తెలంగాణలో జాతీయవాదం ఎటుపోతున్నది?

తెలంగాణలో జాతీయవాదం ఎటుపోతున్నది?

ఒకప్పుడు  సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినం కోసం భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు పిలుపిచ్చినా పెద్ద చర్చ జరిగేది. ఇపుడు అమిత్ షా కేంద్రమంత్రిగా స్వయంగా పెరేడ్ గ్రౌండ్ లో పతాకావిష్కరణ చేసినా అదీ రొటీన్ కార్యక్రమంలా అనిపించింది. గణేశ్ ఉత్సవాలు వచ్చినపుడు మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాలో  సాధ్వీ రితంబరనో, ఆచార్య ధర్మేంద్రనో, ప్రవీణ్ తొగాడియానో వచ్చి హిందీలో చేసే అనర్గళ ప్రసంగం హైదరాబాద్ ప్రజలు చెవులు నిక్కబొడుచుకొని వినేవాళ్లు. 

హైదరాబాద్ లో చక్రం తిప్పే ఆలె నరేంద్ర భాగ్యనగర వీధుల్లో నడుస్తుంటే భాగ్యనగర్ టైగర్ అని, బద్దం బాల్ రెడ్డిని చూస్తే గోల్కొండ సింహం అని జనం మురిసిపోయేవారు. ఆఖరుకు ఒక విషయం తప్పక గుర్తు చేసుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన 15 నిమిషాల కామెంట్స్ యావత్ రాష్ట్రాన్ని  జాతీయవాదం వైపు నిలబెట్టాయి కదా..! మరి ఇప్పుడు ఏమైంది?

తెలంగాణలో ‘జాతీయవాదం’ ఎవరి చేతబడితో చచ్చుబడిపోయింది. లేక బీజేపీ  వ్యవస్థ ఇక్కడ ‘జాతీయవాదం’ గురించి ఆలోచించక పోవడం వల్ల అందరూ స్తబ్దంగా మారిపోయారా? లేక దక్షిణాది రాష్ట్రాల్లో జాతీయవాదం కాలం చెల్లిన సిద్ధాంతమా? దేశాన్ని కాపాడే ఓ బృహత్ప్రయత్నంలో మనం సమిధలు కావల్సిందే అని సరిపెట్టుకోవాలా? 

టేకేదార్​ మూతికి తాళమెందుకు?

అంతా గందరగోళంగా ఉన్నా ఎన్నో విపత్కర పరిస్థితులు జాతీయవాదంపై సమ్మెట దెబ్బలు పడుతున్నా ఏదో నిశ్శబ్దం అందరినీ తొలిచేస్తున్నది. ఎందుకంటే జాతీయవాదానికి ‘టేకేదార్’ గా ఉన్న బీజేపీ మౌనం 'సిద్ధాంతం మూతికి తాళం' వేసినట్లు అనిపిస్తున్నది. ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం సీఎం హేమంత్ శర్మ హిందూత్వపై, జాతీయవాదంపై భలే మాట్లాడాడని మురిసిపోయేవాళ్లు. ఏమీలేని తమిళనాడులో అన్నామలై పాదయాత్ర గొప్పగా ఉందని వెళ్లి అందులో పాల్గొని వచ్చినవాళ్లు కూడా తెలంగాణలో ఉన్నారు. 

ఇక్కడ మాత్రం పన్నెత్తి మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు!? వరంగల్​లో దేవాలయం మీద మైకు పెట్టాడని పూజారిని అన్యమతస్తుడు చావబాదాడు. పాతబస్లీ బిర్జూ మాదిగను ఎవరు హుసేన్ సాగర్ లో పడేసారో తెలియదు.అదే ఇక్కడి మజ్లిస్ నాయకుడు దేశంలోని సంఘటనలను తెరమీదకు తెస్తున్నాడు. అది అఖ్లాక్ హత్య , హత్రాస్ ఘటన వంటి వాటన్నిటిపై దేశ వ్యాప్త చర్చ ఒవైసీ చేయగలుగుతున్నాడు. ఇక్కడి బైంసాలో జరుగుతున్నటువంటి అల్లర్ల పై బాధితులకు న్యాయం చేయలేకపోయాం. 

ఇక్కడి జాతీయవాద పార్టీ తెలంగాణలో జరిగిన ఘటనలను మాత్రం ప్రజలకు అర్థం చేయించలేకపోతున్నది. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే, వామపక్ష శక్తులు దాన్ని దేశవ్యాప్త సంఘటనగా మలిచినాయి. రాహుల్  గాంధీ మొదలుకొని కేజ్రీవాల్ వరకు హైదరాబాద్ కు వచ్చి ధర్నాలు చేసి మోదీని బోనులో నిలబెట్టేంత పనిచేశారు. తర్వాత కాలంలో స్మృతి ఇరానీ మంత్రిత్వ శాఖనే మారిపోయింది. ఇంత జరుగుతున్నా తెలంగాణలోని అకడమిక్ లెఫ్ట్ వింగ్  పై పోరాటం చేసే వ్యవస్థ నీరుగారి పోవడం వెనుక ఎవరున్నారు?

వెనుకాడడమేంది?

ఇప్పుడు బీసీ మహిళా బిల్లు గురించి లేస్తున్న గొంతులు  కో ఆప్షన్ మెంబర్లుగా ఇష్టారీతిగా సింహ భాగం మైనారిటీలకు ఇచ్చినపుడూ బీసీ మౌనంగా ఉంటాయి. ఇంత జరుగుతున్నా.. జాతీయవాదం వినిపించే బీజేపీ నాయకత్వం నిశ్చేష్టగా ఉండడం కలవరపెడుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ  మసీదులు, చర్చిల నిర్మాణాలను ప్రభుత్వ పెద్దలే ముందుండి నడిపిస్తుంటే జాతీయవాదుల ఉద్దేశ పూర్వక మౌనం దేనికి సంకేతం?త్రిపుర లాంటి కమ్యూనిస్టు స్టేట్ ను ఆక్రమించుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఎందుకు వెనుకాడుతుంది? తరతరాలుగా పార్టీని సంస్థలను నమ్ముకున్న వారిని వంచించడం కాదా? అని ఇటీవల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర భారతం లో జరిగే జైత్రయాత్ర మాత్రమే ఎలా సంపూర్ణ విజయం అవుతుందో కేంద్ర నాయకత్వం ఆలోచించాలి.

ఎందరినో ఓడించి.. తెలంగాణలో తలదించడమేంది?

మోదీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు విషయం అందరూ హర్షించదగ్గదే. భారత్ ను ‘విశ్వగురువు’ వైపు తీసుకెళ్లడంలో అతని పాత్ర చాలా గొప్పది. అలాగే అంతర్గతంగా మోదీపై యుద్ధం నేరుగా చేయడంలో ఉత్తర భారతంలోని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు నీరుగారిపోయాయి. కశ్మీర్ పార్టీలు సైతం కకావికలం అయ్యాయి. అలాగే శరద్ పవార్ వంటివారు కూడా బయటో లాగా, లోపల ఇంకోలాగా మోదీతో రాజీపడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర పాలకులు మోదీని తీసిపారేస్తున్నారు. 

 కేసీఆర్ మోదీని లెక్కపెట్టడం సంగతి దేవుడెరుగు, డైరెక్ట్  గా దాడే చేస్తున్నారు. అంతేగాకుండా కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు అనేక రాష్ట్రాల్లో కలిసొచ్చేవారికి ఫండింగ్ చేస్తానని అన్నాడని ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయి చెప్పుకొచ్చారు. మరి మోదీ, అమిత్ షాల నాయకత్వంలో జరుగుతున్న రాజసూయ యాగంలో తెలంగాణకు ఎందుకు స్థానం లేదో అన్న చిక్కుముడిని ఎవరూ విప్పలేకపోతున్నారు. 
సంతుష్ట రాజకీయాల్లో చిన్న మాట మాట్లాడినా వేలెత్తి చూపుతూ ఉత్తర భారతంలో అన్ని పార్టీలను నిర్వీర్యం చేసిన బీజేపీ, జాతీయవాద శక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇంత మెత్తగా సున్నితంగా రాజకీయాలు నడుపుతున్నారో అర్థం కావడం లేదు. 

వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నక్సలైట్ విద్యార్థి సంఘాల చేతుల్లో చచ్చిపోయిన ఏబీవీపీ కార్యకర్తలకు వాళ్ల కుటుంబాలకు దాని వెనుక దాగున్న త్యాగానికి ఇదేనా విలువ?  1979 జూలై 8 వ తారీఖున బీహార్ కు చెందిన ఏబీవీపీ కార్యకర్త వినోద్ కుమార్ ఝా లాంటివాళ్ళు నక్సలైట్ల చేతుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు ఇప్పుడు వాళ్ల కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు. అలాంటి జాతీయ వాదుల ప్రాణాలకు తెలుగు నేల పై విలువ లేదా? జాతీయ పతాకం విలువను కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుపెట్టి కాకతీయ యూనివర్సిటీలో ధైర్యంగా నిలబడ్డ సామా జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్లు చేసిన త్యాగం ఇప్పుడు లెక్కలోకి రాదా? 

గద్దర్ కు దిగిన బుల్లెట్ల గురించి అందరూ ఆలోచిస్తున్నారు గాని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కత్తిపోట్లకు గురై చావు బతుకుల మధ్య పోరాటం చేసిన ఎందరో ఏబీవీపీ కార్యకర్తలు ఈరోజుకూ బతికున్నారు. వారి తెగువ కు పోరాట స్ఫూర్తి కి మనం వెలకట్టగలమా? భారతీయ జనతా పార్టీని జాతీయవాద సిద్ధాంతాన్ని నమ్ముకొని కుటుంబాలను వదిలిపెట్టి ప్రచారకులుగా పనిచేసే దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన గొప్ప గొప్ప వ్యక్తులకు మనం ఇచ్చే నివాళి ఏంటి? అశ్వమేధ యాగం లో గుర్రం కొన్ని ప్రాంతాల గుండా వెళ్లడం సంపూర్ణ యజ్ఞ ఫలం ఇవ్వదు. ఇదంతా చూస్తూ ఊరుకోవడం వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?

- డా.పి. భాస్కర యోగి పొలిటికల్​ అనలిస్ట్​