
ప్రశాంత్ కిషోర్... అలియాస్ పీకే మన తెలుగువారికి బాగా తెలిసిన పేరు! వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొన్నాళ్లు సలహాదారుగా ఉన్నారు. తర్వాత ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు పంచన చేరారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న పీకే తన సొంత రాష్ట్రం బిహార్లో ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించి రాజకీయవేత్త అవతారం ఎత్తారు. ఈయేడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జన్‌సూరజ్’ రాష్ట్ర వ్యాప్తంగా బరిలోకి దిగుతున్నవేళ పీకే కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా? లేక జోకర్‌గా మిగిలిపోతారా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన ప్రశ్న!
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2015లో జేడీ(యూ) నేత నితీశ్ కుమార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడులో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన పీకే వారందరినీ తానే అధికారంలోకి తీసుకొచ్చినట్టు చెప్పుకుంటారు. కానీ, వారి విజయానికి కారణం పీకే అని ఆ నాయకులు ఎప్పుడూ చెప్పలేదు! అయినా, పీకే తన మార్కెటింగ్ నైపుణ్యాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కేవలం తన విజయాలనే ప్రస్తావించే పీకే, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, అఖిలేశ్ మధ్య పొత్తు ప్రయోగం చేసి విఫలమయ్యారు. పీకే సలహాతో మమతా బెనర్జీ గోవాలో టీఎంసీని పోటీకి దించి ఓడిపోయారు. 2014లో బీజేపీని తానే గెలిపించానని ఆయన అంటారు కానీ, 2019, 2024లో పీకే లేకపోయినా ఆ పార్టీ గెలిచింది కదా? రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న తర్వాత పీకే ఒకవైపు పొలిటికల్ కన్సెల్టింగ్ చేస్తూనే... మరోవైపు తన పొలిటికల్ రోల్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. 2015లో తాను వ్యూహకర్తగా పని చేసిన జేడీ(యూ)లో చేరి ఆ పార్టీకి ఏకంగా ఉపాధ్యక్షుడయ్యారు. అనంతరం ఆ పార్టీతో విభేదాలు రావడంతో బయటకు వచ్చేశారు. తర్వాత జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. మమతా బెనర్జీ ద్వారా కూడా రాజకీయంగా అవకాశం కోసం ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో సొంతంగా 2024, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున జన్ సూరజ్ పార్టీని స్థాపించారు.
పాదయాత్ర అధికారమిస్తుందా?
విద్య, వైద్యం, ఉపాధి నినాదంతో పార్టీ పెట్టడానికి ముందే బిహార్లో పీకే పాదయాత్ర చేసినా జనాదరణ పొందలేకపోయారు. అక్షరాస్యత తక్కువ ఉన్న బిహార్లో పీకే మాటలు కొంతవరకు మధ్యతరగతి యువత తప్ప ఇతరులు పట్టించుకోవడం లేదు. అయినా పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారం వస్తుందా? తెలంగాణలో సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిలా దీనికి ఉదాహరణ. పార్టీకి యంత్రాంగం ఉంటేనే పాదయాత్ర ఫలిస్తుంది. పీకేకు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో నిలబెట్టడానికి నమ్మకమైన అభ్యర్థులే లేరంటే ఆ పార్టీ పరిస్థితిని అంచనా వేయొచ్చు.
ఓట్లు చీలుస్తారా?
ఆదర్శాలు మాట్లాడటంలో లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్‌కు కూడా పీకేలాంటి ఇమేజే ఉండేది. 2009లో ఆయన పార్టీ ఇతర పార్టీల ఓట్లు చీల్చి అధికార కాంగ్రెస్ నెత్తిన పాలు పోసింది. ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే స్థానమూ కోల్పోయారు. పీకే కూడా బిహార్లో ఇంచుమించు ఇలాంటి పాత్రే పోషించే అవకాశం ఉంది. గతేడాది నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పీకే పార్టీ మొదటిసారి పోటీ చేసింది.
నాలుగింట మూడుచోట్ల మూడో స్థానంలో, ఒకచోట నాలుగో స్థానంలో నిలిచి 10 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఈ నాలుగు స్థానాల్లోనూ ఎన్డీయే గెలిచింది. కానీ, రెండు స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే పీకే పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. 2020లో మహాఘట్బంధన్(ఎంజీబీ) ఈ నాలుగింట్లో మూడు స్థానాలను గెలుచుకుంది. 2020లో ఇక్కడ ఎంజీబీకి 41 శాతం ఓట్లు రాగా, అనంతరం ఉప ఎన్నికల్లో 10 శాతం ఓట్లు తగ్గాయి. పీకే పార్టీ గెలుపుకంటే ప్రతిపక్షం ఓట్లు చీల్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం ఉంది.
