రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా!

తెలంగాణలో గత కొంత కాలంగా జరిగిన, జరుగుతున్న వరుస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మొదలుకొని వరంగల్​లో మెడికో ప్రీతి, నిజామాబాద్ లో మరో ఇద్దరు మెడికోల సూసైడ్స్, లాకప్ డెత్, మహిళలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వ స్పందన సరైన విధంగా లేదు. నిష్పక్షపాత విచారణ జరిపించి అసలు దోషులను బయటపెట్టి శిక్షించే క్రమంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలోనూ ప్రభుత్వ వైఖరి తడబాటుగాను, అనుమానాస్పదంగా ఉన్నదనే ఆరోపణలకు సమాధానం లేదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు లీకేజీ వ్యవహారం బయటపడ్డ రోజు నుంచి ప్రతి రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతున్నా, పోరాటాలు చేస్తున్నా చైర్మన్ సహా మొత్తం కార్యవర్గాన్ని, సెక్రటరీని ఎందుకు తప్పించటం లేదు? వారిని తప్పించకుండా జరిపే విచారణలో పారదర్శకత ఏముంటుందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మరెవరైన పెద్దల హస్తం ఉన్నదా అనే సందేహాన్ని ప్రభుత్వం నివృత్తి చేయలేకపోతున్నది. సిట్ పై నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకో వెనకడుగు వేస్తున్నది. 

ఉన్నత విద్య ఆగమాగం


ఉన్నత విద్యారంగానికి సంబంధించి గత తొమ్మిదేండ్లలో విశ్వవిద్యాలయాల్లో నియామకాలే లేవు. డిగ్రీ, జూనియర్, పాఠశాల విద్యా స్థాయిలోనూ ఇదే పరిస్థితి. పదోన్నతి కోసం టీచర్లు ఎదురు చూడటమే సరిపోతున్నది. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వాగ్దానం గడప దాటలేదు. విద్యార్థుల వసతి గృహాల్లో జరిగిన అవకతవకలకు సమగ్ర పరిష్కారం చూపనేలేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బోధన సిబ్బంది లేక, పరిశోధనలు కుంటుపడి వెల వెల పోతుంటే, బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్యకు దూరమవుతుంటే, అస్మదీయులకు కట్టబెట్టిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఒక వెలుగు వెలుగుతున్నాయి. రాష్ట్రంలో రైతు బంధు మినహా సబ్సిడీలు, రుణ మాఫీకి ఎగనామం పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను ఇతరత్రా ఆదుకోక పోవటం వల్ల రైతులు బలవన్మరణాలు ఆగడం లేదు. రైతు ఆత్మహత్యలు జరగటం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పటం కంటే హాస్యాస్పదం ఏమున్నది. రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత రైతు ఆత్మహత్యలు గుర్తించటం లేదు. ఎఫ్ఐఆర్ కేసుల ఆధారంగా రైతు స్వరాజ్య వేదిక 2022లో 403 మంది రైతులు వ్యవసాయ సంబంధమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది. ఇదే అంశంపై గతంలో బీఆర్ఎస్​నాయకులు రైతు స్వరాజ్య వేదికపై ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు పైగా నీళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, మరి రైతులు ఎందుకు చనిపోతున్నారో కూడా జవాబు చెప్పాలి కదా! ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వల్ల లక్షలాది రూపాయల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇంకా అందలేదు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కే అప్రజాస్వామిక వాతావరణం కనిపిస్తున్నది. ఇవన్నీ గమనిస్తే, పాలనాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి సమస్యను రాజకీయం చేయడం వల్ల, సమస్యకు పరిష్కారం దొరక్కపోగా, అసలైన దోషులు తప్పించుకునే అవకాశం ఏర్పడుతున్నది. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదేమోనని సర్వత్రా ఒక అభిప్రాయం బలపడుతున్నది. సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష నెరవేరటం ప్రజల చైతన్యం, జాగరూకతపైన ఆధారపడి ఉంది.

మొదలు ఇద్దరే అనుకుంటే..


టీఎస్​పీఎస్సీ పేపర్ ​లీకేజీ వ్యవహారంలో మొదలు ఇద్దరే నిందితులు ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ ఇది ఇద్దరు ముగ్గురి వ్యవహారం కాదని, పేపర్లు దేశం దాటిపోయాయని సిట్ బృందం అరెస్ట్ చేసిన వాళ్లను బట్టి అర్థమవుతున్నది. నిర్లక్ష్యంతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్​పీఎస్సీ బోర్డును మొత్తంగా తొలగించి అర్హత, నిజాయితీ గల వారితో పునర్వ్యవస్థీకరించి పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలి. అప్పుడే నిరుద్యోగ యువతకు బోర్డుపై, ప్రభుత్వ చిత్తశుద్ధిపై నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లకు, హాస్టళ్లకు వేలకు వేలు ఖర్చు పెట్టి, ఉద్యోగాలకు సెలవు పెట్టి నెలల తరబడి కోచింగ్ తీసుకొని చదువుకుంటున్న వారు నిరాశ, నిస్పృహలో ఉన్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి?, అసలు పరీక్షలు సకాలంలో నిర్వహిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఇప్పటికే చాలా మంది ఖర్చులు భరించలేక, అటు కుటుంబానికి ఆసరా  కాలేక సతమతమౌతున్నరు. దీంతో పాటు పదో తరగతి ప్రశ్న పత్రాలు రెండు రోజులుగా పరీక్ష హాల్ నుంచి బయటకు రావటం పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉన్నదో బట్టబయలు చేస్తున్నది. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చి, ధైర్యం నింపాల్సింది పోయి.. లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుని వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది. రాజకీయంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించాలనే ఆరాటంతో అసలు సమస్యను పార్టీలు పక్కదారి పట్టిస్తున్నయి.

- ఎం. యాదగిరాచార్యులు, - ప్రొ.ఎ.వినాయక రెడ్డి, హనుమకొండ