సీఎం కేసీఆర్​ మైనార్టీలకు బంధువు కాలేరా?

సీఎం కేసీఆర్​ మైనార్టీలకు బంధువు కాలేరా?

తెలంగాణలో 12.5 % జనాభా గల ముస్లిం మైనార్టీల ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి సీఎం కేసీఆర్​కు తెలియనివి కావు. ముస్లింల సమస్యల గురించి అందరి కంటే నాకే బాగా తెలుసు అని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు. 2014లో షాద్ నగర్ బహిరంగసభలో తమిళనాడు తరహాలో ముస్లింలకు 12 % రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ప్రకటించారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు బడ్జెట్ సబ్ ప్లాన్ అమలు చేస్తామని కూడా చెప్పారు. కేసీఆర్​ అధికారం చేపట్టి ఏడున్నరేండ్లు గడిచాయి. కారణాలేమైనప్పటికీ ముస్లిం మైనార్టీలకు 12 %  రిజర్వేషన్లు, బడ్జెట్ సబ్ ప్లాన్ హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకూ బడ్జెట్ సబ్ ప్లాన్ ఊసే లేదు. దళిత బంధు అంటున్న కేసీఆర్​ సర్కారు.. వారికంటే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మైనార్టీలకు బంధువు కాలేరా? కొత్తవి కాకపోయినా వారికి ఇచ్చిన హామీలనైనా వంద శాతం అమలు చేయలేరా?
ఏడేండ్లలో లోన్లు వచ్చింది కొంత మందికే
మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్స్ ఇస్తామని 2015–16 ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో 82 వేల మంది ఆన్​లైన్​ ద్వారా, 30 వేల మంది ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తం లక్షా 12 వేల మంది నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్లు వివిధ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డుల కోసం అప్పులు చేసి, వాటిని తీసుకుని మీసేవ కేంద్రాల ముందు రోజుల తరబడి క్యూలో నిలబడి దరఖాస్తు చేశారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో వారిలో 8 వేల మందికి మాత్రమే.. అదీ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల లోపు వారికే లోన్ శాంక్షన్ లెటర్స్ వచ్చాయి. అందులో సగం మందికి బ్యాంకులు సెక్యూరిటీ లేదని లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 500 మందికి మాత్రమే రుణాలు ఇస్తే మైనార్టీల సంక్షేమం ఏనాటికి అందేనో మీరే ఆలోచించండి? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు బడ్జెట్ కేటాయింపులు లేక అర్హులైన వారికి లోన్స్ అందడం లేదు. దీంతో వారంతా ప్రైవేటు ఫైనాన్షియర్స్ ఉచ్చులో పడి ఆర్థికంగా చితికిపోయారు. సుధీర్ కమిషన్ నివేదిక 68 శాతం ముస్లిం మైనార్టీ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయని చెప్పింది. 2015-–16 తర్వాత నుంచి నేటి వరకు మైనార్టీ లోన్స్ గురించి కొత్తగా ఒక్క దరఖాస్తు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోలేదు. దానికి కారణం బడ్జెట్ కేటాయింపులు లేక పోవడమే కదా? 
మైనార్టీ సంక్షేమానికి నిధుల కొరత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మైనార్టీ సంక్షేమానికి నిధుల కొరత ఉండదని ఆశించిన వారికి ప్రస్తుత పాలనలో తీవ్ర నిరాశే ఎదురైంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సగం కూడా విడుదల కావడం లేదు. విడుదల చేసిన ఆ కాస్త నిధులు కూడా ఖర్చు కావడం లేదు. తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయి. అదేమని అధికారులను అడిగితే తగినంత సిబ్బంది లేక ఖర్చు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. మైనార్టీ సంక్షేమానికి సరిపడా యంత్రాంగం లేదు. ఉన్న వారిలో డిప్యూటేషన్ ఉద్యోగులే ఎక్కువ మంది. 2017లో తగినంత మంది ఉద్యోగులను నియమిస్తామని సీఎం చేసిన ప్రకటన నీటి మీద రాతలాగ మారింది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు సిబ్బంది కొరతతో మైనార్టీ సంక్షేమం కునారిల్లుతున్నది. ఇలాగే కొనసాగితే మైనార్టీల అభివృద్ధి జరిగేదెన్నడు?
సొంత ఇంటి కల నెరవేర్చలేరా?
