ఇంగ్లీష్​ మీడియం మంచిదే.. మరి ఇబ్బందులు దాటుడెట్ల?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అకడమిక్ ​ఇయర్​ నుంచి 8వ తరగతి వరకు అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా బోధనపై దశల వారీగా కొన్ని రోజులపాటు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే ఒకేసారి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ ​మీడియంలో విద్యా బోధన సాధ్యమవుతుందా? ప్రభుత్వం ఇచ్చే కొన్ని రోజుల శిక్షణతో టీచర్లు వారి వారి సబ్జెక్ట్​లను ఏ మేరకు ఇంగ్లీష్​లో బోధించగలరన్నది దానిపై ప్రభుత్వ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ ​మీడియంలో బోధన అనేది ఆహ్వానించదగిన మార్పే కానీ.. సాధ్యాసాధ్యాలు, దాని అమలులో ఉన్న ఇబ్బందులపై ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ప్రకటన చేసింది. ఇంకా చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. ఇప్పటికే కొన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న టీచర్లకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ.. తెలుగు మీడియంలో చదువుకొని, ఏండ్లుగా తెలుగులోనే బోధిస్తున్న టీచర్లకు మాత్రం ఇంగ్లీష్​లో బోధన అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్​లాంటి సబ్జెక్ట్​ టీచర్లు ఉన్న ఫళంగా ఇంగ్లీష్​మీడియంలో బోధన ఏ మాత్రం చేయగలరనేదానిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వారు ఇంగ్లీష్​లో సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నిరంతర శిక్షణ, ఇతర కార్యక్రమాల రూపకల్పనపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

టీచర్లకు శిక్షణ మాత్రమే సరిపోతుందా..?
ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ప్రభుత్వం టీచర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఈ ట్రైనింగ్​క్లాసెస్​ కొనసాగనున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్‌‌ పర్సన్లు ఉపాధ్యాయులకు బోధనలో మెళకువలు నేర్పుతున్నారు. మొదటి విడతలో ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ తర్వాత వారికి వర్క్‌‌షీట్లు అందిస్తారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన టీచర్లు ఆయా మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అయితే కేవలం అయిదు రోజుల శిక్షణతోనే టీచర్లు ఇంగ్లీష్​ మీడియంలో సబ్జెక్ట్​ను చెప్పగలరా? ఉదాహరణకు 55 ఏండ్ల వయసు గల ఓ ఫిజికల్​ సైన్స్​టీచర్​అయిదు రోజుల శిక్షణ తీసుకొని 8వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్​మీడియంలో సబ్జెక్ట్​ఎంత వరకు సమర్థవంతంగా చెప్పగలరు? కాబట్టి ప్రభుత్వం కొన్ని రోజుల శిక్షణతోపాటు ఉపాధ్యాయులను అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. గతంలో సక్సెస్ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి కేవలం13 రోజులు తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత చేతులు దులిపేసుకుంది. తద్వారా సక్సెస్ పాఠశాలల్లో బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించిన ఉపాధ్యాయులకు బోధన పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 90 శాతం టీచర్లు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్న వారు కావడం వల్ల ఆంగ్ల మాధ్యమంలో బోధించడం వారికి కష్టంగా మారింది. కొన్ని పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమం ఉండటంవల్ల ఇష్టమున్న ఉపాధ్యాయులే ఆయా పాఠశాలల్లో బోధించారు. కానీ ప్రస్తుతం అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఒకేసారి ప్రవేశపెట్టడం వల్ల తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లకు ఆంగ్లంలో బోధన ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. నిరంతర ఆంగ్ల శిక్షణ వల్ల కొంత మేరకు ఫలితం రావొచ్చు. 

ఇప్పటికే 8 వేల బడుల్లో..
రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లల్లో 30 లక్షల మంది విద్యార్థులుంటే.. అందులో 95 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ఇక 26,072 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 22.93 లక్షల మంది స్టూడెంట్లు చదువుతుండగా.. వారిలో ఇంగ్లీష్‌‌ మీడియం వారి సంఖ్య10.21 లక్షలే. ప్రభుత్వ బడిలో చదివే నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధన ఎంతో ప్రయోజనకరం అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్​ కావడానికి ఇది ఉపకరించే అంశమే. కానీ దాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. అయినా చాలా పాఠశాలల్లో పేరుకే ఇంగ్లీష్​ మీడియం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వందల ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూళ్ల పేరిట ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమ బోధనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 8 వేల వరకు బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధన సాగుతోంది. అందులో 4 వేల వరకు ప్రాథమిక పాఠశాలలు ఉండగా, మిగిలినవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.

గురుకులాల్లో మంచి ఫలితాలు..
గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులతోపాటు టీచర్లకు ఆంగ్లబోధన అలవాటుగా మారింది. మెజార్టీ స్టూడెంట్లు మంచి అభ్యసనా సామర్థ్యాలు కనబరుస్తున్నారు. గురుకులాల్లో నడుస్తున్న ఆంగ్లబోధన విధానంపైనా ప్రభుత్వం అధ్యయనం చేసి, దాన్ని సర్కారు బడుల్లో అన్వయించేందుకు ప్రయత్నం చేయాలి. అవసరమైతే సెకండరీ, హైస్కూలు స్థాయిలో కొన్ని రోజులపాటు గురుకులాల టీచర్లను డిప్యూటేషన్​ విధానంలో సర్కారు బడుల్లో క్లాసులు చెప్పించి.. ఇటు విద్యార్థులకు, అటు సబ్జెక్ట్​టీచర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కరోనా తర్వాత సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక బాగా పెరిగింది. వచ్చే ఏడాది  నుంచి ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమం పేరిట అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. వీటన్నింటి దృష్ట్యా పకడ్బందీ ఆంగ్ల బోధనపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల మాతృభాషకు తీరని అన్యాయం జరుగుతుందని, పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక బడి మానేసే ప్రమాదం ఉందని, గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం కష్టం అవుతుందని విద్యానిపుణులు, తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలంకషంగా చర్చ జరగకుండానే లోతైన అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం ఒకేసారి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదంటున్నారు.

పిల్లలు ఏ మాత్రం అందుకోగలరు?
వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించడంతో.. విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ద్విభాషా (ఇంగ్లీష్, తెలుగు) బోధనకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎస్‌సీఈఆర్టీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేయనున్నారు. అయితే ప్రస్తుతం 6, 7 తరగతులు తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలు పై తరగతుల్లో సడెన్​గా ఇంగ్లీష్​మీడియంలో చదవాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. లాంగ్వేజెస్ ​వరకు సమస్యేమీ ఉండకపోయినా.. సైన్స్, సోషల్, మ్యాథ్స్​ సబ్జెక్టులలో అనేక కొత్త పదాలు వారిని ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. ప్రభుత్వం టీచర్లకు శిక్షణ ఇచ్చినట్లే.. స్టూడెంట్ల సామర్థ్యాల పెంపు, ఇంగ్లీష్​లో ప్రాథమిక భావనలను అర్థం చేసేందుకు ప్రత్యేక తరగతులు పెట్టాలి. వీలైతే ఈ వేసవి సెలవుల్లోనే స్పెషల్​క్లాసులు పెట్టి నేర్పించాలి. అప్పుడే వారు ఇంగ్లీష్​ మీడియంలో సబ్జెక్టును అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటారు. లేదంటే విషయం అర్థంగాక ప్రస్తుతం ఉన్న స్థానం కంటే మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.    

- పిన్నింటి బాలాజీ రావు, డీపీయూఎస్ వరంగల్ ​జిల్లా అధ్యక్షుడు