రోజుకో యాపిల్ తినడం మంచిదేనా?

‘ఎన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే’.. ఇంగ్లిష్‌‌లో చాలా పాపులర్ మాట ఇది! అంటే రోజుకో యాపిల్ తింటే రోగాలు రావు.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు అని దాని అర్థం. మరి ఈ మాట నిజమేనా? ఊరికే చెప్పేశారా? లేక దీనికేమైనా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా? అన్న అనుమానం రావడం మామూలే. అయితే రోగాలు రావడానికి కారణమయ్యే అంశాలను రోజుకో యాపిల్ తినడం ద్వారా దూరం చేయొచ్చని శాస్త్రవేత్తలు వేర్వేరు పరిశోధనల్లో కనిపెట్టారు. మనిషికి ఎటువంటి జబ్బు రావడానికైనా ప్రధానమైన కారణం శరీరంలోని కణాలు వీక్‌‌ అయ్యి రోగ కారకాలను ఎదుర్కోలేకపోవడమే. ఈ కణాల డ్యామేజ్‌‌ జరగకుండా అడ్డుకోవడంలో యాపిల్‌‌లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని సైంటిస్టులు గుర్తించారు.

రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని అందరూ చిన్నప్పటి నుంచీ వింటున్నదే. అలా తినడం వల్ల ఏం మంచి జరుగుతుందన్నది మాత్రం చాలా మందికి తెలియదు. అసలు యాపిల్ వల్ల నిజంగానే రోగాలు రాకుండా అడ్డుకోవచ్చా? అని కనిపెట్టడం కోసం కొన్ని పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలు రీసెర్చ్ చేశాయి. యాపిల్ తినడం ద్వారా వచ్చే ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ వల్ల కణాలు డ్యామేజీ కాకుండా బలంగా ఉంటాయి. హైబీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్లు, అల్జీమర్స్, పార్కిన్‌‌సన్స్‌‌ లాంటి చాలా జబ్బులు రాకుండా ఈ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు.

ఫైటోన్యూట్రియంట్స్ అంటే?

మొక్కల నుంచి లభించే పోషకాలను ఫైటోన్యూట్రియంట్స్ అంటారు. రకరకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లోనూ ఈ న్యూట్రియంట్స్ దొరుకుతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వేర్వేరు ఆహార పదార్థాల్లో 4 వేల రకాల ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. వాటిలో అతి కొద్ది ఫైటోన్యూట్రియంట్స్​పై మాత్రమే ఇప్పటి వరకు సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. అయితే యాపిల్, ముల్లంగి, సోయాబీన్స్, బెర్రీస్ ఇలా కొన్నింటిలో ఉండే ఫిటోన్యూట్రియంట్స్‌‌ మన శరీరంలో సెల్ డ్యామేజ్‌‌ని అడ్డుకుంటాయని వారి పరిశోధనల్లో గుర్తించారు. ఈ ఫుడ్స్ తినడం ద్వారా కేన్సర్, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్‌‌సన్స్ లాంటి జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుందని తెలిపారు.

లక్ష మందిపై 24 ఏండ్ల పాటు స్టడీ

రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. అంతే కాదు అతి తక్కువ స్థాయిలో బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. దీనికి కారణం యాపిల్‌‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంజిలియా, అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చర్లు కలిసి 1,24,086 మందిపై అధ్యయనం చేశారు. 24 ఏండ్లపాటు ఈ రీసెర్చ్‌‌ని కొనసాగించి, ఆ తర్వాత తమ స్టడీ రిజల్ట్‌‌ వెల్లడించినట్లు సైంటిస్టులు తెలిపారు. వయసుల వారీగా ఆడ, మగ వాళ్లను మూడు గ్రూప్స్‌‌గా చేసి ఈ రీసెర్చ్ చేశారు. స్టడీ మొదలయ్యే నాటికి యావరేజ్‌‌గా 36 ఏండ్ల వయసు ఉన్న మహిళలు ఒక గ్రూప్‌‌గా, 48 ఏండ్ల వయసున్న లేడీస్ గ్రూప్ మరొకటి, 47 ఏండ్ల వయసున్న మగవాళ్ల గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులను మళ్లీ ఒక్కోదానిలో రెండు టీమ్స్ పెట్టారు. అందరికీ ఒకే రకమైన కంట్రోల్డ్‌‌ డైట్ ఇచ్చారు. అయితే ఒక టీమ్‌‌కు రోజూ యాపిల్ కూడా ఇచ్చారు. ఈ యాపిల్ తిన్న టీమ్స్‌‌లోని వారు బరువు పెరగకపోగా, సగటున ప్రతి నాలుగేండ్లలో రెండేసి కిలోల చొప్పున తగ్గారు. అదే మిగిలిన వాళ్లు సుమారు 900 గ్రాముల వరకు పెరిగారు. మిడిల్ ఏజ్‌లో కొద్ది వెయిట్ పెరిగినా సరే బీపీ, షుగర్ లాంటివి వచ్చే ముప్పు పెరుగుతుందని ప్రొఫెసర్ ఎడిన్ కాసిడీ తెలిపారు. రోజూ యాపిల్ తినడం ద్వారా బరువు పెరగకుండా కంట్రోల్ చేయడంతో పాటు 30 ఏండ్ల వయసు దాటిన తర్వాత పైన పడే లైఫ్‌‌ స్టైల్ జబ్బులను దూరంగా ఉంచొచ్చన్నారు. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడమంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అని చెప్పారు.

