ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ సొమ్ముచేసుకుంటుందా? లేదా దాన్ని లెక్కలోకి రానియ్యకుండా ఇతర విషయాలతో కన్నడిగులను, తద్వారా అధికారాన్ని బీజేపీ నిలబెట్టుకుంటుందా? అన్నదాన్ని బట్టి కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ఫలితం తేలనుంది. పోలింగ్ ముందు, ఆఖరి వారం ప్రత్యర్థి పార్టీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. బయటకు కనిపించేదాన్ని బట్టి... పక్షం రోజులుగా కాంగ్రెస్ గ్రాఫ్ పైకి వెళుతోంది. ఫలితాల తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడమో, మెజారిటీ స్థానాలు(130+) దక్కించుకోవడమో జరగొచ్చనే అంచనాలున్నాయి. బీజేపీ నాయకశ్రేణి, కార్యకర్తలతో పాటు ప్రత్యర్థులు, బయటి జనం కూడా.. చివరి రోజుల్లో ఆ పార్టీ చేసే, చేయగలిగే ‘వ్యవహార దక్షత’ ఎట్లా ఫలిస్తుందోననే ఆసక్తితో నిరీక్షిస్తున్నారు. ఎన్నికలకు వారం, ఫలితాలకు పట్టుమని పది రోజులైనా లేని ఈ సమయం.. అంతటా ఉత్కంఠ రేపుతోంది!
కర్నాటక ఫలితాలపై దేశవ్యాప్త ఉత్కంఠకు పలు కారణాలున్నట్టే ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. పాలక బీజేపీ అనుకూలతల కన్నా విపక్ష కాంగ్రెస్ సానుకూలాంశాలే ఎక్కువ! గెలుపు తమదేనని ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నా, ఈ నెల10న జరగనున్న ఒకే విడత పోలింగ్ తేదీ సమీపిస్తుంటే, ఇద్దరి నడుమ వ్యత్యాసంలో రోజు రోజుకూ మార్పు కనిపిస్తోంది. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత ఇస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం ‘ఏ అవకాశాన్నీ జారవిడవొద్దు, ఆఖరి క్షణం వరకు అన్ని యత్నాలూ చేయాల్సిందేన’ని స్థానిక నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలన్నీ ‘జై బజరంగ్ బలి’ నినాదంతో ముగించాలనే తాజా పిలుపూఅందులో భాగమే!
స్థానిక వర్సెస్ మోడీ
కాంగ్రెస్ పార్టీ వ్యూహంతో స్థానికాంశాలపైనే ఫోకస్ పెట్టింది. బీజేపీ ప్రధాని మోడీ మంత్రం జపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించే కావచ్చు, మోడీయే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నంత హడావుడి ఉంది. నాయకులంతా తమ ప్రసంగాల్లో, ‘కర్నాటకను మోడీ చేతుల్లో పెట్టండి చాలు, మిగతాది ఆయన చూసుకుంటారన్న’ట్టు మాట్లాడుతున్నారు.‘ఏదో తెలియని (‘ఎక్స్’ ఫ్యాక్టర్) ప్రభావాన్ని తెచ్చి, ఎన్నికల ఫలితాన్ని ఆయన పార్టీ ఖాతాలోకి తెస్తారన్నది వారి నమ్మకం. కాంగ్రెస్ మాత్రం కర్నాటకలో ప్రభుత్వ వైఫల్యాలను, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, అవినీతి, పేదరికం వంటి ప్రజా సమస్యల్ని ప్రచారం చేస్తూ ముందుకెళుతోంది. ‘మోడీ వర్సెస్ రాహుల్’ అన్న చర్చను రానీయకుండా, స్థానికాంశాలతోనే హిమాచల్ ఎన్నికల్లో గట్టెక్కిన పంథాను ఇక్కడా అనుసరిస్తోంది. మెజారిటీ ఓటర్లున్న పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉందని ఎన్డీటీవి – లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ సర్వేలోనూ తేలింది. బీజేపీకి తమ సంక్షేమ పథకాలపై ఆశ ఉన్నప్పటికీ, మోడీ ప్రతిష్ట, సోషల్ ఇంజనీరింగ్, ఎన్నికల వ్యవహార దక్షత, ఓటు శాతాన్ని సీట్లుగా మలచుకోలేని కాంగ్రెస్ అశక్తతపైనే ఎక్కువ ఆశలున్నాయి. ‘హిందుత్వ’ మనోభావాల్ని రేకెత్తించడం ద్వారా, అధికసంఖ్యాకుల అనుకూల వైఖరితో లబ్ధి పొందాలనే వ్యూహం అమలు చేస్తున్నారు.
