అమితాబ్ రిటైరవుతాడా!

బిగ్​-బీ తన అభిమానులు ఉలిక్కిపడే మాటొకటి అన్నారు. తన బ్లాగ్​లో… ‘నా మైండ్​ ఒక తీరుగా, నా వేళ్లు మరో తీరుగా పనిచేస్తున్నాయి. నేను రిటైరవ్వాల్సిందే’ అని రాసుకున్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు, యాక్టింగ్​ కెరీర్​లో యాక్సిడెంట్లు సైతం తట్టుకున్న బిగ్​–బీ… 77 ఏళ్ల వయసులో రిటైర్మెంట్​ గురించి ఆలోచించడాన్ని తప్పుబట్టలేం. కానీ, 50 ఏళ్లపాటు బాలీవుడ్​ని శాసించిన అమితాబ్​ రిటైర్మెంట్​ అభిమానులకు నిజంగా షాకే !

యాభై ఏళ్లుగా వెండితెరపై యాంగ్రీ యంగ్​మేన్​ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం… అమితాబ్​ బచ్చన్​. బిగ్​–బీ ఎవరని అడిగినా రెండో ఆలోచన లేకుండా ఆయన పేరే చెబుతారు. ఇండియన్​ సినిమాని ఇంత ఇన్​ఫ్లూయెన్స్​ చేసిన యాక్టర్​ మరొకరు లేరేమో! మధ్యలో కొన్నాళ్లు రాజకీయాల్లో ప్రవేశించినా, తన నేచర్​కి పాలిటిక్స్​ పనికి రావని గ్రహించి, మళ్లీ సినీ ఇండస్ట్రీకి వచ్చేశారు. అప్పటికి ఆయనకు హిట్లిచ్చిన మన్మోహన్​ దేశాయ్​, ప్రకాశ్​ మెహ్రా, శక్తి సామంత లాంటి దర్శక నిర్మాతలు సినిమాలు మానుకున్నారు. యశ్​ చోప్రాలాంటివాళ్లు జానర్​ మార్చుకున్నారు. బిగ్​–బీ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు సృష్టించిన రచయితలు సలీం–జావేద్​ విడిపోయారు. సెకండ్​ ఎంట్రీలో హీరోగా చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. కెరీర్ అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు పనికిరాకుండా పోయినట్లయ్యింది. షెహన్​ షా, అగ్నిపథ్​, జాదూగర్​, తూఫాన్​ లాంటి సినిమాలు భారీ బడ్జెట్​తో తీసినా అమితాబ్​ మేజిక్​ కనబడలేదు. అలాంటి టైములో తెలుగు రీమేక్​ సినిమా ‘ఆజ్​ కా అర్జున్​ (1990)’ వచ్చింది. సిల్వర్​ స్కీన్​ అల్లాడింది. మునుపటి యాంగ్రీ యంగ్​మేన్​ ఇప్పుడు పెరిగిన వయసుతో ‘యాంగ్రీ జెంటిల్​మేన్​’గా కనిపించాడు.​ ఆ వెంటనే వచ్చిన మరో పిక్చర్​ ‘హమ్​’. అమితాబ్​ పెద్దన్నగా కనిపించే ఈ సినిమా ముప్పయ్యేళ్లయినా మేజిక్​ చేస్తూనే ఉంది. ‘హమ్​’ సినిమాకి ఎన్ని భాషల్లో ఎన్ని కథలు తయారయ్యాయో చెప్పలేం. రజనీకాంత్​ ‘బాషా’, బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ లాంటివన్నీ హమ్​ ప్రేరణతో వచ్చినవే. గమ్మత్తేమిటంటే, ఎన్ని భాషల్లో తీసినా, ఎన్ని రకాలుగా మార్చి తీసినా… ‘హమ్​’లోని బేసిక్​ పాయింట్​ మాత్రం ఇప్పటికీ కాసులు కురిపిస్తోంది.