సెల్ డ్యామేజ్‌‌ కంట్రోల్ ఎట్ల?

యాపిల్‌‌లో ఫ్లేవనాయిడ్స్‌‌తో పాటు ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్ ఫుల్‌‌గా ఉంటాయి. సెల్ డ్యామేజ్‌‌ను అడ్డుకోవడంలో ఫైటోన్యూట్రియంట్స్‌‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్‌‌ది కూడా కీ రోల్‌‌. శరీరంలో ఆక్సిజన్ ఇంబ్యాలెన్స్ కారణంగా జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కణాలను డ్యామేజ్‌‌ చేస్తుంది. పొల్యూషన్‌‌లోకి వెళ్లినప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు, ఎక్సర్‌‌‌‌సైజ్ చేసేటప్పుడు  ఫ్రీ ర్యాడికల్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ కావడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌‌ పెరుగుతుంది. ఎక్కువ బరువు ఉన్నవారిలో ఇది మరింత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే సెల్ డ్యామేజ్‌‌కి దారి తీస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వచ్చే యాంటీఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ ర్యాడికల్ సెల్స్‌‌కు చెక్ పెడతాయి. దీంతో సెల్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతాయి. ఫ్రీ ర్యాడికల్స్‌‌లో విపరీతమైన హెచ్చుతగ్గులు రాకుండా స్టేబుల్‌‌గా ఉండేలా చేయడం ద్వారా కణాల్లో వాటంతవే రిపేర్ చేసుకునే శక్తి పెరిగి, చాలా రకాల అనారోగ్య సమస్యలు రాకుండా చూడొచ్చు. రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా ఈ పని జరుగుతుందని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె సంబంధిత రోగాలు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యల ముప్పు చాలా తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. అలాగే అతిగా బరువు పెరగకుండా, కొలెస్ట్రాల్ తగ్గించడం, ఈజీగా ఆహారం జీర్ణమైపోవడంలోనూ యాపిల్ సాయంపడుతుందని వెల్లడించారు.

నేరుగా తింటేనే మేలు

రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందని, అల్జీమర్స్‌‌తో పాటు మతిమరుపుకి సంబంధించిన అన్ని జబ్బుల రిస్క్‌‌ను తగ్గిస్తుందని జర్మనీకి చెందిన సెంటర్ ఫర్ న్యూరోడీజెనరేటివ్ డిసీజెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనా ఫలితాల ఆధారాలతో పక్కాగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామన్నారు. యాపిల్‌‌లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ బ్రెయిన్ సిగ్నల్స్ ట్రాన్స్‌‌ఫర్ చేసే న్యూరాన్లు బలహీనం కాకుండా చూడడంలో ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెయిన్‌‌లో  న్యూరాన్ల స్టిమ్యులేషన్ ప్రాసెస్‌‌ (న్యూరోజెనిసిస్)లోనూ యాపిల్ తొక్కలో ఉండే క్వెర్సెటిన్, లోపలి కండలో ఉండే డీహైడ్రాక్సీబెజోయిక్ యాసిడ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. అయితే యాపిల్‌‌ను జ్యూస్ చేసుకుని తాగితే ఈ రకమైన ప్రయోజనం దక్కదని, యాపిల్‌‌ను నేరుగా తింటేనే ఉపయోగం ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వ్యక్తిని కట్టేసి కొట్టిన నలుగురు అరెస్ట్​

నిలోఫర్ లో 3 నెలలుగా జీతాల్లేవ్

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన