ప్రజాయుద్ధ నౌక కంటే..పద్మశ్రీ గొప్పదా..!

ప్రజాయుద్ధ నౌక కంటే..పద్మశ్రీ గొప్పదా..!

ప్రజాయుద్ధనౌక గద్దర్ ఇవాళ మళ్లీ చర్చల్లోకి వచ్చిండు. జయంతికో, వర్ధంతికో ఆయన గురించి స్మరించుకోవడం, చర్చించుకోవడం పరిపాటి. కానీ, తాజాగా యాదృచ్ఛికంగానో, ఉద్దేశ పూర్వకంగానో గద్దర్ పేరు మరోసారి తలచినది అనామకుడో, ఏ అధముడో కాదు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. 

గద్దర్​కు పద్మ అవార్డు ఇవ్వనే ఇవ్వమని తేల్చి చెప్పిండు. నక్సలైట్లకు ఎట్లిస్తామని.. పార్టీ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్నవారికి ప్రతిష్టాత్మక అవార్డులెలా ఇస్తారని కుండబద్దలు కొట్టి చెప్పిండు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ యథాలాపంగా అన్నారా..లేక తన పార్టీ నైజాన్ని బయటపెట్టదల్చుకున్నారా...లేకుంటే విప్లవ భావజాలం గల నేతలు ఉండకూడదనే పార్టీ అంతర్గత రాజకీయ కోణంలో మాట్లాడారో ఏమోగాని గద్దర్ మాత్రం మరొకసారి సమాజ వస్తువైండు..చర్చనీయాంశమైండు. 

ఆ మాటకొస్తే గద్దర్ నిత్యం స్మరించుకోదగినవాడే. అయితే, నిజానికి ఆయనకు పద్మ అవార్డులిచ్చి ప్రసన్నం చేసుకోవాలని గద్దర్ కుటుంబం,  ప్రజాస్వామికవాదులు,  ప్రజా సంఘాలేవీ సిఫార్సులు చేయలేదు.

ఆయనకు ఫలానా అవార్డులివ్వాలని విన్నవించే ఆలోచన కూడా ఉన్నట్టు సమీప భవిష్యత్తుల్లోనూ కనపడదు. ఉన్నట్టుండి తేనెతుట్టెను కదిపి ప్రజా సమూహంలో నిత్యం ఉండాలనే తపనలో భాగంగానే  బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోలేం. 

కానీ,  దాని వెనక సైద్ధాంతిక చర్చ తీసుకురావడమే  బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది.  తెలంగాణ అట్టడుగు వర్గాల ప్రజాస్వామిక ఆకాంక్షల సమాహార ప్రతిరూపంగా గద్దర్​ను చూస్తారు. అది గుర్తించే ఆ ప్రభావ ఫలితాన్ని ప్రభుత్వం నంది అవార్డుల స్థానే గద్దర్ అవార్డులు పెట్టారా అని అనుకోవాల్సి వస్తోంది. 

ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ సైద్ధాంతిక వైరంగా గద్దర్​ను తెరపైకి తీసుకొచ్చారా అన్న అనుమానమూ లేకపోలేదు. అయితే, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ రెండూ అధికారంలో ఉన్న పార్టీలే. అధికార హింసలు, ఆధిపత్య కుట్రలు, రాజ్యహింసలో భాగమే గద్దర్​లో  తూటాలను మొలిపించింది. 

ఆ తూటాలనే శరీరంలో దాచుకుని ఆయన సమాజానికి చైతన్యదీపికలందించిండు. ఆయన అటు ఆస్తిక ఇటు నాస్తిక సమాజాన్ని సమానంగా చూస్తూ సాంస్కృతిక విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టిండు.  తెలంగాణ మాగాణంలో పుట్టిన విప్లవ తార గద్దర్. సమాజంలోని హెచ్చుతగ్గులను మానవ విలువలను కళ్లారా చూసిన నేపథ్యం ఆయనది. 

ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసే ఉస్మానియా వర్సిటీ, కెనరా బ్యాంక్ ఉద్యోగిగా సమసమాజ స్థాపన కోసం జనాన్ని వీడి వనంలో కలిసి దండకారణ్యంలోనూ దద్దరిల్లే కార్యక్రమాలకు రూపకల్పన చేసిండు. జనజీవన స్రవంతిలో కలిసి సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజా చైతన్యంలో గొంతుకై నిలిచిండు. 

తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరో సాంస్కృతిక శాంతి ఉద్యమానికి  శ్రీకారం చుట్టి రాష్ట్ర సాధనలోనూ ముందువరుసలో నిలిచిండు. గద్దర్‌‌ను ఒక కోణంలో చూడలేం. ఓ తిరుగుబాటుదారుడిగా,  విప్లవ కవిగా, గాయకుడిగా,  ప్రదర్శనకారుడిగా, సమ్మెహన శక్తిగా ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. 

అన్ని పాత్రలలో ఒదిగిపోయి ఒక సామాజిక ఉద్యమ నిర్మాణం చేశాడు. అలాంటి గద్దర్​ గొప్పతనాన్ని ప్రజలు గుర్తించిన్రు. ప్రజాఉద్యమాలూ గుర్తించి గుండెకత్తుకున్ననేపథ్యంలో ప్రభుత్వ అవార్డులు, రివార్డులు ఆయన ముందు దిగదుడుపే అని చెప్పాలి.

బ్యాలెట్​ను నమ్మడం పాపమైందా?

బుల్లెట్​తో సమస్యలు పరిష్కారం కావని బ్యాలెట్ మార్గంతో.. పీడిత, తాడిత జనాలను మరింత చేరువ కావాలని ఆయన మలి జీవితంలో చేయని ప్రయత్నం లేదు.  నాడు  సీఎం కేసీఆర్​ను కలిసేందుకు  ప్రగతిభవన్​లో మూడు గంటల పాటు ఎండలో కూర్చున్నడు.  

బానిసలార లెండిరా...ఈ  బానిస బతుకులొద్దని కళ్లకు కట్టినట్టు కేసీఆర్ శిబిరంపై కైకట్టి  పాడిన  పాట ఇప్పటికీ   రాజకీయ  సమూహంలో ఓ చర్చ.  ప్రధాని నరేంద్ర మోదీని కలిసిండు.  లెప్ట్ భావాలున్నా  రైట్ పాటలు పాడి  ఆధ్యాత్మికం అంటరానిది కాదని.. రండిరో సమతామూర్తికి పోదామని పాడిండు. 

రాహూల్ గాంధీతో భావి రాజకీయాలూ చర్చించిండు.  సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ చైతన్యాన్ని నూరిపోసి బీఆర్ఎస్​ను గద్దె దించడంలో తన పాత్ర పోషించిండు. అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తే గద్దర్ సైద్ధాంతిక రాద్ధాంతాలొదిలి సంఘీభావం తెలిపిండు.  

గద్దర్​ను  ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, భావజాలం గుర్తుకు రాలేదా? అని బండికి సూదంటు ప్రశ్నలను నెటిజన్లు వినిపిస్తున్నరు. బ్యాలెట్ బాట ఎంచుకున్న తర్వాత కాంగ్రెస్,  బీజేపీ,  బీఎస్పీలాంటి పార్టీ నేతలను కలిసి తన అభిప్రాయాన్ని పంచుకున్న గద్దర్ చివరకు ప్రజాశాంతి పార్టీ నేత  కేఏ పాల్​తోనూ భేటీ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తినీ కనబరిచారు. 

మంద కృష్ణ నక్సలైట్ కాదా?

తాజా పద్మ అవార్డులకు ఎంపికైన సామాజిక ఉద్యమకారుడు మంద కృష్ణది నక్సల్ బరి నేపథ్యమే. అదే నేపథ్యమున్న మందకృష్ణకి అవార్డు అడ్డుకానప్పుడు మరి గద్దర్​కు అవార్డు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకనే ప్రశ్న లేకపోలేదు. నిజానికి ప్రజా యుద్ధనౌక తోపాటు,  పీపుల్స్ మనిషిగా గొప్ప అవార్డున్న గద్దర్​కి అసలు పద్మశ్రీ ఎందుకన్న వాదన బలంగా ఉన్నది.

 సినీ పరిశ్రమలో ఒక పెద్ద మనిషి ఒక పాట రాయమని బలవంతపెడితే .. ఆ పాట ఒక్క రోజులో రాసి ఆ సినిమాకి ఇచ్చాడు.  ఆ పాట సూపర్ హిట్ అయింది. నంది అవార్డ్​కు ఎంపికైంది. కానీ, ఆ రోజుల్లోనే గద్దర్ ఆ నంది అవార్డును తిరస్కరించాడు. ఆ మాటకొస్తే ఇప్పటికీ రాజ్యహింసను ప్రేరేపిస్తున్న కాషాయ సర్కారు ఇస్తున్న  పద్మ అవార్డులనూ గద్దర్ బతికుంటే తిరస్కరించేవాడు.

ఈటలపై కోపంతోనేనా?

బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ పరిపక్వతతో కూడుకున్నవా లేదా అన్నది పక్కనపెడితే, ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపిలోని వైరికి సంకేతం. ఆయన వ్యతిరేక వర్గంగా చెప్పుకునే మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో గద్దర్ అవార్డుపై తుపాకి ఎక్కుపెట్టి ఈటల వైపు తూటా పేల్చిండన్నది రాజకీయ వర్గాల్లో చర్చ.

అంతెందుకు బండి సంజయ్ అలా కామెంట్ చేయగానే కాంగ్రెస్​లోని అదే సామాజికవర్గం ఈటల అధ్యక్ష పదవిపై రోజూ స్పందిస్తున్నా రంటే గద్దర్ మరణానంతరం కూడా ఆయనను  ఓ వస్తువులా వాడుతుండడం పైశాచిక ఆనందానికి పరాకాష్టని చెప్పక తప్పదు.

- వెంకట్, గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం