పాలించేటోళ్ల ఇష్టమే రాజ్యమా? ప్రశ్నించే తావుండాలె!

ప్రజాస్వామ్యానికి జనాభిప్రాయం ఊపిరైతే, దానికి ఎన్నికలు ప్రామాణికం! ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తోంది. లొసుగుల్ని ఆసరా చేసుకొని ఈ ప్రక్రియ మొత్తాన్ని చెరపట్టిన శక్తులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. దీనికి విరుగుడు, ఎన్నికల ప్రక్రియలో సరైన సంస్కరణలు. తర్వాతి విడత సంస్కరణలకు ఇదే సముచిత సమయం.

పటిష్టపరచాల్సిన ఎన్నికల వ్యవస్థ, లోపాల వల్ల ప్రజాస్వామ్యాన్నే బలహీనపరుస్తోంది. అయిదేళ్ల కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు మధ్యలోనే రాజీనామా చేసి.. ఉప ఎన్నికలు వస్తే బాగుండునని ఆయా నియోజకవర్గ ప్రజలు భావించే పరిస్థితి! అసలు ఎన్నికల కన్నా ఉప ఎన్నికలను పాలకులు అంత ‘ఆకర్షణీయం’ చేశారు. లోపం ఎక్కడుంది? ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టొద్దన్న మౌలిక సూత్రమే మంటగలుస్తోంది. యథేచ్ఛగా డబ్బు పంపిణీ, ఏరులై పారే మద్యం, ఎక్కడికక్కడ ఓటర్ల సంఖ్యను బట్టి ఇంటింటికీ, గుంపు గుంపుకీ, వాడవాడకీ ఎన్నెన్నో తాయిలాలు, వరాలు, హామీలు, ఆర్థిక ప్రయోజనం కలిగించే ప్రభుత్వ పథకాలు.. లెక్కే లేదు. ఇవి కాకుండా, ప్రకటన వెలువడ్డ నుంచి ప్రక్రియ ముగిసే దాకా ఏ రోజుకారోజు మందులు, విందులు, వినోదాలు మరెన్నో జల్సాలు! మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుంటే అక్కడి పౌరులకు, రాష్ట్రంలో కొన్ని నెలల కింద ఉప ఎన్నిక జరిగిన ‘హుజూరాబాద్’ గుర్తుకు రావడం కాకతాళీయమేం కాదు! కాదనలేని, కార్యకారణ సంబంధం. వారు ఉప ఎన్నిక కోరుకోవడంలో తప్పూ కనిపించదు! పాలకపక్షీయుల అధికార బలాన్నీ, ఆర్థిక సామర్థ్యాన్నీ తట్టుకోలేక పోయినా.. ఎంతో కొంత ప్రతిపక్ష పార్టీలూ వ్యయం చేస్తున్న స్థితి కళ్లకు కడుతోంది. ఓటరుకు పండుగే పండుగ! 

ఆధార్ అనుసంధానం ఉన్నట్టా, లేనట్టా?

ఓటర్ గుర్తింపు కార్డును వారి ఆధార్ నంబరుతో అనుసంధానం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం గత డిసెంబరులో ఎన్నికల చట్ట సవరణ చేసింది. ఈ ఆగస్టు ఒకటి నుంచి, దీని కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు కింది వ్యవస్థలకు తగు ఆదేశాలిచ్చింది. ఓటర్లే స్వయంగా ఆన్​లైన్​లో అనుసంధానం చేసుకునే ప్రత్యేక దరఖాస్తు నమూనా (ఫార్మ్–6), ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ఒకరే వేర్వేరు చోట్ల ఓటరుగా పేరు నమోదు చేసుకొని, ఏకకాలంలో బహుళ ఓట్లు కలిగి ఉండటాన్ని నివారించడానికి ఇది చేపట్టారు. కానీ, దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు పిటిషన్ వేసినపుడు, సుప్రీం కోర్టు అడిగితే..‘ నిర్బంధమేం కాదు, ఆధార్ నంబరు లింక్ చేసుకోవడం/చేసుకోకపోవడం ఓటరు అభీష్టం(ఐశ్చికం)’ అని కేంద్ర ప్రభుత్వం బదులిచ్చింది. దాంతో, ఓటరు కార్డు–ఆధార్ నంబరు అనుసంధానం తప్పనిసరి కాకుండా పోయింది. అయితే, ఒక ఓటరు తాను ఎందుకు అనుసంధానం చేసుకోవడం లేదో సహేతుకమైన కారణం చెప్పాలని నిబంధన. అనుసంధానం వ్యతిరేకించేవాళ్లు కారణమేంటో బహిరంగంగానే చెబుతున్నారు. ‘అనుసంధానం చేస్తే ఎలా? మా వివరాలు బయటకు పొక్కుతాయి, డేటా దురుపయోగమౌతుంది. ఇక గోప్యత ఉండదు, మా గోప్యత హక్కుకు రక్షణా ఉండదు’ అనేది వారి వాదన. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని 2018లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘ఎక్కడా పొక్కనీయం, మేం భద్రతా చర్యలు తీసుకుంటాం’ అని అధికారులు, ముఖ్యంగా ఎన్నికల సంఘం చెబుతున్నా పౌరులు నమ్మడం లేదు. దానికి బలమైన కారణాలున్నాయి. గతంలో వేర్వేరు అవసరాలకు ఆధార్ నకలు పత్రాన్ని పౌరులు సమర్పించినపుడు, ఆయా కార్యాలయాల నుంచి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు సదరు వివరాలు వెళ్లిపోయాయి. వాణిజ్య, వ్యాపార కంపెనీలకు గంపగుత్తగా ఆధార్ సమాచారం అమ్ముకున్న సందర్భాలున్నాయి. పత్రాలు కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద దొరికినపుడు ఇది బట్టబయలైంది.

