సార్లు లేని సదువులతో రాష్ట్ర ప్రగతి సాధ్యమా?

రాష్ట్రంలో చాలా వర్సిటీలు, ఇన్‌‌స్టిట్యూట్‌‌లలో సరైన సౌలత్​లు, సరిపోను సార్లు లేరు. రక్షకులు విధ్వంసకులుగా మారారు. దీంతో అవి ఏటా ఉపాధిలేని డిగ్రీ హోల్డింగ్ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారాయి. దశా దిశా చూపే సార్లు లేనిదే పునర్నిర్మాణం ఎలా? ఒక రాష్ట్రాన్ని పునరుద్ధరించాలనుకునే ఎవరైనా, విద్యా రంగాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉన్నత విద్యా వ్యవస్థపై కొనసాగుతున్న నిర్లక్ష్య వైఖరితో, ప్రభుత్వం తెలియకుండానే చారిత్రక తప్పు చేస్తున్నది. ఏ ఆధునిక సమాజంలోనైనా విద్య, అభివృద్ధి అత్యంత కీలకమైనవి. నాణ్యమైన విద్య యువకుల జ్ఞానాన్ని పెంపొందించి, అవసరమైన వివిధ నైపుణ్యాలను అందిస్తుంది. తద్వారా యువకులు బాధ్యతలను, సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మేధో, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక, రాజకీయ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కూడా అది కీలక పాత్ర పోషిస్తుంది. 

రాష్ట్ర విద్యాలయాల్లో టీచర్ల కొరత

విద్యారంగంలో టీచర్లు, అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపు దశాబ్ద కాలంగా రాష్ట్ర యువత భవిష్యత్తు  అంధకారంలోనే ఉన్నది. ఉద్యమ సమయంలో కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగ వ్యవస్థను తీసేస్తామని, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరిపి వ్యవస్థను పటిష్ట పరచడానికి కృషి చేస్తామని ఉద్యమ నేత ఎన్నోసార్లు చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా అన్ని వ్యవస్థల్లో ఔట్​సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు కొనసాగిస్తూ దాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 70 శాతానికి పైగా లెక్చరర్ల ఖాళీలు ఉన్నాయి. బడులు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఐటి, పరిశ్రమల్లో మనవాళ్లు ఎంత మంది?

ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, కోలుకోలేని దెబ్బతీస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులు  ప్రపంచ సంస్థలతో ఎలా పోటీ పడగలరు?  స్వరాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులతో ఏర్పడిన మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రైవేట్ తో ధీటుగా పోటీ పడడానికి అవసరమైన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో తెలంగాణ యువతీ యువకులు భారీ సంఖ్యలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధి అవకాశాలు లేక యువకుల జీవితాలు చితికిపోతున్నాయి. గాడితప్పిన ఉన్నత విద్యా  వ్యవస్థ అందుకు హేతువుగా మారింది. రాష్ట్ర ప్రజలకు అవసరమైన నాణ్యమైన విద్యను అందించాలంటే, అధ్యాపకుల భర్తీ తక్షణమే చేపట్టాలి. తద్వారా కొంత మేరకైనా నష్టాన్ని నివారించడానికి వీలు ఉంటుంది. గుప్పెడు మంది విద్యార్థులు సాధించిన రాష్ట్ర  జాతీయ ర్యాంకులు తెలంగాణలో మెజార్టీ విద్యార్థులు సాధించిన ఘన విజయాలుగా చూపించే ప్రయత్నం తప్పు. వేలమంది విద్యార్థులు అర కొర  వసతులతో విద్యను పూర్తి చేసి, మార్కెట్ కనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడి పోతున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు ఎంపిక కాలేకపోతున్నారు. ఉన్నత విద్యను బలోపేతం చేస్తే కొత్త రాష్ట్రంలో వస్తున్న కొత్త పరిశ్రమలతోపాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. 

టీచర్​ఎమ్మెల్సీలు ఎక్కడ? 

పట్టభద్రుల ఎమ్మెల్సీలైనా, టీచర్ ఎమ్మెల్సీలైనా పెద్ద పెద్ద వ్యాపార, కార్పొరేట్​ విద్యా సంస్థల అధినేతలకు అవకాశం లభిస్తున్నది. ప్రభుత్వ విద్యావ్యవస్థ గురించి పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు పట్టభద్రుల, టీచర్స్​ఎమ్మెల్సీల విషయంలో  రాజకీయాలకు అతీతంగా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. పట్టభద్రుల, టీచర్​ఎమ్మెల్సీలు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ గెలుస్తుండటం రాష్ట్ర ప్రగతికి మంచిది కాదు. కొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తమ విద్యా వ్యాపారాలను నడుపుకుంటున్నారు. అలాంటి వారు విద్యారంగంలో ఆశించిన మార్పులు తేలేరు. రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో భారీగా ఉన్న ప్రొఫెసర్​పోస్టుల ఖాళీల వల్ల న్యాక్ లాంటి సంస్థలు ఇచ్చే గ్రేడింగ్ లో వెనకబడాల్సి వస్తున్నది. న్యాక్ లో మెరుగైన ర్యాంకు రాకపోవడం వల్ల యూజీసీ నుంచి వచ్చే నిధులు, ఇతర ఫండ్స్​ఆగిపోయి యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.  విద్యా వ్యవస్థను పటిష్టపరచడంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమైనది. కాబట్టి వెంటనే సార్లను రిక్రూట్​ చేయాలి.

పడకేసిన పరిశోధనలు

విద్యాసంస్థల్లో పూర్తిస్థాయి అధ్యాపకులు లేక పరిశోధనలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న కొంతమంది అధ్యాపకులు సైతం విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణ కోసం  అత్యధిక సమయం కేటాయిస్తున్నారు. దాంతో పరిశోధక విద్యార్థులకు సరైన సమయాన్ని అందించలేకపోతున్నారు. దీంతో యువ పరిశోధకులను తయారుచేయడంలోనూ తెలంగాణ చాలా వెనకబడిపోతున్నది. చాలా విద్యాసంస్థల్లో  సౌకర్యాలు లేక కూడా పరిశోధనలు జరగట్లేదు. అది రాబోయే రోజుల్లో అనేక సమస్యలకు మూల కారణం కానుంది. పరిశోధనలు మరింత వికాసవంతం చేయాలంటే అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. నూతన జాతీయ విద్యా విధానంతో సమూల మార్పులు చేస్తున్న ఈ తరుణంలో అధ్యాపకుల కొరత రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. రాష్ట్ర ప్రజలను యువకులకు మార్గదర్శనం చేయటంలో టీచర్ల పాత్ర విస్మరించలేనిది. సమాజంలోని అన్ని రంగాలకు సంబంధించిన నిష్ణాతులను తయారు చేయగల సమర్థత ఉన్నది టీచర్లకు మాత్రమే. 
- చిట్టెడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్​సీయూ