అలీన విధానం కథ ముగిసినట్లేనా?

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, రష్యా (నాటి యూఎస్ఎస్ఆర్) రెండు పవర్ సెంటర్స్ గా నిలబడ్డాయి. ప్రపంచం మొత్తంపై కర్రపెత్తనం చేయాలన్న ఆశతో మళ్లీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది అలీన విధానం. నాటి ప్రచ్చన్న యుద్ధ పరిస్థితుల్లో అప్పుడే స్వాతంత్ర్యం సాధించుకున్న చాలా దేశాలకు వాటి సార్వభౌమత్వం నిలుపుకుని ముందుకు సాగడంలో ఊతాన్నిచ్చింది. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న రెండు దేశాల్లో ఏదో ఒక దానికి మిత్ర దేశంగా నిలబడి వాటి అండతో ముందుకు వెళ్లాలని చాలా దేశాలు నిర్ణయించుకున్నా కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలకు అలీన విధానం రూపంలో ఒక తటస్థ కూటమికి భారత్ రూపుదిద్దింది. అమెరికా, యూఎస్ఎస్ఆర్ ప్రభావాన్ని వర్తమాన దేశాలపై పడకుండా మన దేశం కీలక పాత్ర పోషించింది. కానీ నాడు రెండు పవర్ సెంటర్స్ కు ప్రత్యామ్నాయంగా నిలిచిన అలీన విధానమే ఇప్పుడు కనుమరుగవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రపంచ శాంతి కోసం భారత్ చేసిన ప్రయత్నాల్లో అలీన విధానం, పంచశీల సూత్రాల రూపకల్పన.. రెండూ చాలా కీలకమైనవి. హిట్లర్ విస్తరణ వాద కాంక్షతో మొదలైన  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితులు రాకుండా నిలువరించడంలో అలీన విధానం ఎంతో ఉపయోగపడింది. వర్తమాన దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలోనూ మేజర్ రోల్ పోషించింది. అలాంటి ఆ విధాన రూపకర్త అయిన భారత్ ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్’ (బెకా)తో అలీన విధానం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వాస్తవానికి అలీన విధానం మసకబారటం యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నంతోనే ప్రారంభమైంది. యూఎస్ఎస్ఆర్ లోని చాలా దేశాలు వేరుపడిన నాటి నుంచి రష్యా ఆధిపత్యానికి గండిపడింది. రెండు పవర్ సెంటర్స్ లో ఒకటి వీక్ అయిపోవడంతో అమెరికా మరింత శక్తిమంతంగా మారింది. సింగిల్ పవర్ సెంటర్ గా అమెరికా ఉన్న వేళ ప్రపంచంలో గురుతర బాధ్యత వహించాల్సిన అలీన దేశాలు తమ విదేశాంగ విధానాలను మార్చుకుంటూ అమెరికాకు దగ్గరవుతుండడం మనం చూస్తున్నాం. కాలానికి అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించడంతో ఆ విషయంలో రెండో మాటకు ఆస్కారం లేకుండాపోయింది.

