అసోం లెక్క తప్పిందా?

అసోం లెక్క తప్పిందా?

అసోంలో విదేశీయుల ప్రాబ్లమ్ చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. ‘ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్’ (ఆసు) వంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లు, గణపరిషత్ వంటి రాజకీయ పార్టీలు ఈ సమస్యపై చాలా ఏళ్ల పాటు ఫైట్ చేశాయి. ఈ ఇష్యూ పైనే 1985లో అసోం ఒప్పందం కూడా కుదిరింది. ఇంత కీలకమైన అంశంపై  ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ నాలుగు రోజుల కిందట ఫైనల్ రిపోర్టు  రిలీజ్ చేసింది. ఈ రిపోర్టు, విదేశీయుల సమస్యకు ఫుల్ స్టాప్  పెడుతుందని అందరూ భావిస్తే కొత్త ప్రాబ్లమ్ కు తెరదీసేలా ఉందని చాలా మంది భావిస్తున్నారు. అసోంలో ఉన్న విదేశీయుల సంఖ్యను బాగా తగ్గించి చూపడమే రాజకీయపార్టీల మండిపాటుకు  కారణం.

జాతీయ పౌరుల రిజిస్టర్ ( ఎన్నార్సీ ) ఫైనల్ జాబితాపై దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ‘ఇదేం జాబితా’ అంటూ పెదవి విరిచాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో  ఆరేళ్లపాటు  పనిచేసి చివరకు కేవలం 19 లక్షలమంది మాత్రమే విదేశీయులని  లెక్క చెప్పడంపై  అన్ని పార్టీలు మండిపడ్డాయి. మిగతా విదేశీయులు ఎక్కడకు వెళ్లిపోయారని ప్రశ్నించాయి. అసోంలో  కనీసం 40 లక్షల మంది  విదేశీయులు ఉన్నారంటూ రాజకీయ నాయకులు చాలా మంది ఇదివరకే చెప్పారు.  ఇదే మాటను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంతకుముందే ఓపెన్​గా చాలాసార్లు చెప్పారు. 40 లక్షల మంది కాదు 50 లక్షల మంది వరకు ఉన్నారని 2004లోనే మాజీ కేంద్ర మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ చెప్పారు. సరైన లెక్కా పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారు 30 లక్షల మందికి పైగా ఉండొచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా 1992 లో మరో లెక్క బయటకు తీశారు.ఈ లీడర్లు చెప్పిన సంఖ్యకు ఎన్నార్సీ ఫైనల్ రిపోర్టులో పేర్కొన్న 19 లక్షలకు ఎక్కడా పొంతనే లేదు. దీంతో  ఎన్నార్సీ పని కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయిందని పొలిటికల్ పార్టీలు విమర్శించాయి. ఎన్నార్సీ పనితీరుపై  మండిపడ్డాయి.

ఎన్నార్సీ ఫైనల్ రిపోర్టు లోపాల పుట్ట

ఎన్నార్సీ ఫైనల్ రిపోర్టును లోపాల పుట్టగా  గౌహతి కేంద్రంగా పనిచేసే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్  ‘ అసోం పబ్లిక్ వర్క్స్’  ( ఏపీడబ్ల్యు) పేర్కొంది.అసోంలో కనీసం 41 లక్షల మంది విదేశీయులు ఉన్నారన్నది ఈ సంస్థ అభిప్రాయం. వీరిని లెక్క పెట్టడంలో  ఎన్నార్సీ  ఫెయిల్ అయిందని ఏపీడబ్ల్యు  విమర్శించింది. విదేశీయుల సంఖ్యకు సంబంధించి  ఫైనల్ రిపోర్టును తాము కొట్టిపడేస్తున్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎంతమంది ఫారినర్స్ సరైన సర్టిఫికెట్లు లేకుండా రాష్ట్రంలో ఉంటున్నారో మరోసారి లెక్క పెట్టాల్సిందిగా  కోరుతూ సుప్రీం కోర్టు కు వెళ్తామని ఏపీడబ్ల్యు చీఫ్ అభిజీత్ శర్మ చెప్పారు. అసోంలో విదేశీయుల సంఖ్య ను తేల్చి చెప్పడానికి సుప్రీంకోర్టు ఎన్నార్సీ వేయడంలో  కీలక పాత్ర పోషించింది ఈ సంస్థనే. 2006 నాటి ఓటరు జాబితాలో 41 లక్షల మంది పేర్లు అదనంగా ఉన్నట్లు ఏపీడబ్ల్యు సంస్థ గుర్తించింది. ఇందుకు సంబంధించి అసోం స్థానికులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ 2009 లో ఈ సంస్థ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కారణంగానే సుప్రీంకోర్టు 2013 లో ఎన్నార్సీ తయారు చేయమంది.