రీ–ఎంట్రీలో బ్రాండ్​ ఇమేజ్​

అమితాబ్​ తనను తానే అప్​గ్రేడ్​ చేసుకున్నారు. హమ్, ఖుదాగవా వగైరాల్లో హీరో హీరోయిన్లతో నిమిత్తం లేకుండా సక్సెసయ్యాయి. దాంతో అమితాబ్​ చుట్టూ తిరిగే పాత్రలు తయారయ్యాయి. షారూఖ్​ ఖాన్​, గోవింద, అక్షయ్​కుమార్​ ఇలా ఎందరెందరో కుర్ర హీరోలు ప్రవేశించినా, స్క్రీన్​ మీద అమితాబ్​ కనిపిస్తే చాలు, ప్రేక్షకులు థ్రిల్లయిపోయేవారు. ఎంత స్టార్​డమ్​ సంపాదించినా జీవితంలో ఒడిదొడుకులు సహజం. అమితాబ్​ రీఎంట్రీలో వచ్చిన సక్సెస్​ని వ్యాపారంలోకి టర్న్​ తిప్పారు. తన పేరునే బ్రాండ్​గా మార్చేసి కార్పొరేట్​ రంగంలో అడుగుపెట్టారు. 1995లో ‘అమితాబ్​ బచ్చన్ కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఏబీసీఎల్​)’ని స్థాపించి ఎంటర్​టైన్​మెంట్​ సెక్టార్​లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. సినిమాని ఒక ఇండస్ట్రియల్​ ప్రొడక్ట్​ తరహాలో ప్లానింగ్​ నుంచి ప్రమోషన్​ వరకు ఏబీసీఎల్​ చేపట్టింది. తెలుగులో మంచి హిట్టయిన ‘గులాబీ’ ఏబీసీఎల్​ తీసిందే. అప్పటివరకు విదేశాల్లో జరిగే అందాల పోటీలను ఇండియాకి తీసుకొచ్చిన రికార్డుకూడా అమితాబ్​దే. అదే అప్పులపాలు చేసిందికూడా!

54 ఏళ్ల వయసులో జూలు విదిల్చారు!

1996లో ‘ప్రపంచ సుందరి (మిస్​ వరల్డ్)’ కాంపిటీషన్​ని బెంగళూరులో నిర్వహించారు. ఈ పోటీల్ని దేశంలోని మహిళా సంఘాలు, ప్రోగ్రెసివ్​ అసోసియేషన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రపంచవ్యాప్తంగా 88 అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో గ్రీస్​ యువతి ఐరేన్​ స్కిలివా విజేతగా నిలిచింది. కానీ, ఏం లాభం! అమితాబ్​ పీకల లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇండియాలో జరిగిన మొదటి, చివరి ‘మిస్​ వరల్డ్​’గా మారింది. దాంతో, అమితాబ్​ బచ్చన్​కి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. అప్పటికి ఆయన వయసు 54 ఏళ్లు.  దేశం దృష్టిలో అమితాబ్​ ఒక డిఫాల్టర్​గా, ఇన్వెస్టర్లను ముంచేసిన కార్పొరేట్​ లీడర్​గా నిలబడాల్సి వచ్చింది. ఆ సమయంలో అమితాబ్​ ముందు రెండు సవాళ్లు నిలబడ్డాయి. ఒకటి… తాను ఆర్థిక కష్టాలనుంచి బయటపడడం. రెండోది… తనను తాను మళ్లీ నిరూపించుకోవడం.

హాట్​ సీటులో కేక పుట్టించారు

సరిగ్గా ఆ సమయంలో దూరదర్శన్​లో ప్రభుత్వ పథకాల ప్రచారం ఒప్పుకున్నారు. కొంత వెసులుబాటు వచ్చింది. అప్పుల నుంచి బయట పడగలనన్న ధైర్యం పుంజుకుంది. ఆ సమయంలో ‘స్టార్​ ప్లస్​’ చానెల్​ ఒక క్విజ్​ బేస్​డ్​ ప్రొగ్రాంని ప్లాన్​ చేస్తోంది. బ్రిటన్​లో సక్సెసయిన ‘హూ వాంట్స్​ టు బి మిలియనీర్​?’ని హిందీలో  అమితాబ్​ బచ్చన్​తో చేయాలనుకున్నారు. ‘కౌన్​ బనేగా కరోడ్​పతి’ పేరుతో 2000 సంవత్సరం జూలై 3న ఫస్ట్​ టెలికాస్టయ్యింది. అమితాబ్​ తన మెస్మరిజంతో మొదటి షో నుంచే జనాల్ని స్టార్​ ప్లస్​ నుంచి కదలకుండా చేసేశారు. కోటి రూపాయల ప్రైజ్​ మనీతో స్టార్టయిన ఈ ప్రోగ్రాం ఈ ఇరవై ఏళ్లలో పాపులారిటీ సాధించింది. ఇదంతా అమితాబ్​ బచ్చన్​ సింగిల్​ హేండెడ్​గా సాధించిన విజయమేనని చెప్పాలి.

