దేశంలో రిజర్వేషన్ల అమలు గతి మారబోతోందా? తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఉన్న కోటా రద్దు కాబోతున్నదా? అసలు కొన్ని కులాల రిజర్వేషన్లే లేకుండా పోయే రోజు రాబోతున్నదా? జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయా? ఈ ప్రశ్నలకు అవును అని గట్టిగా చెప్పలేకపోయినా, ఆ దిశగా మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరాఠా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ‘అసలు ఇంకెన్ని తరాలు ఈ రిజర్వేషన్లు? 50 శాతం దాటి రిజర్వేషన్లు అమలు చేస్తే అసమానతలు పెరిగిపోవా? 70 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి చెందిన కులాలే లేవా? ఉంటే వాటికి కోటా రద్దు చేయొద్దా? దీనిపై కచ్చితంగా సమీక్ష జరగాలి’ అని కామెంట్స్ చేసింది. ఈ కేసులో వచ్చే తీర్పుతో అన్ని రాష్ట్రాలపై ప్రభావం పడే చాన్స్ ఉండడంతో ఇంప్లీడ్ కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సహా అన్ని రాష్ట్రాలు తమ కౌంటర్‌లో సబ్బండ వర్ణాల రిజర్వేషన్లకు అనుకూలంగా వాదన వినిపించి, ఆ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
మరాఠా కులాన్ని ఓబీసీల్లో చేరుస్తూ విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. దీని వల్ల ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 60 శాతం దాటాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ కొన్ని బీసీ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 19న సుప్రీం చేసిన కొన్ని కామెంట్స్ రిజర్వేషన్లలో ఎటువంటి మార్పులు వస్తాయో అన్న ఆందోళనకు కారణమవుతున్నాయి.
కుల వివక్ష ఉన్నంత కాలం..
70 ఏండ్లుగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ ఒక్క బీసీ కులం కూడా అభివృద్ధి చెందలేదా అని ప్రశ్నించింది. అభివృద్ధి చెంది ఉంటే ఆ కులాలను కోటా నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తూ పోతే సమాజంలో అసమానతలు రావన్న గ్యారెంటీ ఏంటి అని అడిగింది. కచ్చితంగా సుప్రీం న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలు సమర్ధనీయమే. కానీ ప్రభుత్వాలు, పాలకుల్లో ఇన్నేండ్లుగా రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేకపోవడం, గ్రామ స్థాయి వరకు కుల వివక్ష లేకుండా అంతం చేయడంలో విఫలం అవ్వడం వల్లే నేటికీ రిజర్వేషన్ల అవసరం అలానే ఉంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కుల బహిష్కరణలు లాంటి ఘటనలు జరుగుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం రిజర్వేషన్లు వాడుకుంటూ సరిగ్గా వాటిని అమలు చేయడం లేదు. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఖాళీ అయితే 6 నెలల్లో భర్తీ చేస్తున్న పాలకులు అదే మాదిరిగా బ్యాక్‌లాగ్ పోస్టుల విషయంలోనూ చేస్తే రిజర్వేషన్ల అమలు సక్రమంగా జరిగేది. నేటికీ ఉన్నత స్థాయి ఉద్యోగాలు, రాజకీయ పదవులు, ఉన్నత న్యాయస్థానాల జడ్జి పదవుల్లోనూ వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది.
మహారాష్ట్రలో 60 శాతం దాటిన రిజర్వేషన్లు
మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల ఆందోళనలకు తలొగ్గి 2014లో వారిని బీసీ కోటాలో చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ చట్ట విరుద్ధమంటూ బాంబే హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేసింది. దీంతో మళ్లీ 2016లో మరాఠాలు నిరసనలకు దిగారు. దీంతో ఆ రాష్ట్ర సర్కారు 2017లో గైక్వాడ్ అధ్యక్షతన బీసీ కమిషన్ నియమించింది. రాష్ట్రంలో 30% ఉన్న మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 2019లో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16% రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర సర్కారు చట్టం తెచ్చింది. దీనిని కొట్టివేయాలని బీసీ కుల సంఘాలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే 16 శాతం రిజర్వేషన్లు కాకుండా, విద్యలో 12% ఉద్యోగాల్లో13 శాతానికి కుదించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు విద్యలో 62.5%, ఉద్యోగాల్లో 65 శాతానికి చేరాయి.
రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలంటున్న మహారాష్ట్ర
మరాఠా రిజర్వేషన్లు బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం విచారణ సాగుతోంది. రిజర్వేషన్లను రాష్ట్రాల పరిధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర సుప్రీంను కోరుతోంది. 1931 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ఇందిరా సహానీ కేసులో 1992లో సుప్రీం తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు వచ్చి 30 ఏండ్లు గడిచిపోయిందని, నేడు దేశ జనాభా 130 కోట్లు దాటిందని, వెనుకబడి ఉన్న బీసీ సంఖ్య కూడా పెరిగిందని ఆ రాష్ట్రం వాదిస్తోంది. నేటికీ దేశంలో ఆకలి చావులు ఉన్నాయని, జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లను రాష్ట్రాలే ఇచ్చుకునే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టును కోరుతోంది. మరోవైపు కేంద్రం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అనేక రాష్ట్రాల్లో 50 శాతం పరిమితిని దాటిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే అభివృద్ధి చెందిన వారికి రిజర్వేషన్లు తొలగించాల్సిన అవసరాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాదనల సందర్భంగా సుప్రీం ధర్మాసనం చెప్పింది. దీనిపై రోజువారీ విచారణ ఉంటుందని, అన్ని రాష్ట్రాలు కూడా తమ సూచనలు, అభ్యంతరాలను తెలపాలని ఆదేశించింది.
అన్ని రాష్ట్రాలపై ప్రభావం ఉంటది
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ నేటికీ బీసీ కులాలు వెనుకబడే ఉన్నాయి. రిజర్వేషన్లు సక్రమంగా అమలై ఉంటే సుప్రీం అభిప్రాయపడినట్లు కొన్ని కులాలైనా బాగా అభివృద్ధి చెంది ఉండాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల రిజర్వేషన్ల ఫలాలు సక్రమంగా అందలేదు. పైగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటులో కూడా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల రూపురేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ వేసి తమ వాదనలను గట్టిగా వినిపించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15% నుంచి 16 శాతానికి, ఎస్టీలకు ఆరు నుంచి 9 శాతానికి, బీసీలకు 29 నుంచి 52 శాతానికి కోటా పెంచడానికి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఈ అంశాలపై సుప్రీం విచారణ
-సుప్రీం కోర్టు మరాఠా రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా ఈ కింది అంశాలపై సమీక్షించి, తీర్పు ఇవ్వబోతోంది.
- 1992లో ఇందిరా సహానీ కేసులో తీర్పు తర్వాత పలు రాజ్యాంగ సవరణలు జరిగాయి. సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్లపై విస్తృత ధర్మాసనం సమీక్ష అవసరమా? లేదా?
-మరాఠాలకు రిజర్వేషన్ కల్పించిన చట్టం 1992 నాటి తీర్పుకు విరుద్ధమా? కాదా?
-గైక్వాడ్ కమిషన్ లెక్కలు ఆ తీర్పు ప్రకారం సమర్థనీయమేనా?
-కేంద్రం 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తగ్గిస్తుందా?
-వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4 ) అధికారమిస్తున్నాయి. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 342ఎ, 366(26సీ)లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తున్నాయా? లేదా?
- ఆర్టికల్ 342ఏ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా? లేదా?
....కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ జేసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం