సుబేదార్​ బంగ్లా ఇక చరిత్ర పుటల్లోనేనా?

ఆఫీసర్ల రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​ కోసం కూల్చేసే అవకాశం.. కనుమరుగు కానున్న చారిత్రక బిల్డింగ్!

హనుమకొండ, వెలుగు : ఓరుగల్లు నగరంలో మరో చారిత్రక కట్టడం కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ కోసం వరంగల్ సెంట్రల్​ జైల్ కాలగర్భంలో కలిసిపోగా.. ఇప్పుడు హనుమకొండలోని సుబేదార్​ బంగ్లా కూడా అదే లిస్ట్​ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం డిస్ట్రిక్ట్​ ఆఫీసర్స్​ రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​ నిర్మిస్తుండగా..  సీఎం కేసీఆర్​ చెప్పిన ప్రమాణాలకు అక్కడున్న స్థలం సరిపోయే పరిస్థితి లేదు. దీంతో    సుబేదార్​ బిల్డింగ్​ను  తొలగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  గురువారంతో ఆ బిల్డింగుకు పునాదులు పడి 137 ఏండ్లు  నిండాయి. 

ఏండ్ల కిందటి నిర్మాణం.. ఎన్నో ప్రత్యేకతలు

ప్రస్తుతం హనుమకొండ కలెక్టర్​ క్యాంప్​ ఆఫీస్​ గా వినియోగిస్తున్న  బిల్డింగుకు  1886 లోనే పునాదులు పడ్డాయి. అప్పటి బ్రిటిష్​ సుబేదార్​ మేజర్​ జార్జ్​ పాల్మార్​ భార్య ఆగస్టు 10న బిల్డింగ్​ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాగా ఈ చారిత్రక బంగ్లాను ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో బంగ్లా నిర్మాణం మొత్తం పటిష్టమైన డంగు సున్నంతో జరిగింది.    బంగ్లాలోకి ఎంట్రన్స్​ వద్ద కమాన్​ కు పెద్ద సైజు గడియారం ఉంటుంది. లోపలికి వెళ్లగానే నాటి చరిత్రను కళ్లకు కట్టే భవంతి, నీటి కొలను,  ఫౌంటెన్లు ఉంటాయి.   భవంతిలోపల చెక్క మెట్లు ఉన్నాయి.  శతాబ్ధం దాటినా ఇంతవరకు ఆ బంగ్లా చెక్కుచెదరకపోవడం విశేషం. 

కాగా స్వాతంత్రం ముందు  వరకు  సుబేదార్ నివాసంగా వాడిన ఈ భవనాన్ని 1950 నుంచి జిల్లా కలెక్టర్ నివాసంగా మార్చారు. అప్పటి నుంచి  ఇప్పటివరకు  దాదాపు 42 మంది కలెక్టర్లు ఇదే బిల్డింగులోనే ఉన్నారు. కాగా ఈ ఆవరణలో మెట్ల బావి ఉండగా..1982 లో జవహర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో పూడిక తీయించారు. అప్పుడు నిజాం కాలంనాటి కత్తులు, ఇతర సామాగ్రి లభించాయి.  వాటిని  పురావస్తు శాఖకు అప్పగించారు.   

11 కోట్లతో ఆఫీసర్స్​  రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​

ఇంటిగ్రెటెడ్​ డిస్ట్రిక్ట్​ ఆఫీసర్స్​ కాంప్లెక్స్ లోభాగంగా  హనుమకొండ కలెక్టరేట్​ కాంప్లెక్స్​ నిర్మించారు. రెండేండ్ల కిందట ఆ బిల్డింగ్​ ఓపెనింగ్​కు వచ్చిన సీఎం కేసీఆర్​  హనుమకొండ కలెక్టర్​ సహా ఇతర అధికారులకు ఒకేచోట రెసిడెన్షియల్​  కాంప్లెక్స్​ నిర్మించాలన్నారు. ఈ మేరకు సుబేదార్​ బంగ్లా ప్రాంగణంలో అధికారులు రూ.11 కోట్ల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కలెక్టర్​ రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​,  దాదాపు మూడు వేల ఎస్​ఎఫ్​టీలో   రెండు అడిషనల్​ కలెక్టర్ల బిల్డింగ్​, మరో ఎనిమిది డిస్ట్రిక్ట్​ లెవల్​ ఆఫీసర్ల జీ ప్లస్ వన్​ బిల్డింగ్​ నిర్మిస్తున్నారు.

అదే ప్లేసులో పార్కింగ్​, గార్డెనింగ్​, ఇతర సదుపాయాలతో మోడ్రన్​ బిల్డింగ్​  నిర్మిస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్​ చెప్పిన ప్రకారం కలెక్టరేట్ కాంపౌండ్​ లోనే హెలీప్యాడ్​ ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది.  చారిత్రక సుబేదార్​ బంగ్లాను సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.