జూరాల ప్రాజెక్టు రైతులకు సాగునీటి కష్టాలు!

జూరాల ప్రాజెక్టు రైతులకు సాగునీటి కష్టాలు!
  • వారబందీ అమలు చేస్తున్న ఇరిగేషన్  ఆఫీసర్లు
  • సీ పేజ్  గేట్ల లీకేజీతో నీటి వృథా
  • ఏటా యాసంగిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు తప్పని తిప్పలు

గద్వాల, వెలుగు : జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జూరాల ప్రాజెక్టు కింద 1.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, యాసంగిలో జూరాల ప్రాజెక్టులో నీటి కొరత కారణంగా కేవలం లెఫ్ట్, రైట్ కెనాల్  కింద 35 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించే పరిస్థితి ఉంది. వారబందీ పద్ధతిలో సాగునీటిని ఇస్తుండగా, పంటలు చేతికొచ్చేంత వరకు తిప్పలు తప్పవని రైతులు అంటున్నారు. ఏండ్ల తరబడి జూరాల ప్రాజెక్టు సీ పేజ్​ గేట్ల నుంచి నీటి లీకేజీని అరికట్టడంపై ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ప్రతి యాసంగిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి తిప్పలు తప్పడం లేదు.

వారంలో రెండు రోజులే..

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద యాసంగికి వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్  ఆఫీసర్లు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులు కాలువలకు నీటిని వదిలి, ఆ తరువాత నాలుగు రోజులు నీటిని బంద్​ చేయాలని నిర్ణయించారు. కానీ, జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీళ్లు తగ్గుతుండడంతో బుధవారం నుంచి కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే( బుధవారం, గురువారం) నీటిని విడుదల చేసి మిగిలిన రోజుల్లో నీటిని బంద్​ పెడుతున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో పంట చేతికి వచ్చేంత వరకు నీళ్లు ఇస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పంటలకు 1.3 టీఎంసీలే..

జూరాల ప్రాజెక్టులో గ్రాస్  లెవెల్  స్టోరేజ్  5.089 టీఎంసీ ఉంది. ఇందులో 2.5 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకుంటుండగా, 1.3 టీఎంసీ మాత్రమే సాగునీటి అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన 1.2 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సి ఉంటుంది. 35 వేల ఎకరాల సాగుకు 1.3 టీఎంసీల నీటిని సర్దుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రతి ఏడూ యాసంగిలో తిప్పలే..

జూరాల ఆయకట్టుకు ప్రతి ఏడాది యాసంగిలో తిప్పలు తప్పడం లేదు. వాస్తవంగా రెండు పంటలకు జూరాల ప్రాజెక్టు ద్వారా నీరు అందించాల్సి ఉంది. కానీ, యాసంగిలో మాత్రం నీటిని అందించలేకపోతున్నారు. ఈ ఏడాది యాసంగిలో 35 వేల ఎకరాలకు వారబందీ పద్ధతిలో నీటిని ఇవ్వాలని ఇరిగేషన్  ఆఫీసర్లు నిర్ణయించారు. ఈ లెక్కన మరో 70 వేల ఎకరాలు ఈ యాసంగిలో బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ప్రతి యాసంగిలో నీటి కోసం రైతులు తిప్పలు పడుతున్నారు.

గేట్ల రిపేర్లపై నిర్లక్ష్యం..

జూరాల గేట్ల రిపేర్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 64 గేట్లు ఉండగా, అందులో కొన్ని గేట్ల ద్వారా సీ పేజ్​తో నీళ్లు కిందికి వెళ్లిపోతున్నాయి. గేట్ల సీ పేజ్​ నుంచి నీటి లీకేజీని ఆఫీసర్లు అరికట్టకపోవడంతో ప్రతిరోజు వెయ్యి నుంచి 1,500 క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతోంది. 2021లో గేట్ల రిపేర్​ కోసం రూ.12 కోట్లతో టెండర్లు పిలవగా, హైదరాబాద్ కు చెందిన స్వప్న కన్​ష్ట్రక్షన్  కంపెనీ పనులను దక్కించుకుంది. ఆరు నెలల్లో పనులు కంప్లీట్  చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 25 శాతం పనులు మాత్రమే కంప్లీట్  అయ్యాయి. 8 గేట్లకు రోప్  ముప్పు ఉన్నప్పటికీ, వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. లీకేజీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం రైతులకు శాపంగా మారుతోంది.

నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో వారబందీని మరో రోజుకు కుదించాం. గేట్ల రిపేర్ పై దృష్టి పెట్టాం. ఈ వారంలో కాంట్రాక్టర్ వచ్చి పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నాం.

రహీముద్దీన్, ఎస్ఈ, జూరాల ప్రాజెక్ట్