చట్టప్రకారమా..తొందరపాటా? : జయప్రకాశ్ ​నారాయణ, లోకసత్తా వ్యవస్థాపకులు 

సూరత్‌‌ కోర్టు రాహుల్‌‌ గాంధీకి క్రిమినల్‌‌ కేసులో శిక్ష వేయడం, అనంతరం ఒక్కరోజు లోపలే లోక్‌‌సభ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేయటం చకచకా జరిగిపోయాయి. దీనిపై కాంగ్రెస్​సహా పలు పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయంలో మనం కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. లోక్‌‌సత్తా ఉద్యమంలో నేను ఈ దేశంలో నేర చరిత్రకు, నేరస్తులకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. నేర రాజకీయం పోవాలని నినాదం ఇచ్చిందే నేను. 1999 అసెంబ్లీకీ, లోక్‌‌సభకు పోటీ చేస్తున్న వాళ్లలో కరడుగట్టిన నేరస్తులందరినీ గుర్తించి, మంచి ప్రమాణాలను పెట్టి పార్టీలకు, ప్రతిపక్షాలకు అతీతంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత స్థాయి అధికారులు, నిష్కల్మషమైన అధికారులు, నిష్పాక్షికమైన నిజాయతీ కలిగిన అధికారులు, నిపుణులు, న్యాయ కోవిదులు వారందరితో కూర్చొని, ఎవరెవరు నేరాలు చేస్తున్నారు, నేర చరిత్ర ఎవరికున్నదని నిర్ధారణ చేసి బయటపెట్టాం. దేశంలో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

దాన్నుంచి కోర్టు కేసులయ్యాయి.  అక్కడి నుంచే విధిగా ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు వాళ్ల నేర చరిత్రను ప్రకటించాలన్న చట్టం వచ్చింది. ఆ చట్ట రూపకల్పనలో లోక్‌‌సత్తా చాలా పోరాడింది. దాన్ని విధిగా పాటించాలని ఎన్నికల సంఘం ముందు, సుప్రీంకోర్టు ముందు పోరాడినం. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌‌ కలాం, ప్రధాని వాజ్‌‌పేయ్‌‌ల సపోర్ట్‌‌తో సుప్రీంకోర్టులో పోరాడి మంచి చట్టాన్ని సాధించగలిగాం. ఇవాళ విధిగా ఎన్నికల్లో పోటీచేసే వారి నేర చరిత్రను బయటపెట్టాలి. కాబట్టి కచ్చితంగా ఈ దేశంలో నేరచరిత్ర పోవాలి. నేరస్తులకు రాజకీయాల్లో ప్రవేశం ఉండకూడదు. చట్టాన్ని ఉల్లంఘించే వారు చట్టాన్ని చేసే వాళ్లు కాకూడదు. ఓ వైపు ‘చింతిస్తున్నా’ అంటే సమసిపోయే కేసు, మరోవైపు అప్పీలు తీర్పు తెలిసేవరకు ఆగకుండానే లోక్​సభ సభ్యత్వం రద్దు .. రెండూ మంచి పరిణామాలు కావు.

ఎన్నికల సంఘానికి విన్నపం

ఇప్పుడు నేను ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దీన్ని వంకగా తీసుకొని త్వరలో మీరు ఉప ఎన్నికను ప్రకటించబోకండి. రేపు కోర్టులో అప్పీలు కనుక ఈ కేసుని స్టే చేయొచ్చు, కన్విక్షన్‌‌ అంటే నేరం జరిగినట్టుగా నిర్ధారణ స్టే చేయొచ్చు లేదా ఆరేడు నెలల్లో తీర్పే రావొచ్చు. నిర్దోషి అని చెప్పొచ్చు,  లేదా కేసు వేగవంతం చేయమనొచ్చు,  శిక్ష రెండేళ్ల కంటే తగ్గించొచ్చు. ఇన్ని భిన్న అవకాశాలు ఉన్నపుడు, ఈ లోపు ఎన్నికలు పెడితే సమస్య మరింత జఠిలం అయిపోతుంది. అందుకే ఉప ఎన్నికకు వెంటనే పిలుపునివ్వొద్దు. రాజకీయ పార్టీలు పట్టుబట్టకండి. ఇక పై కోర్టు కూడా వెంటనే ఈ కన్విక్షన్‌‌ మీద అనర్హత వర్తించకుండా స్టే చేసినట్లయితే దేశ ప్రజాస్వామ్యానికి మంచిది. పెద్ద పెద్ద పార్టీలు, లక్షల మంది ఎన్నో త్యాగాలు, వాళ్ల ఆశలు, ఆశయాలు, ఊహలు ప్రజాస్వామ్యానికి ప్రతిరూపాలు.

కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, అలా అని పార్టీని ఆషామాషీగా తీసుకోకూడదు. పార్టీలో కీలకమైన నాయకులంతా కూడా  చిన్న చిన్న సాంకేతిక కారణాలతో డిస్‌‌క్వాలిఫై చేయడం సబబుకాదు. అది ప్రజాస్వామ్యంలో జరిగే పని కాదు. చివరికి ఎవరు కావాలో ప్రజలే తీర్పునివ్వాలి. అరుదైన సందర్భాల్లో కరడుగట్టిన నేరస్తులను కచ్చితంగా తొలగించాలి. పొరపాటున కూడా క్షమించకూడదు. కానీ, ఆ అస్త్రాన్ని  ప్రతిచోటా వాడకూడదు, పెళ్లికి చావుకి ఒకటే మంత్రం వేస్తే అది సార్ధకం కాదు. ఇక రాజకీయ వ్యవస్థ అంతా కలిసొచ్చి ఒక్కసారి పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి రాజకీయం నడి బజారున పడకుండా, ప్రజల పరిహాసానికీ, వేళాకోళానికి గురికాకుండా, విశ్వసనీయత దెబ్బ తినకుండా, కోర్టులకి చులకన కాకుండా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలని నిపుణులతో సంప్రదించాలి.

చర్చ అవసరం

మాజీ ప్రధాన న్యాయ మూర్తులున్నారు, న్యాయమూర్తులున్నారు, న్యాయ కోవిదులున్నారు, అవినీతికి వ్యతిరేకంగా రాజకీయంలో స్వచ్చత కోసం పోరాడినవారున్నారు. వారందరితో కూర్చొని ఏకాభిప్రాయాన్ని సాధించి చట్టంలో కావాల్సిన మార్పులు తెండి. అంతేకానీ,  మొత్తం రాజకీయం  భ్రష్టు పట్టిపోవద్దు. ఈ కేసులో మనం చాలా మెచ్చుకోవాల్సింది, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాకుండా  రాహుల్‌‌ మంచోడా, మోదీ మంచోడా అని కాకుండా తీర్పునిచ్చే జడ్జి ఎలాంటి వాడు అన్నది మనకనవసరం, రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం మలచడం ఎట్లా? ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేయడమెట్లా? ఇష్టమొచ్చిన వారికి ఓటేసుకుందాం, ఇష్టమొచ్చిన వారిని గెలిపించుకుందాం.. ఇష్టం లేకపోతే ఓడించేసుకుందాం అంతేకానీ రాజకీయాన్ని పలచన చేయొద్దు. అలా చేస్తే అది దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అవుతుంది. ఇప్పటికే తొందరపాటు, ఆనాలోచిత మాటలతో రాజకీయాన్ని భ్రష్టు పట్టించాం. అందుకే దయచేసి అందరూ కూడా నింపాదిగా ఆలోచించండి. ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకు రండి.