కొత్త ఓటరు సరే! కొత్త నమ్మకమేది?

కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకునే వారి సౌలభ్యం కోసం, ఏడాదిలో నాలుగు ప్రవేశ తేదీలతో వెసులుబాటిచ్చారు. ఏడాది పొడవునా, ఎప్పుడు18 ఏండ్ల వయసొచ్చినవారైనా జనవరి1 దాకా, విధిగా నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఆ మేరకు చట్ట సవరణ చేశారు. జనవరి1తోపాటు ఏప్రిల్1, జులై1, అక్టోబరు1న కూడా నమోదుకు అవకాశం ఉంటుంది. అందుకే,17 ఏండ్లు నిండగానే దరఖాస్తు చేసుకోవచ్చని, పుట్టిన తేదీ–యోగ్యతను బట్టి తగు సమయంలో జాబితాలోకి పేరు ఎక్కుతుందని ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. విస్తృత ప్రచార కార్యక్రమాలూ చేపట్టింది. కొత్త ఓటర్ల ఉత్సాహాన్ని ఇనుమడింపజేసేలా... ఎన్నికల ప్రక్రియి పట్ల, ఎన్నికైన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలపైనా వారికి విశ్వాసం కలిగించాలి. ఎన్నికల్లో పరిమితికి మించిన అసాధారణ ఖర్చుల్ని నియంత్రించే వ్యవస్థ ఆచరణలో లేదు. ఎన్నికల సంఘం విధించే వ్యయ పరిమితి, నిజానికి ఎన్నికల్లో వారు పెట్టే ఖర్చు, వాటి మధ్య వ్యత్యాసం చూసి యువకులు నవ్వుకుంటున్నారు, ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, మన దేశంలో పరిమితికి మించి వ్యయం చేసినందుకో, ఎన్నికల సంఘానికి తప్పుడు లెక్కలు చూపినందుకో ప్రజాప్రతినిధులు అనర్హులైన సందర్భాలే ఉండవు. ఈ లోపాలను సరిదిద్దుకునే సంస్కరణలు రావటం లేదు. మూకుమ్మడిగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రకరకాల వరాలు, రాయితీలు, ఉచితాలు ప్రకటించి అసంబద్ధంగా ఖజానాను గుల్ల చేసినా నియంత్రించే, తప్పుబట్టే వ్యవస్థల్లేవు. బడ్జెట్​కు అతీతమైన ఉచితాలు ప్రకటించకుండా నిరోధించలేరు. సదరు అభ్యర్థుల్ని అనర్హులు చేసేట్టు, ఆయా పార్టీల గుర్తింపు రద్దు పరిచే విధానాలు లేవా? అని సుప్రీంకోర్టు అడిగినపుడు, లేవనే ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి! ఒక పార్టీ అభ్యర్థిని ప్రజలు తిరస్కరించి, ఇంకో పార్టీ అభ్యర్థిని ఎన్నుకుంటే, వారి తీర్పును వంచించేలా సదరు విజేత, ప్రజలు తిరస్కరించిన పార్టీలోకి మారుతున్న తీరు, అధికారంలో భాగమౌతున్న పద్ధతి జుగుప్సాకరంగా ఉంటోంది. పార్టీ మార్పిళ్లకు వ్యతిరేకంగా తెచ్చిన చట్ట స్ఫూర్తికి అడుగడుగునా భంగం కలుగుతోంది. చట్ట ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించమని ఆయా పార్టీ నాయకత్వం వినతి చేసుకున్నా చట్టసభాధిపతులు చెవిని పెట్టడం లేదు.

సంస్కరణలైంది కొన్ని సిఫారసులే!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితుల్ని బట్టి మన ఎన్నికల ప్రక్రియలో పలు మార్పులు వచ్చాయి. 2010కి ముందు, తర్వాత తొలి–మలి విడత సంస్కరణలు కొంత మేర ప్రభావం చూపాయి. సంస్కరణలు మాత్రమే సరిపోవు, వాటిని అమలు చేయడంలోనే మతలబు ఉంటుందని ఎన్నికల కమిషనర్​గా టి.ఎన్.శేషన్ చేసి చూపించారు. తర్వాత అంతటి ప్రభావవంతమైన అధికారి రాలేదు. దేశంలో ఎన్నికల సంస్కరణలకు లా కమిషన్ ఎప్పటికప్పుడు విలువైన సిఫారసులు చేసింది. సంఘానికి సొంత దర్యాప్తు సంస్థ ఉండాలని, తానే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసుకోవాలని దినేష్ గోస్వామి కమిటీ ప్రతిపాదించింది. రాజకీయ పార్టీల్లో చీలికల్ని, విలీనాల్ని నిషేధించాలని జస్టిస్ జీవన్​రెడ్డి కమిటీ సిఫారసు చేసింది. స్వేచ్ఛ–స్వతంత్ర ఎన్నికల  పర్యవేక్షణకు గానూ వీలయినన్ని నియోజకవర్గాల్లో ‘ఓటర్ కౌన్సిళ్లు’ ఉండాలని తార్కుండే కమిటీ సిఫారసు చేసింది. ఇలా చాలా కమిటీలు, కమిషన్లు చేసిన సిఫారసుల్ని లోతుగా అధ్యయనం చేసి, తదుపరి విడత ఎన్నికల సంస్కరణలు తీసుకువస్తేనే మన ప్రజాస్వామ్యానికి మనుగడ!

ఐదేండ్లు భరించాల్సిందేనా?

ఒకసారి ఎన్నికైన వారు ఎన్ని ఆటలాడినా, ఎంత నియంతృత్వంగా ఉన్నా, అవినీతిలో కూరుకుపోయినా.. ఎన్నుకున్న పౌరులు ఏమీ చేయలేని పరిస్థితి! ఆయా పార్టీల, ప్రభుత్వాల పెద్దలు నిర్ణయిస్తే తప్ప ఎన్నికల సంఘం ఏమీ చేయలేకుంది. మొన్న మహారాష్ట్రలో, నిన్న కర్నాటకలో, ఇయ్యాల పశ్చిమ బెంగాల్​లో జరిగిందేమిటి? ఇక ప్రజలిచ్చిన తీర్పును వంచిస్తూ, విజేతలు ఇష్టానుసారం పార్టీలు మారినా నిలువరించలేని నిస్సహాయత! చట్టప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించే.. నిర్ణయాధికారం స్పీకర్ల చేతిలో, సదరు స్పీకర్లు పాలకపక్షాల కనుసన్నల్లో ఉండటమే కారణం. ఈ దుస్థితిని సమూలంగా తప్పించడానికి.. శస్త్రచికిత్స అవసరమైన చోట, తాత్కాలిక ఉపశమనానికి లేపనం రాసినట్టో, కాయకల్ప చికిత్స చేసినట్టో మన దిద్దుబాటు చర్యలుంటున్నాయి. ఆకాశం ఎత్తులో సంస్కరణలు అవసరమైన వేళ, చిన్నా చితకా నేలబారున సాగుతున్న ఎన్నికల సంస్కరణలు పెద్దగా ఉపయోగపడటం లేదు. రేపు ఆగస్టు1 నుంచి అమల్లోకి రానున్న తాజా సంస్కరణలదీ ఇదే పరిస్థితి!

- దిలీప్ రెడ్డి, dileepreddy.r@v6velugu.com