ఓ ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ కూలీగా మారారు. కూలీలతో కలిసి పని చేశారు. అయితే.. ఆయన ఉద్యోగం పోయి, కష్టాల్లో ఉండటంతో కూలిగా మారలేదు. ఉపాధి హామీ కూలీల స్థితిగతులు తెలుసుకునేందుకు కూలీగా మారారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 2024, జూన్ 17వ తేదీ సోమవారం ఐఆర్ఎస్ అధికారి సందీప్ సందడి చేశారు. వారితోపాటు తట్టా, పార పట్టుకొని శ్రమించారు. మధ్యాహ్నం ఉపాధి కూలీలతోనే కలిసి భోజనం కూడా చేశారు.
ఇదే జిల్లా హుజూర్ నగర్ కు చెందిన అధికారి సందీప్ , బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్ లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. గ్రామాల్లో కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనుకున్నారు. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు.
ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. బతుకమ్మ పాటకు డ్యాన్స్ చేసి కూలీలను ఉత్సాహ పరిచారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. తనతో పాటు పని చేసిన 152 మంది కూలీలకు తన జీతం నుంచి ప్రతి ఒక్కరికీ 200 రూపాయలు అందజేశారు. ఓ ఉన్నతాధికారి తమతో కలిసి పని చేసి, భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు కూలీలు.