2013 సుప్రీం నిర్ణయం కీలకమైంది

ముఖం మీద కోపంతో ముక్కును కోసుకున్నట్టు రాజకీయం మీద కోపం పెంచుకోకూడదు. ముందుగా రాజకీయం, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పోకుండా చూసుకోవాలి. 2013లో సుప్రీంకోర్టు మంచి ఉద్దేశంతోనే కావొచ్చు చాలా తొందరపడింది. అప్పటి వరకూ ఏం జరిగిందంటే! కొన్ని చట్టాల కింద లేదా ఏ చట్టమైనా కూడా రెండేళ్లకు మించి శిక్ష పడినట్లయితే వాళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. కానీ దీనికొక మినహాయింపు ఇచ్చారు, అదేమిటంటే అప్పటికే చట్ట సభలో సభ్యుడిగా ఉండి, శిక్షకు గురైతే, వాళ్లు కోర్టుకు అప్పీల్‌‌ చేసుకుంటే, అప్పీల్‌‌లో తీర్పు వచ్చేదాకా అనర్హత వర్తించదు అన్నారు.

దాని ఉద్దేశంఏమిటి? అకస్మాత్తుగా అనర్హత ప్రకటించి ఉప ఎన్నిక పెట్టినట్లయితే, ఆ ఎన్నికల్లో ఇంకొకరు గెలిచినట్లయితే ఈ మధ్యలో పైకోర్టులో గనుక కింది కోర్టు తీర్పు రద్దు చేసినట్లయితే రాజకీయం గందరగోళంలో పడుతుంది. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది. అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ ఐదేండ్ల కాలంలో ఒకవేళ శిక్ష పడ్డా కూడా అప్పీలు వచ్చేవరకూ పదవి నుంచి తొలగించొద్దు అన్నది మంచి ఆలోచన.  ఎన్నికల సంఘం పొరపాటు వల్ల ఏం జరిగిందంటే,1952 నుంచి ఎన్నికల్లో ఒకసారి శిక్ష పడ్డా కూడా అప్పీలు చేసుకుంటే 20 ఏండ్ల తర్వాత తీర్పు వస్తే ఆ 20 ఏండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తీర్మానించారు. ఆ నిర్ణయం చాలా తప్పు. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం సముచితమైందే. అంతవరకూ ఆగకుండా కోర్టు ఏమి చేసిందంటే, ఆ పదవీ కాలంలో, అప్పీలు ఉన్నా కూడా తక్షణం పదవి పోతుందని తీర్మానం చేసింది. అది నా దృష్టిలో రాజకీయంగా దూరదృష్టితో ఆలోచించి చేసింది కాదు. ప్రజాస్వామ్యం మీద దూరదృష్టితో కూడా చేసింది కాదు.

సాంకేతికంగా కరెక్టే అయినా..

రాజకీయం నాశనమై పోయిందని, నేరస్తులంతా నాయకులవుతున్నారని, అవినీతి పరులు సమాజాన్ని దోచుకుంటున్నారని, అధికార దుర్వినియోగం చేస్తున్నారని, భ్రష్టు పట్టిస్తున్నారంటూ మనమంతా కోపంలో మాట్లాడుకుంటుంటాం. అది నిజం కావొచ్చు. కానీ కోర్టు ఆచి తూచి, విజ్ఞతతో, చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని నిలబెట్టాలి. వాడికి శిక్ష పడగానే తక్షణం పదవి రద్దయిపోతుందనడం సరికాదు. మనకు రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినట్లుగా, లోక్‌‌సభ సభ్యత్వం 108వ అధికరణ కింద ఎన్నికల సంఘమిచ్చిన సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయం చేస్తారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినట్లయితే 173వ అధికరణ కింద గవర్నరు నిర్ణయం చేస్తారు.  ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇదంతా వద్దు వెంటనే రద్దయిపోవాలని గతంలోనే చట్టం  చేసేశారు. ఇప్పుడు రాహుల్​ గాంధీ విషయంలో అది చూపించి, లోక్‌‌సభ సెక్రెటేరియట్​ ఆయన సభ్యత్వం వెంటనే రద్దు చేసినట్టు ప్రకటించేసింది. అంత తొందరపడాల్సిన అవసరం లేదు. సాంకేతికంగా వాళ్లు చేసింది కరెక్ట్ కావొచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం కనుక. - జయప్రకాశ్ ​నారాయణ, లోకసత్తా వ్యవస్థాపకులు