ముసాయిదాపై  ఏపీడబ్ల్యు  అబ్జెక్షన్

ప్రతీక్ హజేలా కో ఆర్డినేటర్ గా ఉన్న ఎన్నార్సీ 2018 జులై 30న తుది ముసాయిదా ను విడుదల చేసింది. దీనిపై ఏపీడబ్ల్యు  అబ్జెక్షన్ చెప్పింది. సరైన సర్టిఫికెట్లు లేని విదేశీయుల పేర్లు కూడా ముసాయిదాలో చోటు చేసుకున్నాయన్నది ఈ సంస్థ వాదన. దీంతో  అన్ని జిల్లాల నుంచి కనీసం 10 శాతం పేర్లపై  రీ వెరిఫికేషన్ చేయించాలని సుప్రీంకోర్టును అదే ఏడాది ఆగస్టు 24న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కోరింది.అయితే సర్టిఫికెట్లను మళ్లీ  పరిశీలించాల్సిన అవసరం లేదని ఎన్నార్సీ కో ఆర్డినేటర్ ప్రతీక్ చెప్పడంతో, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరగలేదు. ‘‘దీని ఫలితమే ఎన్నార్సీ  ఫైనల్ రిపోర్టు ఇన్ని లోపాలతో ఉండటం ”అన్నారు ఏపీడబ్ల్యు  చీఫ్ అభిజిత్ శర్మ.

అసోం గణ పరిషత్ కూడా…

ఈ రాష్ట్రంలో  బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అసోం గణ పరిషత్ ( ఏజీపీ) కూడా ఎన్నార్సీ రిపోర్టు పై  హ్యాపీగా లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సరిగా జరగలేదని మండిపడింది. బీజేపీ కూడా ఎన్నార్సీ  ఫైనల్ రిపోర్టు పై పెదవి విరిచింది. విదేశీయుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడింది. సర్టిఫికెట్ల పరిశీలనలో లోపాలు జరిగి ఉండొచ్చని బీజేపీ అసోం శాఖ ప్రెసిడెంట్ రంజిత్ దాస్ అన్నారు. ‘ హితేశ్వర్ సైకియా, శ్రీప్రకాశ్ జైశ్వాల్ వంటి లీడర్లు పేర్కొన్న లక్షలాది మంది  విదేశీయులు ఎక్కడకు వెళ్లిపోయారు ”అని ఆయన ప్రశ్నించారు.

ఒక పార్టీ లేదా సంస్థ అని కాదు అసోంకు సంబంధించి  దాదాపుగా అన్ని పొలిటికల్ పార్టీలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఫైనల్ లిస్టు పై మండిపడ్డాయి.

ఆ  నాలుగు లక్షలమంది ఏమైనట్టు ?

కిందటేడాది విడుదలైన ముసాయిదాలో 40 లక్షల 43 వేల 984 మంది పేర్లు లేవు. ఇలా పేర్లు లేనివారందరూ మళ్లీ సరైన సర్టిఫికెట్లతో  తమ పేర్లు ఫైనల్ లిస్టు  కోసం నమోదు చేసుకోవలసిందిగా కో ఆర్డినేటర్ ప్రతీక్ కోరారు. వీరిలో 4 లక్షల 17 వేల 354 మంది మళ్లీ క్లెయిమ్  చేసుకోవడానికి  ఎన్నార్సీ ఆఫీసు మొహమే చూడలేదు. వీరితో పాటు మొత్తంగా 19,06,657 మందిని ఫైనల్ రిపోర్టులో చేర్చడానికి అనర్హులుగా ప్రతీక్  ప్రకటించారు. వీళ్లలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం అసోంకు వచ్చిన వాళ్లే ఉన్నట్లు అధికారులు చెప్పారు. అందువల్లనే తమ సొంత రాష్ట్రాన్ని కాదని, అసోం పౌరసత్వం తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని తెలిసింది.ఇప్పటికే డైలీ వేజ్ మీద బతుకుతున్న కూలీలు, చిన్నా చితకా పనుల్లో  ఉన్న వారు, ప్రధానంగా బీహారీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.  ఇక మిగతా వాళ్లలో విదేశాల నుంచి వచ్చి అక్రమంగా అసోంలో ఉంటున్నవారు తమ ఉనికి బయటపడుతుందన్న భయంతో  రీ క్లెయిమ్ కు రాలేదని అధికారులు అంటున్నారు.

అసలైన సిటిజన్ల పేర్లు గల్లంతు 

ఎన్నార్సీ ఫైనల్ జాబితా పై  ‘ఆల్ అసోం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్’ కూడా  అసంతృప్తి గా ఉంది. కొన్నేళ్ల బట్టి  రాష్ట్రంలో సెటిలైన అసలైన సిటిజన్ల పేర్లు  తుది జాబితాలో గల్లంతయ్యాయని ఈ సంస్థ సలహాదారుడు అజీజుర్ రెహ్మాన్  ఆరోపించారు.
రాష్ట్రంలో ఇన్ని లక్షలమంది విదేశీయులు ఉన్నారంటూ  నాయకులు చెప్పడాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారాయన. లీడర్లు చెప్పే సంఖ్యకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వెరిఫికేషన్​ కార్యక్రమం సరిగా జరగలేదని మైనారిటీ నాయకులు ఆరోపించారు.