుగు: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా పోతిరెడ్డిపల్లి వద్ద నిర్మించతలపెట్టిన రబ్బర్ డ్యామ్నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు స్టడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రబ్బర్ డ్యామ్‌లను పరిశీలిస్తున్నారు. వాటితో ఆయా రాష్ట్రాలు పొందుతున్న లబ్ధి, వాటి మన్నిక తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలోని విజయనగరం జిల్లాలో జంఝావతి నదిపై నిర్మించిన రబ్బర్ డ్యామ్‌పై అధికారులు స్టడీ చేసి వచ్చారు.
నల్గొండ సీఈ అజయ్ కుమార్, సీడీవో సీఈ మోహన్ కుమార్ల బృందం ఇటీవల అక్కడికి వెళ్లి వచ్చారు. రబ్బర్ డ్యామ్నిర్మాణానికి అయిన ఖర్చు, దాని పనితీరు గురించిన వివరాలను తెలుసుకున్నారు. దానికి అనుగుణంగా డిండి లిఫ్ట్‌లో నిర్మించే పోతిరెడ్డిపల్లి రబ్బర్‌డ్యామ్ డిజైన్లు, నిర్మాణంపై అధికారులు స్టడీ చేయనున్నారు.
350 మీటర్ల పొడవున రబ్బర్ డ్యామ్
జంఝావతి నదిపై 60 మీటర్ల పొడవుతో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు. 30 మీటర్ల చొప్పున రెండు సెక్షన్లలో దానిని 2006లో ఏర్పాటు చేశారు. అప్పట్లో దానికి ఖర్చు రూ.5 కోట్లు అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. జంఝావతి నదికి సంబంధించి డ్యామ్ కట్టేందుకు ఇంటర్ స్టేట్ వివాదాలు ఉన్నందున అక్కడ రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు. నీటిని లిఫ్ట్ చేసి రబ్బర్ డ్యామ్ ద్వారా కిందకు నీటిని వదులుతున్నారు. అయితే, డిండి రబ్బర్ డ్యామ్ మాత్రం.. జంఝావతితో పోలిస్తే పెద్దదని అధికారులు అంటున్నారు.
350 మీటర్ల పొడవున రబ్బర్ డ్యామ్‌ను నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 40 లేదా 50 మీటర్లకో గేట్‌ను అమర్చుకుంటూ దీనిని నిర్మించే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ రబ్బర్ డ్యామ్‌కు అనువైన డిజైన్ల పైనా స్టడీ చేయనున్నారు. దీనిని పూర్తి చేయడానికి రూ.వంద కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
రూ.1,800 కోట్లతో నిర్మాణం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.1,800 కోట్లతో పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్‌ను నిర్మించనున్నారు. ఏదుల నుంచి డిండి వరకు 27.9 కిలోమీటర్ల మేర కాల్వలు, సొరంగాల పనులు చేపట్టనున్నారు. ఏదుల నుంచి పోతిరెడ్డిపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించనున్నారు. అందుకు 800 మీటర్ల మేర అప్రోచ్ కెనాల్ తవ్వాలని ప్రతిపాదించారు. అక్కడి నుంచి 2.5 కి.మీ. మేర కాలువ, 16 కి.మీ. పొడవున టన్నెల్, 3 కి.మీ. కాలువ, 6.3 కి.మీ. వాగు నిర్మాణం కలిపి డిండికి లింక్ చేయనున్నారు.