Kitchen Tips: బియ్యంలోకి పురుగులు ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..

Kitchen Tips:  బియ్యంలోకి పురుగులు  ఎందుకు వస్తాయి.. ఎలా తరిమికొట్టాలో తెలుసా..

కిచెన్ లో బియ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తాయో వేరే చెప్పనక్కరలేదు.  అలాంటి  బియ్యానికి మాత్రం చాలా తక్కువ సమయంలోనే పురుగులు పట్టే అవకాశం ఉంది.వాటిని పదేపదే శుభ్రం చేసుకోవడం కూడా కష్టమే. అసలు వాటికి పురుగులే పట్టకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు కదా. బియ్యం లేదా పప్పులు కొని తెచ్చాక చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాటికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. 

నిత్యావసర వస్తువుల్లో బియ్యం చాలా ముఖ్యమైనవి.  ఇంట్లో ఏమి ఉన్నా.. ఏమి లేకపోయినా... బియ్యం ఉంటే చాలు.. కాస్తంత ఊరగాయ ముక్క వేసుకొని పొట్ట నింపుకోవచ్చు.  అంటే కిచెన్ లో బియ్యం ఎంత కీలకమో వేరే చెప్పనక్కరలేదు.  కోటి విద్యలు.. కూటి కొరకే అన్నారు పెద్దలు.. అలాంటి కూడును  బియ్యంతోనే తయారు చేసుకోవాలి.  అలాంటి  వాటిలో పురుగులు చేరాయా ఇంకేముంది.. మన బాడీకి వచ్చే పోషకాలను అవి లాగేసుకుంటాయి.  అంటే బియ్యంలో పురుగులు చేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..

అసలు బియ్యానికి ఎందుకంత త్వరగా పురుగులు పడతాయో తెలుసుకుంటే .. నివారణ మార్గాలు తెలుస్తాయి.  బియ్యంలో  పురుగులు నివసించడానికి అనువైన వాతావరణం ఉంటుంది. అందుకే చాలా రకాల పురుగులు కాపురం మొదలుపెట్టేస్తాయి.  ఇక ఊరుకుంటాయా... పిల్లలు పెట్టి సంతతిని  పెంచేస్తాయి. పొలాల్లో  పంటలు కోసి ఆహార ప్రాసెసింగ్ కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు వాటిలో కొన్ని పురుగులు ఉండే అవకాశం ఉంది.  ప్రాసెసింగ్ అంతా అయ్యాక బియ్యాన్ని మూటల్లో కట్టి అమ్మేస్తారు. ఇక ఆ మూటలో ఒక్క పురుగు ఉన్న చాలు, అనువైన వాతావరణం రాగానే తమ జనాభాను పెంచే పనిలో ఉంటాయి. అలా బియ్యానికి పురుగులు అధికంగా పట్టేస్తాయి. 

ఇంకా బియ్యానికి  తడి తగిలినా బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంది. అందుకే గాలి చొరబడని, తడి తగలని కంటైనర్లలో బియ్యాన్ని నిల్వ ఉంచుకోమని చెబుతారు. బియ్యంలో కొన్ని రకాల పదార్థాలు కలపడం ద్వారా పురుగులను నివారించవచ్చు. 

  • బిర్యానీ ఆకులు :  బియ్యాన్ని నిల్వ చేసే పాత్రలో  ఆరేడు బిర్యానీ ఆకులను ఉంచండి. బియ్యం ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బిర్యానీ ఆకులను కలపండి. గాలి చొరబడకుండా బియ్యం మూటను కట్టేయండి. 
  • లవంగాలు : బలమైన సువాసన గల ఈ సుగంధ ద్రవ్యాలు బియ్యానికి పురుగులు పట్టకుండా అడ్డుకుంటాయి.వంట గదిలో సూక్ష్మక్రిములు లేకుండా నివారించడంలో లవంగాలు ముందుంటాయి. లవంగం నూనెను స్ప్రే చేసినా కూడా పురుగులు పట్టవు.
  • వెల్లుల్లి :  ప్రతి ఇంట్లో లభించే అత్యద్భుతమైన పదార్థం వెల్లుల్లి. దీన్ని పొట్టు తీశాక బియ్యంలో కలిపేయాలి. అలా బియ్యం వాడినంత కాలం వాటిని అలానే ఉంచుకోవచ్చు. పురుగులు వెల్లుల్లి ఉన్నచోట ఆ ఘాటుకు ఉండలేవు..
  •  వేపాకు : బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుతంగా పని చేస్తుంది వేపాకు. బియ్యాన్ని నిల్వ చేసుకునే డ‌బ్బా అడుగు భాగాన వేపాకును ఉంచాలి. ఈ వేపాకుపై బియ్యం పోయాలి. ఇలా కాకుండా వేపాకుల పొడిని ఓ గుడ్డలో మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయ‌డం వల్ల కూడా బియ్యం పురుగు ప‌ట్టకుండా ఉంటుంది. 

ఎక్కువగా పురుగులు పడితే బియ్యాన్ని సూర్య కాంతిలో ఎండబెట్టాలి. అలా అని మరీ ఎర్రటి ఎండలో ఎండబెడితే, గింజలు విరిగిపోయి నూకల్లా తయారవుతాయి. కాబట్టి సూర్యకాంతి తగిలేటట్టు ఒక షీట్ మీద విస్తరించి ఎండబెట్టండి. పురుగులన్నీ పోయాక గాలి చొరబడని కంటైనర్లో వేసి ప్యాక్ చేయండి.అలాగే బియ్యంలో  నల్ల మిరియాలు చల్లడం ద్వారా పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. .  ప్రతి రెండు నెలలకు ఒకసారి బియ్యం, ఇతర ధాన్యాలు, పప్పులు ఇలా ఎండలో ఉంచడం మంచిది.బియ్యంలో అల్లం ముక్క, పసుపును కలపడం ద్వారా పురుగులను పారద్రోలవచ్చు