‘మాల్​ తుమ్మెద’ లో 12 బోర్లున్నా నీళ్లు సరిపోతలే..

కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం మాల్​తుమ్మెదలోని సీడ్​ఫామ్​లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు సరిపోక పూర్తి స్థాయి భూముల్లో రైతులు విత్తన పంటలు సాగు చేయడం లేదు. దీంతో సమీపంలోని పోచారం ప్రాజెక్టు నుంచి  నీటిని లిఫ్ట్​ చేయాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పెట్టారు. సర్వే చేసిన ఇరిగేషన్​ఆఫీసర్లు డెడ్​స్టోరేజీ నుంచి లిఫ్ట్​చేయడం సాధ్యం కాదని రిపోర్ట్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 702 ఎకరాల్లో  సీడ్​ఫామ్..

మాల్​తుమ్మెదలో  సీడ్​ఫామ్​702 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా,  ఇందులో 61ఎకరాలు హార్టికల్చర్​కు కేటాయించగా, 5 ఎకరాల ఫారెస్ట్​ నర్సరీకి,  41 ఎకరాల్లో లేబర్స్​కు పట్టాలు ఇచ్చారు.  ప్రస్తుతం సీడ్​ఫామ్ కు 595 ఎకరాల భూమి ఉంది.  గతంలో వ్యవసాయ విస్తరణ ఆఫీసర్లకు కూడా ఇక్కడ ట్రైనింగ్​ఇచ్చేవారు. ప్రస్తుతం  ట్రైనింగ్​ సెంటర్​ను మూసేశారు.    ప్రస్తుతం ఇక్కడ వరి విత్తనాలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.  వానాకాలం సీజన్​లో దాదాపు వంద ఎకరాల్లోపు  సాగు చేస్తుండగా,  యాసంగిలో  40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సారి యాసంగిలో  60 ఎకరాల్లో  వరికి బదులుగా ప్రయోగాత్మకంగా పత్తి పంటను సాగు చేశారు. 

 సాగు నీటి కొరత

 సీడ్​ ఫామ్​లో 12 బోరు బావులు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు లేక బోర్లు పోయడం లేదు.  ఫామ్​పక్క నుంచే   పోచారం  కెనాల్ వెళ్తోంది.   బోర్లు,  పోచారం కెనాల్​ నుంచి నీటిని తీసుకొని   వరి పంటను సాగు చేస్తున్నారు. భూములు  రోడ్డుకు రెండు వైపుల ఉంటాయి. ఒక వైపు ఉన్న భూముల పక్క నుంచే కెనాల్​ వెళ్తుండగా, మరో పక్క భూములు నీళ్లందక బీళ్లుగా మారాయి.  

 పోచారం ప్రపోజల్స్​ పక్కకు..

మాల్​తుమ్మెద సీడ్​ ఫామ్​దగ్గరలోనే పోచా రం ప్రాజెక్టు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 2.4 టీఎంసీలు కాగా, పూడిక నిండి ప్రస్తుతం  1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటున్నాయి. 
 ప్రాజెక్టు డెడ్​ స్టోరేజీ నుంచి  పైపులైన్​ ద్వారా అగ్రికల్చర్,  హార్టికల్చర్ ​విత్తనోత్పత్తి క్షేత్రాలకు  సాగు నీటిని తరలించాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. దీనిపై అప్పటి అగ్రికల్చర్​ మినిస్టర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి  సీడ్​ఫామ్​ను విజిట్​చేసి పూర్తి భూమిని సాగులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోచారం  ప్రాజెక్టు నుంచి  లిప్ట్​ ద్వారా సాగు నీటిని తరలించే ప్రపోజల్స్​ను పరిశీలించాలని ఆఫీసర్లను ఆదేశించారు.  ఇరిగేషన్ ఆఫీసర్లు  సర్వే చేసి లిఫ్ట్​ చేసేందుకు రూ.12 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం తక్కువగా ఉండడం, లిప్ట్​ ద్వారా ఫామ్​కు నీటి తరలింపు  కష్టమేనని రిపోర్టు ఇచ్చినట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు.  ఆల్టర్నేట్​మార్గాల ద్వారా సాగు నీటి వసతిని కల్పించి ఎక్కువ విత్తన పంటలను సాగుచేయాలని రైతులు కోరుతున్నారు.