పీఆర్సీపై సీఎం మాటలకు విలువ లేదా?

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలో 30% ఫిట్​మెంట్ ఇస్తున్నట్టు గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు 2017 ఏప్రిల్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. ఆర్టీసీ వాళ్లు ఏం పాపం చేశారని పీఆర్సీ ఇవ్వలేదని విన్నవించుకుంటే.. వారికి  కూడా వేతనాలు పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాదు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కంటే ముందే ఆర్టీసీ వాళ్లకూ పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. సాగర్ ఎన్నిక అయిపోయినా.. 2021 ఏప్రిల్​ నుంచి రెండో పీఆర్సీ అమలు జరగాల్సిన సమయం దాటిపోతున్నా.. ఇప్పటి వరకూ మొదటి పీఆర్సీ కూడా ప్రకటించకపోవడం దారుణం. స్వయంగా సీఎం కేసీఆర్​ ఇచ్చిన మాటకు కూడా విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవసరాలకు ఎన్నైనా అబద్ధాలు చెబుతూ మోసం చేయవచ్చా? ఆయన మాటలకు నిజాయితీ లేదనుకోవాలా? ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తారనుకోవాలా? యావత్తు ఆర్టీసీ సిబ్బంది ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. వీటికి సమాధానం చెప్పాల్సింది కేసీఆరే.
నిరంకుశంగా వ్యవహరిస్తున్న మేనేజ్​మెంట్
2019 అక్టోబర్​లో 55 రోజుల సమ్మె తర్వాత ఆర్టీసీ సిబ్బందిని ప్రగతి భవన్ కు పిలిపించుకొని సీఎం కేసీఆర్​ అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా నన్ను అడిగే వాడు ఉండవద్దని యూనియన్లను రద్దు చేస్తూ వెల్ఫేర్ కమిటీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మేనేజ్​మెంట్​ రెండేండ్ల వరకు యూనియన్ ఎన్నికలు వద్దని, అన్నీ తామే చూసుకుంటామని సిబ్బందితో పత్రాలు రాయించుకుని(కోర్టుకు పోవద్దని) నిరంకుశంగా వ్యవహరిస్తూ ఆర్టీసీని, సిబ్బందిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. కార్మిక చట్టాలను గౌరవించాల్సిన ముఖ్యమంత్రే వాటిని తుంగలో తొక్కి నియంతలా వ్యవహరించడం సరికాదు. నియంత కాలం ఎల్లవేళలా నడవదని సీఎం గుర్తుంచుకోవాలి. ఇదే పరిస్థితి కొనసాగితే టీఆర్ఎస్ ప్రభుత్వం దీర్ఘకాలం మనుగడ కొనసాగించలేదని తెలుసుకోవాలి. 
ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లే
కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తున్నా.. కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ సిబ్బంది, సూపర్​వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఎంతో మంది స్టాఫ్​ కరోనా బారినపడి చనిపోతున్నా ఉద్యోగులకు ఎలాంటి రక్షణ, సదుపాయాలు కల్పించకపోవడం ఎంత వరకు సమంజసం. ఇంత వరకూ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక్క కరోనా సెంటర్​ను కూడా ఏర్పాటు చేయకుండా వారి ప్రాణాలు బలిగొంటున్నారు. దీంతో వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు. సంస్థ అంతర్గతంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు మేనేజ్​మెంట్, సర్కారు వ్యవహరించడం సరైనది కాదు. 
రిటైర్​ అవుతున్నా.. రిక్రూట్​మెంట్​ లేదు
ఏటా లక్షల సంఖ్యలో ప్రయాణికులు పెరుగుతూ ఉంటే టీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2014 నుంచి టీఎస్ఆర్టీసీకి అదనంగా ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఒక్క డిపోను కూడా పెంచలేదు. ఉన్న సిబ్బంది రిటైర్ అవుతున్నా రిక్రూట్​మెంట్​ చేపట్టకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని దూరం చేస్తున్నారు. ఒకరిద్దరు యూనియన్ నాయకులు ప్రభుత్వ పంచన చేరి తొత్తులుగా మారారు. వారి స్వార్థం కోసం ట్రేడ్ యూనియన్ల విలువలను దిగజార్చి హక్కులను ప్రశ్నించి సాధించుకునే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి తీసుకువచ్చారు. మొత్తం ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారు. ఇటువంటి దుర్మార్గులకు ఆర్టీసీ సిబ్బంది తగిన బుద్ది చెప్పాలి. ప్రభుత్వం, మేనేజ్​మెంట్​ యూనియన్లు లేవంటూనే ఒకరిద్దరు నాయకులకు సంతకాలు పెడితే జీతం ఇస్తూ వారి ద్వారా యావత్​ సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారు. ఇటువంటి పద్ధతి వెంటనే మానుకోవాలి. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించి సిబ్బంది సమస్యలు పరిష్కరించటానికి ప్రభుత్వం, మేనేజ్​మెంట్​ చర్యలు తీసుకోవాలి.
పొదుపు డబ్బులు వాడుకున్నరు
సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ కింద ఆర్టీసీ సిబ్బంది సొంతంగా పొదుపు చేసుకున్న వందల కోట్ల రూపాయలను యాజమాన్యం మూడేండ్ల నుంచి సిగ్గు లేకుండా వాడుకుని ఈరోజుకు కూడా మా డబ్బులు తిరిగి ఇవ్వకుంటే ఏమనాలి? ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందని నమ్మాలి? 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు(ఎరియర్స్) 50% బాండ్​ డబ్బుల(2015-2020) సమయం అయిపోయినా ఇప్పటికీ చెల్లించకపోవడం, ఆటోమేటిక్ గా రావలసిన నాలుగు డీఏలను ఇంప్లిమెంట్​ చేయకపోవడం, రెండేండ్ల నుంచి రంజాన్, దసరా ఫెస్టివల్ అడ్వాన్సులు ఇవ్వకపోవడం, కొత్తగా ఉద్యోగ భద్రత సర్క్యూలర్ పేరుతో వందల మందిని ఉద్యోగం నుంచి తీసేస్తుండటం ఎంత దుర్మార్గం. కావాలనే టీఎస్​ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తూ సిబ్బంది వాళ్లంతట వాళ్లే ఉద్యోగం విడిచిపెట్టి పోయేలా చట్టవ్యతిరేక డ్యూటీలు, బలవంతంగా డ్రైవర్లతో టిమ్​ 
డ్యూటీలను చేయిస్తూ కేసీఆర్​ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. -కె.హనుమంతు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్.