రేడియో ఉనికిని కోల్పోతుందా?

రేడియో ఉనికిని కోల్పోతుందా?

బహుళ  ప్రజా సమూహాలను చేరుకోగల ప్రత్యేక సామర్థ్యం రేడియోకు ఉంది.  సోషల్​ మీడియా ధాటికి... రేడియో ఉనికిని కోల్పోతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, టెక్నాలజీ విస్తృతమవుతున్నా.. రేడియో  కనుమరుగు అవలేదు. ఆధునిక యుగానికి తగినట్టుగా  రేడియో రూపాంతరం  చెందుతోంది.  

రేడియో ఆవిష్కరణ ప్రారంభంలో  వార్తా సమాచారంతో పాటుగా వినోద, విద్యా విషయాలు ప్రసారం అయ్యేవి.  సమాచార తక్షణ వ్యాప్తికి అత్యంత అనుకూల, చవకైన సాధనం రేడియోనే. 1920లో  రేడియో అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ముద్రణ మాధ్యమం (వార్తాపత్రికలు) అందుబాటులో ఉన్నప్పటికీ అన్ని వర్గాలు, ప్రాంతాలకు చేరే అవకాశం తక్కువ. అప్పుడు  అక్షరాస్యత  కూడా చాలా తక్కువ.  

ప్రజల  విద్యాస్థాయితో సంబంధం లేకుండా అన్ని వర్గాలు, సమూహాలకు చేరుకొనే ప్రత్యేక మాధ్యమం రేడియో.  ఇది అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థ.  విపత్తుల ఉపశమనంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. సమూహాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, సానుకూల సంభాషణను ప్రోత్సహించడానికి రేడియో ప్రత్యేక సాధనగా నిలుస్తోంది. 

రేడియో సేవల ప్రాధాన్యాన్ని గుర్తించి ఐక్యరాజ్యసమితి  ఫిబ్రవరి 13ను  ప్రపంచ రేడియో దినోత్సవంగా 2012లో ప్రకటించింది. 20వ శతాబ్దపు ప్రారంభంలో  రేడియో ఆవిష్కరణ తర్వాత వార్తలను, వినోదాన్ని అందించడంలో ముందుంది. 1920 ప్రారంభంలో నెదర్లాండ్స్‌‌‌‌, కెనడా, లండన్, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, డెన్మార్క్ లో రేడియో స్టేషన్లు స్థాపించారు.

  1920  నుంచి 1950 వరకు చాలా పారిశ్రామిక దేశాలలో రేడియో  విస్తరించింది. 1920 నుంచి 1945 వరకు మొదటి ఎలక్ట్రానిక్ మాస్ మీడియాగా రేడియో అభివృద్ధి చెందింది. వార్తాపత్రికలు, చలన చిత్రాలతో పాటు పోటీపడి సామూహిక సంస్కృతిని నిలబెట్టింది.  ప్రసార రేడియో ప్రపంచంలో అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ మాస్ మీడియాగా మిగిలిపోయింది. 

1945లో  టెలివిజన్ శకం మొదలైంది. కానీ, ఆధునిక జీవితంలో రేడియో ప్రాముఖ్యత టెలివిజన్‌‌‌‌తో సరిపోలలేదు. మన దేశంలో 1970 వరకు వార్తా ప్రసార మాధ్యమాల్లో రేడియోదే ఆధిపత్యం. 1970 తర్వాత వార్తాపత్రికల విస్తృతి, 1990 తర్వాత టెలివిజన్ వినియోగ వ్యాప్తితో కొంత ప్రజాదరణ తగ్గినా వివిధ రూపాంతరాలు చెంది 
ఇప్పటికీ నిలబడుతోంది. 

భారతదేశంలో రేడియో సేవలు

బ్రిటిష్ ఇండియాలో ప్రైవేట్ రంగంలో బాంబే రేడియో క్లబ్, ఇతర రేడియో క్లబ్‌‌‌‌లు జులై 1923లో ప్రారంభమయ్యాయి. 1927లో ఇండియన్ బ్రాడ్‌‌‌‌కాస్టింగ్ కంపెనీ స్థాపించారు. జూన్ 8, 1936న ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం అనంతరం ఆల్ ఇండియా రేడియో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో కేవలం ఆరు స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచ్చిలో మాత్రమే ఉన్నాయి. 3 అక్టోబర్ 1957న వివిధ భారతి సర్వీస్​ను ప్రారంభించారు. 23 జూలై 1977 మద్రాసులో  ఎఫ్ ఎం రేడియో ప్రారంభమయింది. 

ఆల్ ఇండియా రేడియో

భారత జాతీయ ప్రసార మాధ్యమంగా, ప్రజా సేవా మాధ్యమంగా ఆల్ ఇండియా రేడియో పని చేస్తోంది. విద్య,  ప్రజాచైతన్యం, వినోద సేవలను అందిస్తోంది.  ప్రసార భాషల సంఖ్య, సామాజిక-, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యం పరంగా ప్రపంచంలోని  అతిపెద్ద  ప్రసార సంస్థలలో ఒకటి.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 591 ప్రసార కేంద్రాలను కలిగి ఉంది.   23 భాషలు, 179 మాండలికాలలో వార్తా, విద్య, చైతన్య, సాంస్కృతిక, వివిధ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ, స్థానికంగా ఉండే విభిన్న శ్రోతలకు అనుగుణంగా మూడంచెల వ్యవస్థను కలిగి వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. 

ఆల్ ఇండియా రేడియోలో వార్తా సేవల విభాగం 24 గంటలూ పని చేస్తుంది. 607 వార్తల బులెటిన్లను ప్రసారం చేస్తోంది. బులెటిన్లు భారతీయ భాషలు, వివిధ విదేశీ భాషలలో ఉన్నాయి. 46 ప్రాంతీయ వార్తల యూనిట్లు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ, స్థానిక వ్యవహారాల వార్తల యోగ్యతను బట్టి బులెటిన్‌‌‌‌లు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. 21వ శతాబ్దం ప్రారంభం నుంచి రేడియో ప్రసారకులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సేవలను అందిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ కొత్త శ్రోతలను చేరుకుంటున్నారు.  రేడియో ఇప్పుడు డిజిటల్ అవతార్‌‌‌‌గా రూపాంతరం చెందింది. 

విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో విశ్వసనీయ శ్రోతలను నిలుపుకోవడమే కాకుండా కొత్త, యువ శ్రోతలను కూడా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లు, ఇతర మాధ్యమాల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల యుగంలో విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో  ప్రాముఖ్యత చాలా పెరిగింది.    

భవిష్యత్తులో  రేడియో కంటెంట్ సృష్టి, వ్యక్తీకరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పాత్ర  పోషిస్తుంది.  ఏఎం, ఎఫ్ఎం, డిజిటల్ రేడియో, కమ్యూనిటీ రేడియో,  వెబ్‌‌‌‌ రేడియో ఇలా రూపాంతరం చెందుతూ ఏదో ఒక రూపంలో ప్రపంచంలో విస్తృతంగా వినియోగించే  మాధ్యమంగా ఇప్పటికీ రేడియో నిలుస్తోంది. 

- డా. సునీల్ కుమార్ పోతన, సీనియర్ జర్నలిస్ట్-