Credit Score: ఈ కొత్త లొల్లి ఏంటి సామీ : విడాకులు తీసుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. !

Credit Score: ఈ కొత్త లొల్లి ఏంటి సామీ : విడాకులు తీసుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. !

CIBIL Score: ప్రస్తుత కాలంలో ప్రజలు పెరుగుతున్న తమ అవసరాలకు అనుగుణంగా రుణాలను తీసుకుంటున్నారు. అయితే రుణం పొందాలన్నా లేక క్రెడిట్ కార్డు కావాలన్నా అన్నింటి కంటే ముఖ్యమైనది క్రెడిట్ స్కోర్. అయితే దీనిని దెబ్బతీసే అనేక చిన్నచిన్న తప్పుల గురించి ప్రజలకు తెలుసు. అయితే పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకోవటం వల్ల వారి వ్యక్తిగత సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా అనే అనుమానాలు చాలా మందిలో ప్రస్తుతం ఉన్నాయి. అయితే కొన్ని పరిస్థితులు డైవర్స్ తీసుకున్న భార్యాభర్తల సిబిల్ స్కోర్ దెబ్బతీసే అవకాశం ఉంది. 

ఎలాంటి పరిస్థితుల్లో విడిపోయిన భార్యాభర్తల క్రెడిట్ స్కోర్ దెబ్బతినొచ్చు..

* భార్యాభర్తలు చట్టప్రకారం విడిపోయినప్పటికీ వారి పేరుమీద బ్యాంకులో ఉండే జాయింట్ ఖాతాలు క్లోజ్ చేసేంత వరకు అలాగే కొనసాగుతాయి. వారిద్దరి పేరుమీద తీసుకున్న హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డులు మూసివేసే వరకు అలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరైనా పేమెంట్స్ ఆలస్యంగా చేయటం వల్ల ఆ ప్రభావం ఇద్దరి క్రెడిట్ స్కోరును నాశనం చేస్తుందని గుర్తుంచుకోవాలి. 

* విడాకులు తీసుకున్న వ్యక్తి తన విడిపోయిన జీవిత భాగస్వామికి భరణం, మెయింటెనెన్స్ వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల తగ్గే ఆదాయం కొన్నిసార్లు చెల్లించాల్సిన ఈఎంఐ పేమెంట్స్ మిస్ కావటానికి దారితీయవచ్చు. అప్పుడు సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. 

* కోర్టు ఒక భాగస్వామిని రుణం తీర్చమని ఆదేశించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్లపై సంతకం చేసిన మరో జీవితభాగస్వామి కూడా జవాబుదారీగా చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందనేది వాస్తవం. కాబట్టి రుణంపై మీ పేరు ఉంటే.. మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల ఏదైనా చెల్లింపులు డిఫాల్ట్ కావటం మరో భాగస్వామి సిబిల్ స్కోరును దెబ్బతీస్తుంది. 

* చాలా కాలంగా భార్యాభర్తలు ఇద్దరి పేరుమీద ఏదైనా ఖాతా, క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే విడాకుల తర్వాత వాటిని క్లోజ్ చేసినట్లయితే.. అది క్రెడిట్ హిస్టరీని తగ్గిస్తుంది. అలాగే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను కూడా ప్రభావితం చేసి క్రెడిట్ స్కోర్ తగ్గేందుకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.