వ్యూహం ముంచేనా, తేల్చేనా?
కులాలు, వర్గాల పరంగా తాము చేపట్టిన ‘సోషల్ ఇంజనీరింగ్’ వ్యూహం ఫలిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పెంపు, ఎస్సీల్లో అంతర్గత రిజర్వేషన్ వర్తింపు, 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు(ఓబీసీ నుంచి) తొలగించి వాటిని లింగాయత్, వక్కలింగ వర్గాలకు (రెండేసి శాతం చొప్పున) పంచడం లాభిస్తుందన్నది వారి వ్యూహం. వీరశైవ లింగాయత్‌లు బీజేపీకి, వక్కలింగలు జనతాదళ్(ఎస్)కు సానుకూలంగా ఉన్నట్టు గత ఎన్నికల్లో స్పష్టమైంది. మైనారిటీ వర్గాల ఓట్లు తమకెలాగూ రావు, లింగాయత్‌లలో మరింత బలపడి, వక్కలింగల్లో సానుకూలత పెంచుకుంటే సీట్లు పెరగొచ్చన్నది పాలకపక్ష ఉద్దేశమై ఉంటుంది. ఇది బెడిసి కొడుతుందని, వారికే నష్టమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రిజర్వేషన్ల పున:పంపకం శాస్త్రీయంగా లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్న కాంగ్రెస్, ముస్లిం ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా ఏకీకృతమవుతుందని భావిస్తోంది. జేడీ(ఎస్) బలంగా ఉన్న పాత మైసూర్ ప్రాంతంలో ఆ పార్టీవైపు మొగ్గే ముస్లింలు, బీజేపీని ఓడించగలిగే పార్టీగా ఈసారి తమవైపు వస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది. అదే జరిగితే, దక్షిణ కర్నాటక(59) సీట్ల సమీకరణాల్లో మార్పు జరగొచ్చు! ఎస్సీ రిజర్వేషన్లలో అంతర్గత వర్గీకరణ – రిజర్వేషన్‌ను కొన్ని ఆధిపత్య ఎస్సీ కులాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొంతమేర పెంచినా, మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం దాటద్దన్న క్యాప్ తొలగించకపోవడాన్ని ఆయా దళిత, బలహీనవర్గాలతో పాటు కాంగ్రెస్ తప్పుబడుతోంది. కుల సమీకరణాల్లో కొత్తగా ఇటు దక్షిణ కర్నాటక(పాత మైసూర్) పైన, ప్రాంత ప్రాధాన్యతల్లో అటు ఉత్తర కర్నాటకపైన బీజేపీ ఈసారి దృష్టి నిలిపింది. మిగతా మూడు ప్రాంతాల్లో బీజేపీ ఇదివరకే గరిష్ట లబ్ధిపొందింది కనుక వారికి గండి తప్పదని, వక్కలింగ ఓట్ల విషయంలో జేడీఎస్‌కు, లింగాయత్ ఓట్ల విషయంలో బీజేపీకి తామీసారి గండికొట్టి లబ్ధిపొందుతామని కాంగ్రెస్ ఆశిస్తోంది.
