వనపర్తి, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒక పక్క గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండగా, కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఆగస్టు వస్తున్నా ప్రియదర్శిని జూరాల, శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీంతో ఈ సారి వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వానాకాలం సీజన్ కోల్పోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
నీటి నిల్వలు అంతంతమాత్రమే..
ఎగువన ఉండే ఆల్మట్టి ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 38 టీంఎసీలు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు ప్రాజెక్ట్ లో 98.5 టీఎంసీలు ఉండగా, వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. దాని కింద ఉన్న నారాయణపూర్ డ్యాం పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 17 టీఎంసీలే ఉంది. ఉజ్జయిని డ్యాం కెపాసిటీ 117 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 48.29 టీఎంసీలు ఉండి డెడ్ స్టోరేజీకి చేరింది. గత ఏడాది 95.17 టీఎంసీలు నిల్వ ఉంచుకొని మిగిలిన నీటిని జూరాలకు వదిలారు. జూరాల నీటి కెపాసిటీ 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజున జూరాలలో 8.42 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని, వరదను శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వదిలారు.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ లో 215.81 టీఎంసీలకు గాను, 33 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఈ పాటికే 183 టీఎంసీల వరద నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా, తాగునీటి కోసమని 144 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. గత ఏడాది ఈ సమయంలో నాగార్జునసాగర్ లో 176 టీఎంసీల నీరు చేరింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఒక్క టీఎంసీ కూడా అదనంగా చేరకపోగా, ప్రాజెక్ట్ లో ఉన్న నీరు రోజురోజుకు తగ్గుతోంది.
వానకాలం సీజన్ పై ఆందోళన..
వానాకాలం సీజన్ లో ఆగస్టు మొదటి వారంలోపు వరినాట్లు పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఈ సారి వర్షాలు లేకపోవడంతో రైతులు ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరం కూడా వరినాట్లు వేయలేదు. నారుమళ్లకు నీరు వదిలిన అధికారులు నాట్లు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవంటూ రైతులను హెచ్చరిస్తున్నారు. కృష్ణా బేసిన్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే తప్ప, ఈ 15 రోజుల్లో నీరు చేరే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నా, కర్నాటక, మహారాష్ట్ర, దక్షిణ తెలంగాణలో పెద్దగా వానలు పడడం లేదు.
జూరాల ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల కింద1.15 లక్షల ఎకరాలు వరి సాగవుతోంది. అలాగే కృష్ణానదిపై ఉన్న కేఎల్ఐ, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సంగంబండ, ఆర్డీఎస్ లింక్ కెనాల్ కింద 4 లక్షల ఎకరాలు వరి సాగు చేసుకునేందుకు అవకాశం ఉండేది. శ్రీశైలం బ్యాక్ వాటర్ పై ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా మోటార్లను ఆన్ చేయలేదు.
ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టని సర్కార్..
నాట్లు వేసేందుకు అదును దాటుతున్నా రైతులకు ప్రత్యామ్నాయం చూపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనం వహించడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతులు పోసుకున్న నారుమళ్లు 40 రోజులు కావడంతో ముదిరి పోతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలా? వద్దా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
నారుమళ్లు ముదరుతుండడంతో బోర్లు, బావులు ఉన్న రైతులు నాట్లు వేసుకుంటున్నారు. వర్షాలు కురవకపోతే మాత్రం మరింతగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
‘పాలమూరు’ లిఫ్ట్‌కు బ్రేక్..
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద నీటిని లిఫ్ట్ చేసేందుకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఏర్పాట్లు చేశారు. అయితే శ్రీశైలం డ్యాంలో నీరు చేరకపోవడంతో బ్యాక్ వాటర్ పంప్ హౌస్ ల వరకు నీరు చేరలేదు.
దీంతో అధికారులు వరద వస్తే మొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని అందించాకే, పాలమూరు సంగతి ఆలోచించాలని భావిస్తున్నారు. దీంతో పాలమూరు లిఫ్ట్ ప్రారంభంపై అధికారులు చేసిన హడావుడికి బ్రేక్ పడింది.