ఒక పక్క కౌన్​ బనేగా కరోడ్​పతి నడుస్తుండగానే… తనకోసం సృష్టించిన పాత్రలకు న్యాయం చేసేవారు అమితాబ్​. బ్లాక్​, పా, పీకూ… ఇలా చెప్పుకుంటే అన్నీ వెరైటీ వేషాలేసిన సినిమాలే.  తొలి రోజుల్లో డాన్​గా నటించిన అమితాబ్​… చాలా ఏళ్ల తర్వాత మరోసారి ‘బుడ్డా హోగా తేరా బాప్​’లో వెటరన్​ డాన్​గా కనిపించారు. అందుకే, ఆయన రిటైర్​ కావాలని ఉంది అనగానే అభిమానులు షాక్​కి గురయ్యారు. జీవితంలో ఎదురుదెబ్బలు, యాక్టింగ్​ కెరీర్​లో యాక్సిడెంట్లు సైతం తట్టుకున్న బిగ్​–బీ… ఈ 77 ఏళ్ల వయసులో రిటైర్మెంట్​ గురించి ఆలోచించడాన్ని తప్పుబట్టలేం. కానీ, యాభై ఏళ్లుగా సిల్వర్​ స్క్రీన్​​ని, ఇరవై ఏళ్లుగా స్మాల్​ స్క్రీన్​ని శాసించిన అమితాబ్​ని వదులుకోలేం.

ఓపికున్నప్పుడే పరుగు ఆపడం

పరుగెట్టగలిగిన ఓపిక ఉంటే పరుగెడుతూనే ఉండాలని చాలా మంది చెబుతారు. యాక్టింగ్​ కెరీర్​లో అందనంత ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆపాలనుకున్న నటుడు శోభన్​బాబు. ఇప్పుడు అమితాబ్​ బచ్చన్​కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం చాలాకాలంగా సహకరించని మాట వాస్తవం. 1983లో ‘కూలీ’ సినిమాలో ఫైట్​ సీన్​ చేస్తున్నప్పుడు పొత్తికడుపుకు పెద్ద గాయమైంది. దేశమంతా నిర్ఘాంతపోయింది. నార్త్​, సౌత్​ తేడా లేకుండా, హిందీ, తమిళ్​ భాషాభేదం లేకుండా జనాలందరూ అమితాబ్​కోసం ప్రార్థనలు చేశారు. బహుశా ఒక నటుడికి దక్కిన అరుదైన గౌరవం కావచ్చు. అందరి ప్రార్థనలు ఫలించి, అమితాబ్​ కోలుకుని, మళ్లీ మునుపటి స్టామినాతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

ఖాళీకి అలవాటు పడాలి

రజనీకాంత్​ రైజ్​లో ఉన్న రోజుల్లోనే… అతను వదులుకున్న సినిమాలు శివాజీ గణేశన్​కి వచ్చేవట! ఓ రోజున రజనీతో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పనిలో ఊపిరాడకుండా గడపాలి’ అని నచ్చజెప్ప బోయాడు శివాజీ. దానికి సింపుల్​గా… ‘ఖాళీ సమయాన్ని గడపడానికి అలవాటు పడుతున్నాను’ అన్నాడు రజనీ. శివాజీ గణేశన్​కి పిచ్చెక్కినంత పనయ్యింది. కొన్నాళ్లకు శివాజీకి షూటింగ్​లు తగ్గిపోయేసరికి రజనీ అన్న మాటలు గుర్తొచ్చేవి. ‘నువ్వు చెప్పింది నిజమే. ఖాళీగా ఉండడానికి నేను అలవాటు పడలేదు’ అన్నాడు శివాజీ. అమితాబ్​కికూడా జిందగీలో ఖాళీగా ఉండడమేంటో తెలియదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవలసిందే!

యాంగ్రీ యంగ్​మేన్​.. కామెడీ

హీరో అంటే ఎలా ఉండాలో… సిల్వర్​ స్క్రీన్​కి కొన్ని పరామీటర్లున్నాయి. చెదరని క్రాఫ్​, నలగని డ్రెస్​, టక్​ చేసిన షర్టుపై కోటు, బూటు వగైరాలతో ఫెళఫెళలాడే కరెన్సీ నోటులా ఉండాలి. అమితాబ్​ బచ్చన్​ ఈ పరామీటర్లన్నీ తుడిచిపెట్టేశాడు. రఫ్​ లుక్​, చెవులు కప్పేసే పెద్ద క్రాఫ్​, లూజ్​ బెల్​బాటమ్​, అక్కడక్కడ పోగులు కనిపించే డెనిమ్​ జాకెట్​తో కొత్త హీరోలా బయటకొచ్చాడు. ఇదే పెద్ద ట్రెండ్​గా మారిపోయింది. అప్పటి వరకు హుందాతనంతో భారీ డైలాగులు కొట్టే యాక్టర్ల ప్లేస్​లోకి మాస్​ హీరో ఎంటరయ్యాడు. హీరోకూడా కామెడీ చేయగలడని రుజువు చేశాడు. డాన్​ సినిమాలో పాన్​ నమలడం, దీవార్​ సినిమాలో బీడీ కాల్చడం ట్రెండీగా మార్చాడు. యాంగ్రీ యంగ్​మేన్​లకు ఇవన్నీ కొత్త సోకులుగా మార్చేశాడు