వందలాది మంది ఖైదీలు పరారీ
మరో 50 మందికి గాయాలు
దాడి తమ పనేనన్న ఐఎస్
కాబూల్: అఫ్గనిస్తాన్ లోని జైలుపై ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు దాడిచేశారు. జైల్లోని టెర్రరిస్టులను విడిపించేందుకు ఎంట్రన్స్ దగ్గర్లో కారు బాంబు పేల్చారు. పేలుడు ధాటికి గోడలు దెబ్బతినడంతో వందలాది మంది ఖైదీలు పారిపోయారు. టెర్రరిస్టులు, భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో 29 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. నంగర్హర్ ప్రావిన్స్ క్యాపిటల్ జలాలాబాద్ లోని జైలులో ఈ ఘటన జరిగింది. జైలులో ఉన్న వందల మంది తమవాళ్లను విడిపించుకునేందుకు ఐఎస్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో జైలు ఎంట్రన్స్ లో సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడి చేశాడు. తర్వాత మిగతా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు టెర్రరిస్టులను సెక్యూరిటీ బలగాలు హతమార్చాయి. సోమవారం కూడా టెర్రరిస్టులు, సెక్యూరిటీ బలగాల మధ్య కాల్పులు కొనసాగినట్లు నంగర్హర్ ప్రావిన్స్ గవర్నర్ స్పోక్స్ పర్సన్ అత్తావుల్లా ఖొగ్యాని చెప్పారు. మృతుల్లో ఖైదీలు, పౌరులు, జైలు గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నాటికి జైలును తిరిగి ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది.
దాడికి మేమే బాధ్యులం: ఐఎస్
జలాలాబాద్ జైలుపై దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. దాడికి కారణాలను వెల్లడించలేదు. టెర్రరిస్టులు, సెక్యూరిటీ బలగాల మధ్య కాల్పులు జరుగుతుండగా కొందరు దుండగులు పరారైనట్లు అధికారులు చెప్పారు. జైలులో 1500 మంది ఖైదీలు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు చెందినవారేనని తెలిపారు. జలాలాబాద్ సమీపంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కమాండర్ ను కాల్చి చంపిన మరుసటి రోజే జైలుపై దాడి జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. కాగా, జలాలాబాద్ ఘటనతో తమకు సంబంధం లేదని తాలిబన్ ప్రకటించింది.
For More News..