అమెరికానూ నమ్మలేం

ద్వి ధ్రువ ప్రపంచంలో ఆనాటి రష్యాకు, నేటి చైనాకు చాలా తేడా ఉంది. అమెరికా – రష్యాలకు  మధ్యలో ఉండి అలీన విధానాన్ని పాటించే పరిస్థితులు ఆనాటివి. చైనా దురాక్రమణ, విస్తరణ వాంఛ అటువంటి పరిస్థితులు లేకుండా చేస్తోంది. కాబట్టే కాలానికి అనుగుణంగా మార్పులు ఉంటాయని మన విదేశాంగ మంత్రి చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది. కానీ భారత రాజ్యాంగానికి మౌలిక సూత్రాలు ఎంత ముఖ్యమో, భారత విదేశాంగ విధానానికి పంచశీల సూత్రాలు కూడా అంతే ముఖ్యం. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన కలిగి ఉండడం, దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలను గౌరవించడం, దేశాలన్నీ శాంతియుత సహజీవనం సాగించడమన్న ఈ ఐదు సూత్రాలను భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో  భారతదేశం కట్టుబడి ఉంటుందనేది అక్షర సత్యం. కానీ మనతో వివిధ ఒప్పందాల్లో భాగస్వామి అయిన అమెరికా ప్రపంచానికే ఆదర్శప్రాయమైన పంచశీల సూత్రాల స్ఫూర్తిని గతంలో ఎప్పుడూ పాటించలేదు.. మన ప్రయోజనాల కోసం  అమెరికాతో ఒప్పందం మంచిదే అయినా, ప్రపంచంలో అమెరికా తన ప్రయోజనాల కోసం భారతదేశాన్ని వాడుకోకుండా మనం నిలువరించగలమా? అన్నదే ప్రశ్న. ఒక్క చైనా బూచి వల్ల మన సార్వభౌమాధికారాన్ని, వర్తమాన దేశాలకు నాయకత్వం వహిస్తూ మనం అనుసరిస్తున్న అలీన విధానాన్ని అమెరికాకు తాకట్టు పెడదామా? చైనాను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలే లేవా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది.ఆనాడు యూఎస్ఎస్ఆర్ ని బూచిగా చూపి అట్లాంటిక్ దేశాలను అమెరికా తాను చెప్పిందానికల్లా తల ఊపేలా మార్చుకుంది. ఇప్పుడు చైనాను బూచిగా చూపించి ఇండో–పసిఫిక్ దేశాలను తన ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు అమెరికాతో జట్టు కట్టడం  తప్పనిసరిగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే అమెరికా.. దాని అవసరాలకు మన ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా మన ప్రభుత్వాధినేతలు చూసుకోవాలి. అమెరికాతో జట్టుకట్టినప్పటికీ అలీన విధానానికి మూలమైన పంచశీల సూత్రాలను ఇండియా సర్వకాలాలయందు పాటిస్తుందనే విషయాన్ని చాటి చెప్పాలి. మనతో ఒప్పందం చేసుకున్న మిత్రదేశాలు కూడా ఆ విధానాలు పాటించేలా  ఒత్తిడి పెంచాలి. ఒకే పవర్ సెంటర్ అన్న ధోరణి కాకుండా బహుళ ధ్రువ ప్రపంచానికి ప్రాతిపాదిక బహుళ ధ్రువ ఆసియా అన్నది చైనా తో పాటు అమెరికా కూడా గుర్తించే విధంగా మన చర్యలు ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు  జరగాలనేది వాస్తవమే అయినా ఆ మార్పులు ఎప్పుడూ మన విదేశాంగ మౌలిక సూత్రాలను విస్మరించేలా ఉండొద్దన్నది గుర్తెరిగి ముందుకు నడవాలి.

చైనాకు చెక్ పెట్టడానికి అమెరికాతో..

ఏ దేశానికైనా తన ప్రయోజనాలే ముఖ్యం. ఆ కోణంలో చూసినప్పుడు మన దేశం అమెరికాతో ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ రంగ ఒప్పందాలు చేసుకుంటూ ఆ అగ్రరాజ్యానికి దగ్గరవడం అటు చైనా, ఇటు పాకిస్థాన్ లకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతాయని చెప్పొచ్చు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ద్విధ్రువ ప్రపంచంలో అటు అమెరికా కానీ, ఇటు రష్యా కానీ మన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ఎప్పుడూ ప్రత్యక్షంగా సవాళ్లు చేయలేదు. వారి వారి ప్రయోజనాల కోసం  వర్తమాన దేశాలను ఉపయోగించుకునే విధంగా ముందుకు సాగాయి. ఎప్పుడూ భారత్ పై దెబ్బకొట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో మరో పవర్ సెంటర్ గా మారాలని ఉబలాటపడుతున్న  చైనా భవిష్యత్తులో భారతదేశం తనకు పోటీ వస్తుందని ఏవో కుట్రలకు పాల్పడుతుందని కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. చైనా తన విస్తరణవాంఛ కారణంగానో లేదా ఆసియాలో పెద్దన్న పాత్రకు ఇండియా అడ్డొస్తుందనో మన దేశాన్ని టార్గెట్ చేస్తూ వస్తోంది.

జుర్రు నారాయణ,

టీటీయూ జిల్లా అధ్యక్షుడుమహబూబ్ నగర్