పొంగులేటి చేరికల సభనా? భట్టి పాదయాత్ర ముగింపు మీటింగా?

ఖమ్మం, వెలుగు: వచ్చే నెల 2న ఖమ్మం కేంద్రంగా కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ హాజరయ్యే మీటింగ్ ఆ పార్టీలో చిచ్చు రేపినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్​లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశమా లేక సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న మీటింగా అన్నది చర్చనీయాంశమైంది. పార్టీలో పొంగులేటి చేరేందుకే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఇది చేరికల సమావేశమేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై భట్టి విక్రమార్క వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం భట్టి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముగింపు సభ ఖమ్మంలోనే ఉంటుందని చెబుతున్నామని అంటున్నారు. ఎంత పెద్ద నాయకులైనా కేవలం పార్టీలో చేరికల కోసం పబ్లిక్​ మీటింగ్ నిర్వహించడం కాంగ్రెస్​చరిత్రలో లేదని వివరిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశాన్ని చేరికల కోసం ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం చేస్తుండడంపై భట్టి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన అంతర్గత సమావేశం సందర్భంగా కూడా దీనిపై కొందరు కాంగ్రెస్​ లీడర్లు చర్చించినట్టు తెలిసింది. దీనికి మధ్యే మార్గంగా వివిధ ప్రయోజనాల కోసం ఉమ్మడి మీటింగ్ నిర్వహిస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు సర్ధి చెబుతున్నట్టు సమాచారం.

2న సభ గురించి తెలియదన్న డీసీసీ అధ్యక్షుడు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్​ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి..మూడు నెలలుగా దాదాపు15 జిల్లాల్లో పర్యటించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న ఆయన రెండు మూడు రోజుల్లో ఖమ్మం చేరుకోనున్నారు. దీంతో ముగింపు గ్రాండ్​ గా ఉండాలన్న ప్లాన్​తోనే ఖమ్మంలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీతో బహిరంగ సభకు భట్టి విక్రమార్క ప్లాన్ ​చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభ అదేనని స్పష్టం చేస్తున్నారు. దీని విజయవంతం కోసం నాలుగు రోజుల క్రితం సూర్యాపేటలో భట్టి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం కూడా జరిగిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు పొంగులేటి చెప్పినట్టు వచ్చే నెల 2న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభ గురించి తమకు పీసీసీ అధ్యక్షుడి నుంచి గాని, సీఎల్పీ అధ్యక్షుడి నుంచి గాని సమాచారం లేదని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ​అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అన్నారు. రాహుల్​ మీటింగ్ ఉంటే పీసీసీ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరుగుతాయని, ఏఐసీసీ కార్యదర్శి స్థాయి నాయకులు మూడు రోజుల ముందే ఇక్కడికి చేరుకుంటారన్నారు. పేపర్లలో వచ్చిన ప్రకటనలే తప్ప, 2న సమావేశం ఇంకా కన్ఫామ్​ కాలేదన్నారు. తాము మాత్రం భట్టి పాదయాత్ర ముగింపు సభ కోసం ఎస్ఆర్​అండ్​బీజీఎన్ఆర్​కాలేజీ గ్రౌండ్, పెవిలియన్​ గ్రౌండ్, రేణుకా జిన్నింగ్ మిల్లు పక్కన స్థలాన్ని పరిశీలించామని చెబుతున్నారు.  

ఎస్ఆర్​ గార్డెన్స్​ వెనక చురుగ్గా ఏర్పాట్లు

మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో ఎస్ఆర్ గార్డెన్స్ ​వెనుక ఆయనకు ఉన్న వ్యవసాయ భూమిలో 100 ఎకరాలను సభ నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్నారు. దాని పక్కనే మరో 50 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే హెలీప్యాడ్​కూడా రెడీ చేస్తున్నారు. సభ నిర్వహణకు పోలీస్​ పర్మిషన్​ కోసం పొంగులేటి అనుచరులు ఇప్పటికే దరఖాస్తు చేశారు. మంగళవారం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సోదరుడు ప్రసాద్​రెడ్డి పర్యవేక్షించారు. నియోజకవర్గాల వారీగా జన సమీకరణ కోసం ఇన్​చార్జీలను నియమించారు. 2న సాయంత్రం 5 గంటల తర్వాత మీటింగ్ నిర్వహించాలని ప్లాన్​ చేస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లను చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం స్టేజీ కమిటీ, పార్కింగ్ కమిటీ సహా వివిధ రకాల కమిటీలను నియమిస్తున్నారు. పూర్తిగా పొంగులేటి అనుచరులే ఈ మీటింగ్ నిర్వహణ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. మరోవైపు భట్టి అనుచరులు ఆయన పాదయాత్ర ముగింపు కోసం పైలాన్ ​సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం రూరల్​ మండలం పొన్నేకల్ నుంచి తల్లంపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న ప్రైవేట్ స్థలాన్ని కొని 20 అడుగుల స్తూపాన్ని నిర్మిస్తున్నారు.

ఖమ్మంలో మీటింగ్ కోసం మూడు నెలలుగా ప్లాన్​

సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర సందర్భంగా నాలుగు సభలు నిర్వహించాలని ముందే ప్లాన్​ చేశాం. మంచిర్యాల, ఎల్బీనగర్​, జడ్చర్లలో ఇప్పటికే మూడు మీటింగ్ లు జరిగాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్​ లేదా ప్రియాంకతో ఖమ్మంలో నాలుగో మీటింగ్ ఉంటుందని మూడు నెలల క్రితమే చెప్పాం. ఇప్పుడు పార్టీలో చేరతామంటున్న వాళ్లు అప్పట్లో బీజేపీనా, సొంత పార్టీనా అనే ఆలోచనల్లోనే ఉన్నారు. ఇటీవల జరిగిన పీసీసీ పబ్లిక్ అఫైర్స్​ కమిటీ మీటింగ్ లో కూడా పాదయాత్ర ముగింపు మీటింగ్ పై చర్చ జరిగింది. అదే ఇప్పుడు జరగబోతోంది. ఎంత పెద్ద లీడర్లయినా రాహుల్​ వచ్చి పార్టీలో చేర్చుకోవడం ఉండదు. ఆయన వచ్చినప్పుడే ఎవరైనా పార్టీలో చేరొచ్చు.

‌‌‌‌- పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, డీసీసీ అధ్యక్షుడు, ఖమ్మం