
- క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫేట్ సహా 15 రకాల పోషకాలు, లవణాల లభ్యతపై పరీక్షలు
- భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో టెస్ట్‌ల నిర్వహణ
కరీంనగర్, వెలుగు :తాగే నీటికి టెస్ట్‌లు చేసి అవి తాగొచ్చో, లేదో నిర్ధారించడం అందరికీ తెలిసిందే. అలాగే భూసార పరీక్షలు చేసి ఏ నేల ఏ పంటకు అనుకూలమైందో వ్యవసాయ శాఖ అధికారులు సూచించడం కూడా గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. ఇదే పద్ధతిలో పంటలకు పారించే సాగునీటిలో పోషకాలు, లవణాల మోతాదు ఎంత ఉందో తెలుసుకునేందుకు భూగర్భ జలవనరుల శాఖ లాబోరేటరీలను నిర్వహిస్తోంది.
కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ ల్యాబ్‌లలో ప్రతి ఏటా రెండు సార్లు తమ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో కొన్ని ఎంపిక చేసిన బోర్లు, బావుల నుంచి నీటిని సేకరించి క్వాలిటీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ నీళ్లు పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయా ? లేవా ? అనే విషయాన్ని నిర్ధారిస్తున్నారు. ఎవరైనా రైతులు ప్రత్యేకంగా తమ బావి లేదా బోరు నీళ్లను తీసుకొచ్చి టెస్టు చేయాలని కోరినా నిర్ణీత ఫీజు తీసుకుని చేసి రిపోర్టులు ఇస్తున్నారు.
పోషకాలు ఉన్న నీళ్లతో ఆరోగ్యకరమైన పంట
పంట ఏపుగా పెరగాలంటే భూసారం సమృద్ధిగా ఉండడంతో పాటు సాగునీటిలో తగినంతగా పోషకాలు ఉండడం కూడా ముఖ్యమేనని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. కలుషితమైన నీటిని పంటలకు పారిస్తే సరైన దిగుబడి రాదని పేర్కొంటున్నారు. అందుకే సాగునీటిని పరీక్షించి అందులో క్లోరైడ్, ఫ్లోరైడ్, పీహెచ్ వాల్యూ, సోడియం, పొటాషియం, సల్ఫేట్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, డిజాల్డ్వ్ సాలిడ్స్(డీఎస్), కార్బొనేట్, బైకార్బోనేట్, కాల్షియం జై టైట్రామెట్రిక్, హార్డ్‌నెస్, పొటాషియం, నైట్రేట్ తదితర పోషకాలు, లవణాల లభ్యతను నిర్ధారించి సాగునీటి స్వచ్ఛతను వెల్లడిస్తున్నారు.
ప్రతి ఏటా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టే మే నెలలో, అలాగే వర్షాల కారణంగా భూగర్భ జలాలు పై కొచ్చే నవంబర్‌లో నీటి నమూనాలు సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లోని ల్యాబ్‌ను ఆధునికీకరిస్తున్నందున ఆ ల్యాబ్ పరిధిలోని జిల్లాల నుంచి సేకరించిన శాంపిళ్లను కరీంనగర్, ఖమ్మం ల్యాబ్‌లకు తరలించి టెస్టులు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,653 శాంపిళ్లు
గతేడాది నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 3,653 శాంపిళ్లు సేకరించారు. ఇందులో ఆదిలాబాద్‌లో 39, కుమ్రంభీం అసిఫాబాద్‌లో 43, మంచిర్యాలలో 57, నిర్మల్‌లో 106, హన్మకొండలో 123, వరంగల్‌లో 149, మహబూబాబాద్‌లో 117, జనగామలో 85, జయశంకర్ భూపాలపల్లిలో 79, ములుగులో 87 శాంపిళ్లు సేకరించారు. అలాగే కరీంనగర్ జిల్లాలో 125, పెద్దపల్లిలో 160, జగిత్యాలలో 242, రాజన్న సిరిసిల్లలో 262, కామారెడ్డిలో 122, సిద్దిపేటలో 66, మెదక్‌లో 57, యాదాద్రిలో 65, మేడ్చల్ మల్కాజిగిరిలో 162, నిజమాబాద్‌లో 107, మహబూబ్‌నగర్‌లో 47, నారాయణపేటలో 31, సంగారెడ్డి జిల్లాలో 108, వికారాబాద్ జిల్లాలో 88 శాంపిళ్లను సేకరించి కరీంనగర్ ల్యాబ్‌కు తరలించారు
. అలాగే ఖమ్మం- జిల్లాలో 169, భద్రాద్రిలో 101, నాగర్ కర్నూల్‌లో 58, వనపర్తి-లో 174, సూర్యాపేటలో 116, రంగారెడ్డిలో 135, జోగులాంబ గద్వాలలో 137, నల్గొండ జిల్లా నుంచి 236 శాంపిళ్లను సేకరించి ఖమ్మంలోని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు.
రైతులు తీసుకొచ్చినాటెస్టులు చేస్తాం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని పంచముఖ హనుమాన్ టెంపుల్‌కు ఎదురుగా ఉన్న భూగర్భ జలవనరుల శాఖ ల్యాబ్‌లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన శాంపిళ్లను పరీక్షిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ బావి, బోరులోని నీటిని పరీక్షించుకోవాలని భావిస్తే 2 లీటర్ల నీటిని ల్యాబ్‌కు తీసుకొచ్చి టెస్టులు చేయించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వానికి డీడీ రూపంలో రూ.1,870 చెల్లించాలి. అవసరమైన పరీక్షలు నిర్వహించి సూచనలు చేస్తాం.- శ్యాంప్రసాద్‌నాయక్, డీడీ,భూగర్భ జల వనరుల శాఖ