తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానం, కేసీఆర్ పాలన ఎలక్షన్ నుంచి ఎలక్షన్ వరకు అన్నట్లు సాగుతోంది తప్ప ప్రజలు, పరిపాలన అనే అంశాల మీద ఇసుమంత కూడా దృష్టి ఉండటం లేదు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు, వ్యూహాలు, వనరులు సిద్ధం చేయడం తప్ప వచ్చే జనరేషన్ కు బతుకు బాటలు వేసే ప్రయత్నం చేయడం లేదు. కేసీఆర్ ఏ పనిచేసినా పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆయనకు ఉండదు. ఐదేండ్లు పాలించడం కోసం ప్రజలు అధికారం కట్టబెడితే ముందస్తు ఎన్నికలు ఎందుకు? ప్రజాగ్రహం ఎక్కువ కాకముందే ఎన్నికలకు వెళ్లి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందాలని కాకపోతే!.
ప్రజల దృష్టి మళ్లించే యత్నం..
2014 ఎన్నికల్లో ప్రజలు 2019 వరకు తమను పాలించాలని గెలిపిస్తే 2019 ఎన్నికల్లో పార్లమెంట్ తో కలిసి ఎన్నికల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయం అని భావించి మధ్యలోనే కాడెత్తేసి 2018లో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ,చంద్రబాబు అనైతిక పొత్తును అడ్డుపెట్టుకొని, ఆంధ్రా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి పొందాల్సినంత రాజకీయ లబ్ధి పొంది మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బాబు కూటమిని ఓడించడం కోసం ప్రజలు టీఆర్ఎస్వైపు నిలబడ్డారు. బీజేపీపై ప్రేమ ఉన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని ఓడించే పార్టీగా టీఆర్ఎస్ను చూశారు. ఆ తర్వాత కేసీఆర్ ఊహించినట్టే 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలు గెలిచి 5వ మహబూబ్ నగర్ సీటు స్వల్ప తేడాతో కోల్పోయింది.
ముందస్తు పేరుతో..
రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ప్రజల్లో కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు బీజేపీ రోజురోజుకు పుంజుకుంటోంది. బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై దృష్టి సారించడం కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది. అందుకే పాలన గాడిలో పెట్టడం చేతగాక ముందస్తు, జాతీయ రాజకీయాల డ్రామాలకు తెర లేపారు. కేసీఆరే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ముందస్తు అంటారు. కానీ ఆయన అసెంబ్లీ రద్దు చెయ్యరట! ‘ఎన్నికల డేట్ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తా.. దమ్ముంటే రండి’ అంటున్నారు. అంటే ఆయన సవాల్ ఎన్నికల కమిషన్ తోనా? అసెంబ్లీ రద్దు చేయకుండా తేదీ ప్రకటించండని ఎన్నికల కమిషన్ తోనే ఆటలాడుతున్న ఆయనకు ఓటమి భయంతో మతిభ్రమించినట్టుంది. ఇదంతా ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నమే. ఆయన మీద ఏదో కుట్ర జరిగిందని, అన్యాయం చేశారని, లేని లొల్లి సృష్టించి ఎన్నికలకు వెళ్లి సానుభూతితో గెలవాలన్న తపన మాత్రమే. ఈ విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
పాలనను గాడిన పెట్టలేకే..
అసలు విషయం ఏంటంటే రాష్టంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. పాలన కుంటుబడింది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్త పింఛన్లు రాక గ్రామాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఉద్యోగులకు, టీచర్లకు జీతాలు ఆలస్యమవుతున్నాయి. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక ఇబ్బంది పడుతున్నారు. పోడు రైతుల వ్యవసాయ భూములు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. సర్కారు బడుల్లో కనీస సౌకర్యాలు లేవు. పుస్తకాలు రాలేదు, చాక్ పీస్ లు లేవు, మరుగుదొడ్లు సరిగ్గా లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇన్ని సమస్యలతో రాష్టం అల్లకల్లోలం అవుతుంటే పాలనను గాడిలో పెట్టడం చేతగాక రోజుకో రకంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు రండి అనే మంత్రులకు ఏమైనా సోయి ఉందా? బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు రమ్మంటున్నారు. మరి టీఆర్ఎస్పార్టీ 543 స్థానాల్లో పోటీ చేస్తుందా? లేకపోతే 542 స్థానాల్లో పోటీ చేసి ఒక సీటు హైదరాబాద్ లో ఎంఐఎంకు వదిలేస్తుందా? 543 స్థానాల్లో సొంతంగా 303 స్థానాలు ఉన్న బీజేపీని 8 సీట్లున్న పార్టీ సవాల్ చేసి పార్లమెంట్ రద్దు చెయ్యాలనడం ఏనుగుకు ఎలుకకు పోటీ పెట్టి, ఏనుగుతో కొట్లాడిన ఎలుక అని ఎలుకను గొప్పదాన్ని చెయ్యడమే అవుతుంది. బీజేపీ సవాల్ చేస్తున్నది. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆయనకు దుబ్బాక, హుజూరాబాద్ దెబ్బల లైన్ తప్పదు. కేసీఆర్ పూర్తిగా వాళ్లు గురువు చంద్రబాబు లా ప్రవర్తిస్తున్నారు. బాబు లెక్కనే నేను కూడా బీజేపీని గోకుతూనే ఉంటా అంటున్నారు. చంద్రబాబు గోక్కొని గోక్కొని తోలు ఊసి, ఆఖరికి గోర్లు కూడా ఊడిపోయి ఇంట్లో ఉన్నారు. వీరికీ అదే గతి పడుతుంది. ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఇద్దరూ మనువల్లతో మరి ఆ రోజుల్లో అని ఎల్లగుర్రం కథలు చెప్పుకుంటూ ఇంటికే పరిమితమవడం ఖాయం.
- ఏనుగుల రాకేశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ తెలంగాణ