టీఆర్ఎస్​ సర్కారు నియమించిన సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ముస్లిం మైనార్టీల్లో 45 శాతం మంది అద్దె ఇండ్లలో ఉంటున్నారు. వారు సంపాదించిన దానిలో సగానికిపైగా అద్దె చెల్లించడానికే సరిపోతుంది. ఇక కుటుంబాలు గడిచేదెలా? డబుల్ బెడ్రూం స్కీం కింద ఇండ్లు వస్తే తరతరాలుగా అద్దె ఇండ్లలో ఉంటున్న తమకు సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సొంత ఇంట్లో కన్నుమూయాలని కలలు కంటున్నట్లు చాలా మంది వృద్ధులు ఆవాజ్ సర్వే సందర్భంగా చెప్పారు. వారి ఆశలు నెరవేరేదెప్పుడు? పేద మైనార్టీల సొంత ఇంటి కల నిజమయ్యేదెప్పుడు? వేల ఎకరాల వక్ఫ్ భూములను పేద మైనార్టీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడానికి వాడుకోవచ్చు కదా! ఎందుకు ప్రభుత్వం మైనార్టీల ఇంటి వసతి గురించి ఇంత నిర్లిప్తంగా ఉంది? దీనికి సమాధానం కోసం రాష్ట్రంలోని మైనార్టీలంతా ఎదురుచూస్తున్నారు.
అప్పుల భారంతో సతమతం
కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారిలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం మందే ఉన్నారు. ఎందుకంటే ముస్లింల్లో 98 శాతం మంది అస్థిరమైన ఆదాయ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్, ఫుట్ పాత్ లపై పూలు, పండ్లు, కూరగాయలు, చెప్పులు, బట్టలు లాంటివి అమ్మేవారు, మెకానిక్స్, పంచర్లు వేసేవారు, ఆటోలు, ట్రాలీలు, టాక్సీలు నడుపుకొని జీవించేవారు, హోటల్, బేకరీల్లో పని చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో చాలా మంది గిరాకీ లేక, పనులు దొరక్క అర్ధాకలితో బతుకుతున్నారు. ఫైనాన్స్ లో వాహనాలు తీసుకుని నడుపుతూ జీవించేవారు కిస్తీలు కట్టలేదని వారి వాహనాలను ఫైనాన్షియర్స్  లాక్కెళ్లిపోతున్నారు. ప్రైవేటు ఫైనాన్షియర్స్ వద్ద అప్పులు తెచ్చి వ్యాపారం చేసే వారికి అసలు, వడ్డీ కలిసి అప్పు మోయలేని భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి వారిని బయటపడేసేందుకు ‘మైనార్టీ బంధువు’ కాలేరా? అనే ప్రశ్న మైనార్టీల హృదయాల్లో  మెదులుతున్నది.
సమగ్ర ప్రణాళిక రూపొందించాలె 
పప్పు, బెల్లాల్లాంటి ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాలు మైనార్టీల జీవితాల్లో ఎలాంటి రోష్ని(వెలుగులు) తీసుకురాలేవు. కాబట్టి వారి జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే ఇచ్చిన హామీలు, సుదీర్ కమిషన్ సూచనలు వాస్తవరూపం దాల్చాలి. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం గురించి అఖిలపక్షం, మైనార్టీ సంఘాలతో చర్చించి  సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి, నిర్మాణాత్మకమైన సహకారం అందించడానికి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించి సత్వరం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
వక్ఫ్​ ఆస్తులను కాపాడేదెవరు?
ఇక వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 82 వేల ఎకరాల వక్ఫ్ భూములకుగానూ 20 వేల ఎకరాల వక్ఫ్ భూములు మాత్రమే మిగిలాయి. 50 వేల ఎకరాలకు పైగా భూమి కబ్జాలకు గురైంది. ఆ మిగిలిన 20 వేల ఎకరాల వక్ఫ్ భూములపై కూడా వందలకొద్దీ కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బోర్డు అధికారులు వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తామని, ఎండోమెంట్ బోర్డు తరహాలో వక్ఫ్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం వాగ్దానం చేశారు. కానీ అది కూడా ఇంకా నెరవేరలేదు. వక్ఫ్ భూముల గుర్తింపు కోసం మొదలుపెట్టిన రెండో వక్ఫ్ సర్వే నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో ఏ అధికారీ చెప్పలేని పరిస్థితి. కబ్జాదారుల కోరల నుంచి భూములను విడిపించి వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేస్తామని గొప్పగా చెప్పి.. ఏడున్నర ఏండ్ల ఏలుబడిలో ఒక్క ఎకరం కూడా కబ్జాదారుల నుంచి విడిపించలేకపోయారు. పైగా కబ్జాదారులు అధికారం అండతో మరింత రెచ్చిపోయి వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుంటున్నారు. వివిధ జిల్లాల కోర్టులు, హైకోర్టు అధికారులకు మొట్టికాయలు వేసినా వారిలో కదలిక లేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రంలోని వక్ఫ్ భూములను రక్షించే వారెవరు? వాటిని పేద మైనార్టీల అభివృద్ధికి ఉపయోగిస్తారని ఎలా నమ్మాలి?
                                                                                                                                                         - మహమ్మద్ అబ్బాస్, ప్రధాన కార్యదర్శి, ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