ప్రైవేట్ విద్య కొందరికేనా?

ప్రైవేట్ విద్య కొందరికేనా?

 పునాది దృఢంగా ఉంటేనే భవనం ఎక్కు వ కాలం మన్నుతుంది. అలానే  పాఠశాల విద్య కూడా విద్యా ర్థి భవిష్యత్తుకు పునాది.  మెరుగైన పాఠశాల విద్య అందితే వారి మేధస్సు వికసిస్తుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు మార్గం వేస్తుంది. దురదృష్టవశాత్తు విద్య ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. కాసుల చుట్టూ పరిభ్రమిస్తోంది. ర్యాంకులు, మార్కులు కొలమానమైన నేపథ్యంలో చదువును కొనే పరిస్థితి దాపురించింది. 

పేరెంట్స్​ భారీగా ఖర్చు చేసినా ఉపయోగం ఉంటుందా అంటే  కచ్చితంగా చెప్పలేం.  ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు మొక్కుబడిగా  పర్యవేక్షణ  చేస్తుండటంతో  ప్రైవేట్​స్కూళ్లపై సర్కారు అజమాయిషీ కొరవడుతోంది. దీంతో విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతోంది.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే  పాఠశాలలు వేళ్లమీద  లెక్కపెట్టొచ్చు.

మెరుగైన  ప్రమాణాలతో,  మౌలిక వసతులతో  అందరికీ  సమానంగా విద్య  అందించాలనే   ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సమున్నత లక్ష్యంతో  రూపొందించిన జీవోలు కార్యాచరణకు నోచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను అమలుచేయడంలో అధికారవర్గం,  ప్రజాప్రతినిధుల్లో  చిత్తశుద్ధి లోపించడం శోచనీయం.  దరఖాస్తులు,  ప్రవేశ పరీక్షలు, ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ఇతర ఫీజులు పేరిట ప్రైవేట్, కొర్పొరేట్​ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి. 

జీవో 46 అమలు చేయడంలె

రాష్ట్రంలో 13,800 వరకూ కార్పొరేట్, ప్రైవేట్​ స్కూళ్లుండగా వీటిలో 32.33 లక్షలమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరినుంచి ఆయా స్కూల్స్​ స్థాయినిబట్టి ఏటా రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు అదనంగా యూనీఫాం, బుక్స్, బస్సు ఫీజులు తదితర ఫీజులన్నీ వసూలు చేస్తున్నారు. కరోనా అనంతరం ప్రభుత్వం స్కూల్స్​ ఏడాది ఫీజులపై  ప్రభుత్వం జీవో 46 రిలీజ్​ చేసింది.

 దీనిప్రకారం కేవలం ట్యూషన్​ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. అదనపు ఫీజులు తీసుకోకూడదు. ఫీజులు కూడా నెలవారీగా తీసుకోవాలి. 2021–22లోనూ ఆ జీవోను అమలు చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. అయితే ఆ జీవో ఎక్కడా అమలుకాలేదు. కొవిడ్​ టైమ్ లో ఆన్​లైన్​ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ ఫీజులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఫీజుల చట్టం ఏమాయె?

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్లను కార్పొరేట్​ విద్యాసంస్థల యాజమాన్యాలు పూర్తి చేశాయి. ఈ ఏడాది ప్రైవేటు స్కూల్​ ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ఫీజుల నియంత్రణ కోసమని గతంలో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్​ తిరుపతిరావు ఆధ్వర్యంలో 2017లోనే ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి రిపోర్టును  సర్కారుకు అందజేసింది. 

అయినా, ఇప్పటికీ ఆ కమిటీ సిఫారసులను అధికారికంగా గత ప్రభుత్వ హయాంలోనూ ప్రకటించలేదు. ఫీజుల చట్టం తీసుకొస్తామని గత సర్కారు వెల్లడించి దానికోసం 14మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా రెండు మూడుసార్లు సమావేశం నిర్వహించి నివేదికను సర్కారుకు అందజేసింది. ఏటా పదిశాతం ఫీజును యాజమాన్యాలు పెంచుకునేలా కమిటీ ప్రతిపాదనలు చేసింది. 

ఈ రిపోర్టుపై కూడా కేసీఆర్​ తన ప్రభుత్వ కాలంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్న రేవంత్​సర్కారు విద్యాభివృద్ధికి పటిష్ట చర్యలు ఈ విద్యాసంవత్సరం నుంచే చేపట్టాలని ప్రజలు, విద్యార్థులు ఆశిస్తున్నారు. 

ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్​

ప్రాథమిక పాఠశాలలకు 300లోపు విద్యార్థులుంటే 500 చదరపు మీటర్లు, 300లోపు విద్యార్థులుంటే 600 చదరపు మీటర్లు, 400లోపు ఉంటే 800 చ.మీ, 500లోపు అయితే 1000చ.మీ, 500 నుంచి 1000 మంది విద్యార్థులుంటే 1200 చ.మీ నుంచి 2వేల చ.మీ క్రీడా ప్రదేశం ఉండాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 200లోపు విద్యార్థులుంటే 700చ.మీ, 300మంది ఉంటే 800 చ.మీ, 400 ఉంటే 1000 చ.మీ అదేవిధంగా 1000లోపు విద్యార్థులుంటే 2220 చ.మీ స్థలం ఉండాలి.

 కానీ, రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్​ నగరాలతోపాటు జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఉన్న పాఠశాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. క్రీడా ప్రాంగణాలు లేకపోవడంతో విద్యార్థులు నాలుగు గోడల మధ్య కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి విద్యార్థులు దూరమవుతున్నారు. అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలు అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్​ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ఒత్తిడితో కూడిన విద్యను అందిస్తున్నాయి. 

- నామాల ఆజాద్,
పీడీఎస్​యూ 
రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి