విశ్లేషణ: బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు

విశ్లేషణ: బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూస్తుంటే చాలా ఆతృతగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ జర్నీకి ప్లాన్ వేసుకునే పనిలో ఉన్నారు. సడెన్ గా తన ఉద్దేశాలను బయటపెట్టిన ఆయన నేషనల్ పాలిటిక్స్ లో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రసిద్ధ రోమన్ రచయిత చెప్పినట్లు ‘‘ధైర్యవంతులకే అదృష్టం కలిసి వస్తుంది’’ బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు. ఈ సామెత తనకు కూడా వర్తిస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

నిజాంలు 200 ఏండ్ల పాటు హైదరాబాద్‌ను విజయవంతంగా పాలించారు. వారి పాలనను గమనిస్తే ప్రధానంగా ఓ వ్యూహం కనిపిస్తుంది. వాళ్లు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. తెలివిగా అందరితో స్నేహం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బ్రిటీష్​ వారితో యుద్ధానికి వెళ్లకుండా, దేశానికి శత్రువులైనా సరే వారితోనే స్నేహం చేశారు. వారు యుద్ధానికి వెళ్లింది.. ఓడిపోయింది..1948లో మాత్రమే. నిజాంలు ఎలాగైతే ఇతరులతో స్నేహం చేశారో.. సీఎం కేసీఆర్​కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం రెండు విధానాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ పబ్లిక్​మీటింగ్​లో మాట్లాడుతూ.. ఢిల్లీ కోటలు బద్దలు కొడత అన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆయన కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు కనిపించేలా వ్యవహరించినప్పటికీ.. ఇతర రాష్ట్రాలతో మాత్రం సఖ్యతతో ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు, ముఖ్య నాయకులను కలిసినప్పుడు మంచిగా, హుందాగా, వినయంగా ఉంటున్నారు. కేసీఆర్‌‌ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినప్పటి ఫొటోలు చూస్తే వినయం, అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.

నేషనల్​ జర్నీలో కేసీఆర్​కు ​కలిసొచ్చేవి..
ఉద్యమ పార్టీ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు అపరిమిత అధికారం, హోదా, వనరులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవిలో లేకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా అంటే బహుశా ఎవరూ పట్టించుకునేవారు కాదు కావొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆయన జర్నీకి కలిసి వస్తుంది. దీంతోపాటు తాను ప్రధాని కావాలనుకుంటున్నట్లు కేసీఆర్​ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని తొలగించాలని మాత్రమే చెప్పారు. దానివల్ల ఆయా రాష్ట్రాల్లో మిగిలిన ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి సమస్యా రాదు. వారు సీఎం కేసీఆర్‌తో కలిసి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ ప్రతిపక్ష నాయకత్వంలో ప్రస్తుతం శూన్యత కనిపిస్తోంది. దాన్ని పూడ్చాలనే ఆసక్తి ప్రస్తుతం ఎవరికీ లేకపోగా.. సీఎం కేసీఆర్‌‌దానిపై ఫోకస్​పెట్టారు. ‘తెలంగాణలో కేసీఆర్‌‌ చక్రం తిప్పుతున్నారు’ అనే ఇమేజ్‌ని ఆయన సృష్టించుకోగలిగారు. ఇది ఆయన జర్నీలో మేలు చేసే అవకాశం ఉంది. వీటితోపాటు త్వరలోనే హైదరాబాద్‌లో పలు రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్​ప్రకటించారు. వాళ్లు ఇక్కడ సమావేశమైతే దానికి నేతృత్వం వహించే అవకాశం వస్తుంది. పాత శత్రువైన కాంగ్రెస్​కు కేసీఆర్​ఈ మధ్య అనుకూల కామెంట్స్​చేశారు. శత్రువులతోనూ స్నేహంగా ఉండటంతో రాజకీయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్​ మిత్రుల కోసం చూస్తున్నారు కాబట్టి వాళ్లు కేసీఆర్‌‌కు ఆహ్వానం పలకొచ్చు. దేశంలోనే మొదటిసారి రైతు బంధులాంటి స్కీంను ప్రవేశపెట్టిన కేసీఆర్‌‌పై ఇండియా అంతటా రైతుల్లో మంచి ఇమేజ్‌ఉంది. ఈ విషయం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

కేసీఆర్​ ప్రజలతో ఓపెన్​గా ఉండాలి

  • మమతా బెనర్జీ, శరద్ పవార్‌‌ వంటి వారికి బయట రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది లీడర్లున్నారు. 
  • కేసీఆర్‌‌ ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రధాని అవుతారనే విషయం మనం ఇప్పుడే ఊహించలేం1963లో లాల్​బహదూర్ శాస్త్రి,  1984లో రాజీవ్‌ గాంధీ, 1989లో వీపీ సింగ్, 1991లో పీవీ నరసింహా రావు, 2004లో మన్మోహన్‌సింగ్, 2014లో మోడీలు ప్రధానులు అవుతారని ఎవరూ ఊహించలేదు. 
  • ఈ ప్రయాణం సుదీర్ఘంగా, కష్టనష్టాలతో కూడి ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కేసీఆర్‌‌ ఒకసారి చెప్పిన తర్వాత వెనుకడుగు వేయకూడదు.
  • తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు కేసీఆర్‌‌ నిజాంల ‘యుద్ధ రహిత వ్యూహాన్ని’ కేసీఆర్‌‌ గుర్తుంచుకోవాలి. 
  • తెలంగాణలో నేనే పులిని అని భావిస్తూ, తనను తాను ‘పులిబిడ్డ’ అని అభివర్ణించుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ బయట మాత్రం దేవదూతలా ప్రవర్తిస్తుంటారనే విమర్శలు లేకపోలేదు. 
  • కాబట్టి ఆయన నేషనల్​ జర్నీ ప్లాన్​ముందుకు వెళ్తుందా? రద్దవుతుందా అనే దానిపై మార్చి10న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ప్రతికూలతలు

  • తెలంగాణలో కేసీఆర్‌‌ పట్టు కోల్పోతున్నారని, బీజేపీ హవా నడుస్తుందనే ఊహాగానాలున్నాయి. 
  • మమతా బెనర్జీ లాంటి నేతలు ఎన్నికల్లో గెలవగానే ఢిల్లీ వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. కేసీఆర్‌‌ మాత్రం రాష్ట్రంలో బలహీన పడినప్పుడే ఢిల్లీ మీద దండెత్తడానికి వెళ్తుంటారనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనేది ప్రస్తుతం ఆయన ముందున్న ఆలోచన. 
  • తెలంగాణను మేనేజ్‌ చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం రాష్ట్రంలో కేసీఆర్‌‌కు లేదు.కాబట్టి సొంత రాష్ట్రాన్నే సరిగా పాలించే సత్తా లేకపోతే జాతీయ రాజకీయాల్లో ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
  • తన పార్టీ మొత్తం కేసీఆర్‌‌ తెలివితేటలతోనే నడవాలని చూస్తుంటారు. 
  • కేసీఆర్‌‌కు రాజకీయ సలహాదారులు గానీ, ఎండీలు కానీ ఎక్కువ మంది లేరు. జాతీయ స్థాయికి వెళ్లేటప్పుడు ఇది పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. తన చుట్టూ ఉన్న స్వప్రయోజనాల కోసం పని చేసే వారి పట్ల కేసీఆర్‌‌ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

 

పెంటపాటి పుల్లారావు, సోషల్ ఎనలిస్ట్