తలరాతలు మార్చే స్వింగ్
ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఒకటి, రెండు శాతాల ఓటు మార్పు కూడా ఎక్కువ సంఖ్య సీట్ల తేడాకి దారితీస్తుంది. అలా, ఒక పార్టీ ఓటు శాతం పెరిగినా, తరిగినా ఆ ప్రభావం ఇతర రెండు పార్టీలపైనా పడనుంది. 2003 నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లోనూ, అధికశాతం ఓట్లు పొంది కూడా మెజారిటీ సీట్లు(2013లో తప్ప) కాంగ్రెస్ సాధించలేకపోతోంది. అందుకు కారణం, బీజేపీలా వ్యూహాత్మకంగా నిర్దిష్ట సీట్లు, కొన్ని ప్రాంతాలు అని కాంగ్రెస్ దృష్టి పెట్టకపోవడం. కాంగ్రెస్ రాష్ట్రమంతా జనాదరణతో 38 శాతం ఓట్లు సాధించినా, ముంబయి కర్నాటక, కోస్తా కర్నాటక, మధ్య కర్నాటక ప్రాంతాలపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ, తక్కువ ఓటు శాతం(36)తో కూడా కాంగ్రెస్(80) కన్నా ఎక్కువ సీట్లు(104) దక్కించుకోగలిగింది. 2003, 2008, 2018 లోనూ ఇదే జరిగింది. 38 నుంచి కాంగ్రెస్ ఈ సారి 41 శాతం ఓట్లు సాధించవచ్చనే అంచనాలున్నాయి. తమ ఓట్‌షేర్ కిందటి సారి కన్నా 4-5 శాతం పెంచుకోవాలన్నది ఇద్దరి వ్యూహం.‘డాటా లోక్ డాట్ ఇన్’కు చెందిన ఆశీష్ రంజన్ జరిపిన ఓ శాస్త్రీయ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీకి 2018 ఓటు శాతం (36) కన్నా ఈసారి ఒక శాతం తగ్గితే, సీట్లు (నాటి104 నుంచి) 103కి పడిపోయి, కాంగ్రెస్ సీట్లు (నాటి 80 నుంచి) 81కి పెరుగుతాయి. అలాగే, బీజేపీకి ఓట్లు 2 శాతం తగ్గితే, బీజేపీ – కాంగ్రెస్ సీట్ల (91:-88) నిష్పత్తి మారనుంది. ఆ తగ్గుదల 3 శాతం (81-: 97), 4 శాతం (74- : 98), 10 శాతం (60 :-113) అయితే, సీట్లలో చాలా వ్యత్యాసం వస్తుంది. ఒక పార్టీ తన ఓటు శాతాన్ని పెంచుకుంటే వచ్చే సీట్ల వ్యత్యాసాల్లోనూ తేడాలుంటాయి. ఉదాహరణకు: కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో ఓట్ల శాతం(38) కన్నా ఒక శాతం పెంచుకున్నా సీట్లలో కిందటి సారి(80) కన్నా అధికంగా 83 గెలిచి, బీజేపీని 99కి పరిమితం చేయగలుగుతుంది. కాంగ్రెస్ ఓట్ల పెంపుదల 2 శాతం అయితే, కాంగ్రెస్ – బీజేపీకి సీట్ల నిష్పత్తి 92 : -96 గా ఉంటుంది. అలాగే, 3 శాతం(107- : 92), 4 శాతం (122 : -77), 10 శాతం (160 :-50) గా పెంచుకుంటే, సీట్లు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. ఇలాంటి సమీకరణం బీజేపీకి చూసినపుడు, ఓటు పెరుగుదల ఇంతకన్నా ఎక్కువ నిష్పత్తిలో సీట్ల పెంపుదలకు దారితీస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. ‘పీపుల్స్ పల్స్’ జరుపుతున్న ట్రాకర్ సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. ఇరు పార్టీలకు కూడా ఒకటి, రెండు శాతాల ఓటు స్వింగ్ ఎంతో కీలకం కానుంది.
ఎంత కీలకమో?
కర్నాటక ఫలితం పరోక్ష ప్రభావం, వచ్చే అక్టోబర్, -నవంబర్‌లో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం... తదితర రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది. ఆ ఎన్నికల ప్రభావం పరోక్షంగా 2024 సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుంది. అందుకే, రెండు పార్టీలూ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దక్షిణాది మొత్తంలో బీజేపీకి 29 లోక్‌సభ స్థానాలుంటే 25 కర్నాటక నుంచే ఉన్నాయి. దేశ రాజకీయాల్లో నానాటికి కుచించుకుపోతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక ఫలితం జీవగంజి! ఎలా చూసినా.. రెండు ప్రధానస్రవంతి పార్టీలకూ కర్నాటక ఫలితం కీలకమే!
దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ,