- ముందుకు పడని పోతారం లిఫ్ట్, గుంటిమడుగు బ్యారేజీ నిర్మాణాలు
- గతంలో డీపీఆర్ పూర్తయినా ప్రపోజల్స్పక్కన పెట్టిన బీఆర్ఎస్ సర్కార్
- గుండారం రిజర్వాయర్‌ను 2 టీఎంసీలకు పెంచాలని డిమాండ్
- ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 60వేల ఎకరాలకు సాగునీరు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. రూ.వందల కోట్లు కేటాయిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశమున్నా పట్టించుకోలేదు. డీపీఆర్ పూర్తయిన ప్రాజెక్టులనూ పక్కనపెట్టింది.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గుంటిమడుగు బ్యారేజీ, మంథని మండలంలోని పోతారం లిఫ్టు, గుండారం రిజర్వాయర్‌ను 2 టీఎంసీలకు పెంచాల్సి ఉండగా.. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ నిర్మాణాలు పూర్తికాక వేలాది ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొంది. కొత్త సర్కారైనా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి తమ పొలాలకు సాగునీరు అందిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు.
గుంటిమడుగుకు రూ.300కోట్లతో ప్రపోజల్స్
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్‌పల్లి సమీపంలోని భీమునిగుళ్ల, సుంకరికోట మధ్య నుంచి మానేరు ప్రవహిస్తోంది. ఇక్కడ 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.300కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశారు. డీపీఆర్కూడా ఆమోదం పొందింది. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడ్డాక నాటి కలెక్టర్ సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతర పరిణామాలతో ఈ ప్రపోజల్స్ పక్కకుపోయాయి. బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించలేదు.
ఈ బ్యారేజీ నిర్మాణంతో గోదావరిలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగంలోకి తేవచ్చు. ముంపు లేకుండా రెండు గుట్టల మధ్య 400 మీటర్ల పొడవునా నిర్మించే బ్యారేజీతో మానేరులో దాదాపు 9 కి.మీ, హుస్సేన్మియా వాగులో మరో 9 కి.మీ పొడవునా నీరు నిల్వ ఉండేది. దీనిద్వారా కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, మంథని, ముత్తారం, జమ్మికుంట, హుజూరాబాద్‌తోపాటు జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని సుమారు 50 నుంచి 60 వేల ఎకరాల పంటలకు నీరందించవచ్చు. ప్రస్తుతం జిల్లాలోని పొలాలకు ఎస్సారెస్పీ డీ83, డీ86 కాలువల ద్వారా అరకొరగా సాగునీరందుతోంది. గుంటిమడుగు బ్యారేజీ పూర్తయితే ఈ కాలువల కింద ఉన్న 62 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందించవచ్చని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.
లిఫ్టుతోనే సాగునీరు
పోతారం లిఫ్ట్ నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. పక్కనే గోదారి పారుతోంది. దీనిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీలున్నాయి. అయినా మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని టేల్ఎండ్ 20 గ్రామాల్లోని వేల ఎకరాలకు నేటికీ సాగునీరు అందడం లేదు. తెలంగాణ ఏర్పాటు కాకముందు మంథని నియోజకవర్గంలోని గుండారం కింది పొలాలకు ఎస్సారెస్పీ డీ83 కాలువ ద్వారా నీరందేది. 2007 నుంచి అది సరిగా అందడం లేదు.
గత ప్రభుత్వాల హయాంలో పోతారం లిఫ్ట్‌కు ప్రపోజల్స్ రెడీ చేయగా బీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టింది. తొమ్మిదేళ్లుగా పోతారం లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని రైతులు పోరాటం చేస్తున్నారు. దీంతోపాటు కమాన్పూర్మండలంలోని గుండారం రిజర్వాయర్ ప్రస్తుత నీటిసామర్థ్యం 0.5 టీఎంసీలు. దీని సామర్థ్యాన్ని 2 టీఎంసీలకు పెంచాలని స్థానిక రైతులు కొన్నేండ్లుగా డిమాండ్చేస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగా మంథని ప్రాంతంలో బ్యారేజీలున్నా ఇక్కడి పొలాలకు చుక్కనీరు అందడం లేదు. దీంతో స్థానిక రైతులు సాగునీరు కోసం రిజర్వాయర్ నీటి సామర్థ్యం పెంచడంతో పాటు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.