తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్ల నుంచీ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సర్కారు బడులు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యా బోధన అగమ్యగోచరంగా ఉండగా, ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజుల పేరుతో దోపిడీకి తెగబడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వాటిని నియంత్రించకపోగా, పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది. స్వరాష్ట్రం వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతదని, ఉద్యోగాలు వస్తాయని భావించిన విద్యార్థులు బుల్లెట్ గాయాలకు, లాఠీ దెబ్బలకు నిలబడి, కలబడి కోట్లాడారు. ఉద్యమంలో పన్నెండు వందల మంది వరకు ఆత్మబలిదానం చేసుకున్నారు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం గాలి కొదిలేయడం అత్యంత బాధాకరమైన పరిణామం. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రగల్బాలు పలికిన నాయకులు నేడు స్వరాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు సహకరిస్తూ ఫీజుల మోతకు కారణమయ్యారు.
లక్షల్లో ఫీజులా?
ప్రభుత్వ నిర్లక్యం, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) అసమర్థత కారణంగా అంతా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అనుకున్నట్టే సాగుతున్నది. ఒక దశలో వారు కోర్టును సైతం నమ్మించి ఇష్టానుసారంగా లక్షల మేర ఫీజులను పెంచుకున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన నియంత్రణ కమిటీ తని పని తాను చేయకపోగా, ఫీజుల పెంపునకు అనుమతించడం అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. రాష్ట్రంలో మొత్తం159 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.లక్షా 60 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాలేజీల్లో లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీలు 40కి పైగా ఉన్నాయంటే ఫీజుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క రాష్ట్రం ఏపీ సహా దేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫీజులు లేవు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పెంచిన ఫీజులు తగ్గించాలి
నామినల్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ యూనివర్సిటీలో సైతం ఫీజులు పెంచడం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే. ప్రభుత్వ వర్సిటీల్లో కూడా ఫీజులు గతంతో పోలిస్తే మూడింతలు పెరిగాయి. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులైతే లక్ష వరకు పెంచారు. ఫీజుల పెంపు, విద్యా వ్యవస్థ దుస్థితిపై విద్యార్థి సంఘాలు నిత్యం ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా స్పందించి ఫీజులను తగ్గించాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసే చర్యలు తీసుకోవాలి. లేదంటే వలస పాలకుల తూటాలకు ఎదురొడ్డి ఉద్యమించిన తెలంగాణ విద్యార్థులకు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం పెద్ద విషయం కాదు.
పేదోడికి దూరమవుతున్న విద్య
రాష్ట్రంలో నిధుల లేక, లెక్కకు మించి ఖాళీలతో, పర్యవేక్షణ లేక ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం కాగా పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్తున్నారు. కరోనా సమయంలో బడ్జెట్స్కూళ్లు, కాలేజీలన్నీ సంక్షోభంలో కూరుకుపోయి మూతపడగా, కార్పొరేట్‌శక్తులు పడగ విప్పాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎల్కేజీ విద్య నుంచి ఇంజనీరింగ్, ప్రైవేటు అటానమస్ యూనివర్సిటీల వరకు ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్తర్వాత ఇంజనీరింగ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది పెద్దలకే ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంకేముంది ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచేశారు.
- పి. శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్