కులమే పద్మవ్యూహం
బిహార్లో 50 ఏళ్లుగా రాజకీయాలు కులం చుట్టే తిరుగుతున్నాయి. కుల బలం లేకుండా అక్కడ ఏ పార్టీ, ఏ నాయకుడూ విజయం సాధించలేరు. 80 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు ఉన్న బిహార్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పీకేకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బిహార్లో చివరిసారి 1989లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రా సీఎం అయ్యారు.
మండల్ కమిషన్ తర్వాత బిహార్లో ఓబీసీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. పీకే తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోకపోయినా రాష్ట్రంలో కుల రాజకీయలకే పెద్దపీట వేస్తారు. రాష్ట్రంలో ఏ ఒక్క కులమూ ‘జన్ సూరజ్’ తమ పార్టీ అని చెప్పుకోవడం లేదు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం బిహార్లో చేసిన ఒక అధ్యయనంలో అక్కడ 57 శాతం మంది ప్రజలు తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులనే ఎంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంక్లిష్ట కుల పద్మవ్యూహాన్ని ఛేదించడం పీకే వల్ల సాధ్యమవుతుందా?
మూడు పార్టీలదే హవా
ప్రస్తుత పరిణామాలు చూస్తే కుర్మీలు, ఈబీసీలు, అగ్రవర్ణాలు, దళితులు ఎన్డీయే కూటమివైపు ఉన్నారు. 32 శాతం ఓట్లు ఉన్న యాదవులు, ముస్లింలు మహాఘట్బంధన్ వైపు ఉన్నారు. బిహార్లో ఆర్జేడీ, బీజేపీ, జేడీ(యు) పార్టీలకే పూర్తి పట్టు ఉంది. జేడీ(యూ) ఎటువెళ్తే ఆ కూటమి ప్రభుత్వమే ఏర్పడుతూ వస్తోంది. గత 35 సంవత్సరాలుగా నితీష్, లాలూ వల్ల బిహార్ వెనుకబడిందని, తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తీర్చడంతోపాటు, సోషల్ ఇంజనీరింగ్‌తో రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ప్రభుత్వ ఫలాలు అందిస్తా అని పీకే అంటున్నారు.
అయితే, ఏపీలో పీకే సలహాలు పాటించిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ‘క్లాస్’ రాజకీయాలే చేయబోయి బొక్కబోర్లా పడ్డారనేది ఇక్కడ గమనార్హం. పీకే బిహార్లో ప్రధాన పార్టీల అగ్రనేతల కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఆయన టెక్నోక్రాట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. అయినా జన్ సూరజ్‌కు ఎక్స్‌లో 1.88 లక్షల మంది ఫాలోవర్సే ఉన్నారు. అదే బీజేపీకి 7 లక్షలు, జేడీ(యూ)కి 3 లక్షలు, ఆర్జేడీకి 11 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. నితీశ్ కుమార్ రిటైర్మెంట్ తర్వాత జేడీ(యూ) రాష్ట్రంలో కనుమరుగవుతుందని, ఆ పార్టీ ఓట్లు తమకే బదిలీ అవుతాయని, బిహర్లో జేడీ(యూ) స్థానాన్ని తామే భర్తీ చేస్తామని పీకే భావిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో కార్యకర్తలు లేకుండా సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ఆయన పార్టీకి సామాజిక మద్దతు కూడా లేదు. ఇన్ని లోపాలున్న జన్‌సూరజ్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన పీకే నేతృత్వం వహించినా ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు.
వ్యూహాత్మక తప్పిదం
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు. ఉప ఎన్నికల్లో పోటీచేసి పీకే వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్టీ పెట్టాక పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో విజయం సాధిస్తేనే ఆ పార్టీ బలపడే అవకాశాలు పెరుగుతాయి. వైఎస్సార్సీపీ పెట్టినప్పుడు పోటీ చేసిన మొదటి ఉప ఎన్నికల్లో విజయం సాధించి, గట్టి పునాదులు వేసుకుంది. జన్ సూరజ్ పార్టీ రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడమే కాదు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలాగ అధికారంలోకి వస్తుందని పీకే చెప్తున్నారు. అయితే, ఆప్ మొదటిసారి అధికారానికి కావాల్సిన సీట్లు గెలవలేదు. ఆమ్ ఆద్మీకి మొదటి ఎన్నికలో తక్కువ సీట్లే వచ్చాయి.
కానీ, జాతీయ పార్టీలకు గట్టి పోటీనిచ్చింది. పీకే పార్టీ మాత్రం కేవలం ప్రతిపక్షాల ఓట్లు చీల్చి, అధికార పక్షానికి మేలు చేస్తుందని ఉపఎన్నికల ఫలితాలతో బయటపడింది. ఆయన కేవలం ఆర్జేడీ, జేడీ(యూ)లను విమర్శిస్తూ... బీజేపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. దీంతో ఆయన బీజేపీకి ‘బీ’ టీమ్ అని, ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.
- ఆర్. దిలీప్ రెడ్డి,
డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