పరేడ్​ గ్రౌండ్ ​సభ క్లారిటీ ఇచ్చినట్లేనా?

ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏండ్లలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినా.. పెద్దగా రాజకీయ ప్రసంగాలు చేయలేదు. కొన్ని నెలల క్రితం బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో మొదటి సారి రాజకీయ ప్రసంగం చేసి వెళ్లారు.  భ్రష్టాచార్​, పరివార్ ​వాద్​ పై మాట్లాడినా.. ఓ మోస్తరుగా బీఆర్​ఎస్​ పాలనపై బాణాలు ఎక్కుపెట్టిపోయారు తప్ప వాటిని వదలలేదు. పరేడ్​ గ్రౌండ్​ ప్రసంగం కొంత సూటిగా, స్పష్టంగా కనిపించింది. ‘‘నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. జవాబు చెపుతారా ? ’’అంటూ సూటిగా సభికులనే అడిగారు.  ‘భష్టాచారియోంకే ఖిలాఫ్​ లడ్​నా చాహియే.. నహీ లడ్​నా చాహియే? భష్టాచారియోం పే ఖానూనీ కారవాయి కర్​నా చాహియే.. నహీ కర్​నా చాహియే?’అని ప్రధాని అడిగిన ఈ ప్రశ్నలకు సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. హర్షధ్వానాల నడుమ చప్పట్లు, ఈలలతో సభ మారుమోగిపోయింది. అవినీతి పాలకులపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సభికులు ఆమోదం తెలిపారు. బహుశా మోడీ మనసులోనూ ఒక సంశయం తొలగిపోయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై యుద్ధం ప్రకటిస్తే.. కేసీఆర్​ కు ప్రజల్లో ఎక్కడ సానుభూతి వస్తుందోనని ఇంత కాలం ఆగుతూ వస్తున్నారనే అభిప్రాయమూ ఉంది. ప్రజల్లో ఉన్న స్పందన ప్రధానికి చాలా స్పష్టంగా అర్థమయి ఉంటుందనే చెప్పాలి. మొత్తం మీద, బేగంపేట సభ కంటే, పరేడ్​ గ్రౌండ్​ సభ చాలా మేరకు క్లారిటీ ఇచ్చిందనడంలో అనుమానం లేదు.

ఢిల్లీ వెళ్లరు, ధర్నా చెయ్యరు

తెలంగాణ స్వతంత్ర్య దేశమా, భారత్​లో భాగమా అని విజ్ఞులైన ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి జవాబు చెప్పడంలో తొమ్మిదేండ్లుగా కేంద్రం అలసత్వం ప్రదర్శించింది. ప్రధాని మోడీ పరేడ్​గ్రౌండ్​ప్రసంగం అవినీతిపరులపై చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు అనిపించింది. ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఇంతకాలం తెలంగాణ నష్టపోయింది. స్వీయ పొగడ్తలు పడకేస్తే గానీ, మన సీఎంకు  ఢిల్లీ పథకాలు గొప్పగా కనిపించవు. అప్పట్లో ఆయుష్మాన్​ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదన్నారు. నిధులు కరువై ఆరోగ్యశ్రీ ఆగిపోతుంటే.. ఆయుష్మాన్​ భారత్​ను ఆరోగ్యశ్రీలో కలిపేసుకున్నారు. పీఎం ఆవాస్​యోజన కన్నా డబుల్​ బెడ్రూం ఇండ్లే బెటర్​అన్నారు. డబుల్​బెడ్రూం పథకం పడకేస్తుంటే.. ఆవాస్​యోజనను డబుల్​ బెడ్రూం పథకంలో కలిపేసుకున్నారు. కేంద్రం ఒక్కపైసా ఇవ్వడం లేదనే రొటీన్​ డైలాగ్​తో రాజకీయంగా బతకనేర్చారు తప్ప, ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం కావాలో అడగరు. అడిగినా.. ఇవ్వకపోతే, జంతర్​మంతర్​వద్ద సీఎం గానీ, ‘ముఖ్యమైన’ మంత్రి గానీ ఎన్నడైనా ధర్నా చేశారా? వీరి పొలిటికల్​డ్రామాలను ఢిల్లీ పాలకులు భరిస్తారేమో గానీ, తెలంగాణ ప్రజలు భరించలేకపోతున్నారు. ​కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణలో ఏండ్లపాటు అమలుకు నోచుకోలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎన్నడూ మందలించింది గానీ, సంజాయిషీ అడిగింది గానీ లేదు. నమ్మిన పాలకుడి వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందనే విషయం ప్రధాని ఇప్పటికైనా గమనించి ఉంటే అది తెలంగాణకు మంచిదే.

దేశానికి, వైరుధ్యానికి తేడా తెలియని రాజకీయం 

రాజకీయ వైరుధ్యం వేరు. దేశం వేరు. కానీ తెలంగాణ పాలకులకు రాజకీయానికి, దేశ సార్వభౌమత్వానికి తేడా లేకుండా పోయింది. కేంద్రం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న దాఖలా లేదు. తెలంగాణను రాష్ట్రంగా కాకుండా, దేశంగా భావించే ధోరణి ముఖ్యమంత్రి, ‘ముఖ్యమైన’ మంత్రి మాటల్లో అడుగడుగునా కనిపిస్తున్నది. తెలంగాణకు తామే రాజు, ప్రజలు పాలితులు మాత్రమే అనే రాజకీయ అహంభావం వారి ఏమాటలో చూసినా కనిపిస్తుంది. దీన్ని తెలంగాణ ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కేంద్రం ఇన్నేళ్ల నుంచి ఎందుకు భరిస్తూ వచ్చిందో తెలియదు! ఢిల్లీ దాకా వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అన్ని సమాచారాలను రాబట్టుకొని హైదరాబాద్​ నుంచి తనదైన రాజకీయం నడిపే నాయకుడిలో తనకు  ఎదురే లేదనే ధోరణి కనిపించడం లేదా? ఒక రాష్ట్రాన్ని, ఒక సమాంతర దేశంగా పాలించే తీరు.. దేనికి సంకేతం? అది తన ఏకఛత్ర పాలన కోసం తప్ప రాష్ట్రం కోసమా? అలాగే,  తెలంగాణ కేంద్రానికి రూ.2.70 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం తెలంగాణకు రూ.1.70 లక్షలే ఇస్తున్నదనే వాదనలో  దేశం పట్ల గౌరవం ఉన్నదా? స్వీయ గొప్పతనం చాటుకోవాలనే వాదన తప్ప, దేశం పట్ల అవగాహన ఉన్నదా?  దేశ రక్షణ, కేంద్ర పాలన, అంతర్జాతీయ వ్యవహారాలు కేసీఆర్​ కుటుంబానికి అక్కర లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అవసరం ఉంది. దేశానికి అతీతమైన పాలకులమనే ధోరణి వారిలో బాగా ప్రబలిపోయింది. తెలంగాణలో ప్రభుత్వం తమ కోసం తప్ప, ప్రజల కోసం కాదనే ధోరణి మరింత అనర్థంగా మారింది. ఎఫ్​ఆర్​బీఎమ్ ద్వారా​ అప్పుల కట్టడి ఎలా చేస్తారంటారు? ఇష్టారీతిన అప్పులు తెచ్చి దుబారా చేసే హక్కు తమకే ఉందంటారు! అటు కేంద్రం సూచనలను తప్పుపట్టడమే ఒక రాజకీయ క్రీడగా మార్చుకొని, ఇటు తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకోవడం వారికి నిత్యకృత్యమైంది. రాజకీయ వైరుధ్యం దేశ విరుద్ధంగా మారిపోతున్నది. గత ఎనిమిదేండ్లలో తామిచ్చిన ‘అతి అలుసు’ ఇవాళ ఎక్కడికి తెచ్చిందో ప్రధానికి అర్థమై ఉంటది! అవినీతే జరిగి ఉండకపోతే.. భయమెందుకు? సీబీఐ, ఐటీ, ఈడీ, మోడీ, బోడీ ఎగతాళి రాజకీయంతో.. తమ అవినీతిని  ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనే ధోరణి మితిమీరిపోతున్నది. వినే ప్రజలకే వారి ధోరణి జీర్ణం కాలేకపోతున్నపుడు.. కేంద్ర పాలకులు ఎలా వినగలుగుతున్నారని సామాన్యుడిలో వచ్చిన అనేక ప్రశ్నలకు పరేడ్​గ్రౌండ్​ సభలో ప్రధాని ప్రసంగం జవాబు ఇచ్చినట్లేనా అంటే.. కొంత కాలం వేచి చూడాల్సిందే! 

పొలిటికల్ క్లారిటీ రావాలె

రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రూపం మార్చుకున్న ఓ ప్రాంతీయపార్టీ. చిన్న పార్టీలను పక్కన పెడితే, ప్రధాన ప్రతిపక్షాలుగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్​ తమ జాతీయ రాజకీయాలకు అనుగుణంగా తెలంగాణలో రాజకీయాలు నడుపుతున్నాయి. అది బీఆర్ఎస్ కు ఒక ఆటవిడుపుగా మారింది. ఈ రెండు పార్టీల ఢిల్లీ రాజకీయ అవసరాలే, తెలంగాణలో వాటి  బలహీనతా? ఈ ధోరణి వల్లే బీఆర్ఎస్​ను ఓడించే బలమైన ప్రతిపక్షం ఏదో తెలంగాణ ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. బలమైన ప్రతిపక్షం ఏదో వారు తెలుసుకోవడానికి  పొలిటికల్​ క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ఎపుడొస్తుందని తెలంగాణ రాజకీయ యవనిక ఎదురుచూస్తున్నది. అందుకు పరేడ్​ గ్రౌండ్​సభలో ప్రధాని మోడీ ప్రసంగం మాటల వరకు క్లారిటీ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇవ్వాల్సిందల్లా చేతల క్లారిటీ మాత్రమే. త్వరలో ఆ క్లారిటీ కూడా వస్తే, బీఆర్​ఎస్ ను ఎదుర్కొనే బలమైన ప్రత్యామ్నాయంగా మారేది బీజేపీయే అని ప్రధానికి  తెలిసేఉంటుంది.  తెలంగాణలో బీజేపీ బలం గడప దాకా చేరింది. కానీ అవినీతి చర్యలపై ఉలుకు పలుకు లేకపోవడమే  గడపను  దాటించ లేకపోతున్నదని  ఇప్పటికైనా  ఆ పార్టీ గుర్తించగలిగితే మంచిదే! 

అవినీతిపై దర్యాప్తులు జరపాలి


తెలంగాణ గోస పడుతున్న అనేక విషయాలు కేంద్రం ఏ మేరకు గమనిస్తున్నదో తెలియదు. తెలంగాణ లక్షలాది రైతుల బతుకులను ‘ధరణి’ ఆగంపట్టిస్తున్నది. హైదరాబాద్​చుట్టూ ఉన్న ఖరీదైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వేలాది ఎకరాల భూములే, వేల కోట్ల అవినీతికి అడ్డాలుగా మారాయనే చర్చ జరుగుతున్నది. భూములు, ప్రాజెక్టులు, ఇసుక, మైనింగ్​లే అవినీతికి కేరాఫ్​అడ్రస్​గా మారాయంటున్నారు. ఆ అవినీతే జాతీయ రాజకీయాలకూ ఫండింగ్​చేసే స్థాయికి వెళుతున్నదని ప్రజల్లో చర్చ కూడా మొదలైంది. కాళేశ్వరం నుంచి మిషన్​భగీరథ దాకా అవినీతి ఆరోపణలకు లెక్కేలేదు. వాటికి అనుమతులు కేంద్ర జలసంఘమే ఇచ్చింది. ఆ అనుమతుల ప్రకారం వాటి నిర్మాణం జరిగిందా లేదా? విలువకు తగ్గ నిర్మాణాలు జరిగాయా లేదా? అనే దానిపై కేంద్ర జలసంఘంతో దర్యాప్తు జరిపించే అధికారం కేంద్రానికి ఉందనే అనుకుంటున్నాం. ఒకవేళ ప్రత్యక్ష దర్యాప్తు చేసే చాన్స్​ లేకపోతే. పిటిషన్లతో కోర్టులతోనైనా  దర్యాప్తు అనుమతులు సాధించే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయలేక పోతున్నది? కాంగ్రెస్​ వంటి ప్రతిపక్షం కూడా ఆ పని చేయొచ్చనే చర్చ తెలంగాణ బుద్ధిజీవుల్లో బలంగా ఉంది. కనీసం కేంద్ర పథకాల అమలులోనైనా అజమాయిషీ చూపలేకపోతున్న  కేంద్రం.. తెలంగాణ పాలకుల ఇష్టారాజ్యాన్ని, అవినీతిని కట్టడి చేయలేకపోతున్నదనే అపవాదును ఎలా తుడిచేసుకుంటుందనేదే కీలకం.

కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​జర్నలిస్ట్​