సమాచార హక్కు బలహీనపడుతోందా?

మంచి ఉద్దేశంతో కొన్ని సంస్థలను శాసన ప్రకారం ఏర్పాటు చేస్తారు. కానీ, కాలక్రమంలో ఆ సంస్థ విధులు నిర్వర్తించడానికి వ్యక్తులను  నియమించరు. ఈ పరిస్థితి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఫలితంగా ఆ శాసన ఉద్దేశమే దెబ్బతింటోంది. అలాంటి సంస్థే సమాచార హక్కు కమిషన్.  కేంద్ర సంస్థలో ఖాళీలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో అదే పరిస్థితి. 

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు,  దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి.  వీరిలో ఎక్కువ సంఖ్యలో  సమాచార హక్కు కార్యకర్తలు కోర్టు వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. గతవారం ఈ విషయం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ‘ఒక మంచి సంస్థను ఏర్పాటుచేసి ఆ శాసన విధులను నిర్వర్తించడానికి వ్యక్తులను నియమించకపోతే ఆ సంస్థవల్ల ఉపయోగం ఏమిటి?.. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని బెంచి అదనపు సొలిసిటర్​ జనరల్​ బ్రిజేందర్​ చహర్​ను ప్రశ్నించింది. ఈ బెంచిలో మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోటీశ్వర్​ సింగ్​ కూడా ఉన్నారు. 

బ్యూరోక్రసీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులను మాత్రమే ఇన్ఫర్​మేషన్​ కమిషనర్లుగా నియమించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఎందుకు ఉంటుందని కూడా బెంచ్.. అదనపు సొలిసిటర్​ జనరల్​ను ప్రశ్నించింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ప్రభుత్వం నియమించడం లేదు. ఎక్కువగా బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వ్యక్తులనే నియమిస్తున్నారు. ఈ విషయాన్ని మేం జ్యుడీషియల్​ నోటీసు కూడా తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్​ తరఫున న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ సుప్రీంకోర్టు ముందు వాదిస్తూ.. కోర్టు జోక్యం తరువాత తిరోగమనం మాత్రమే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. సమాచార హక్కుని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సమాచారాన్ని అందించడం ఎవరికీ ఇష్టంలేదు. అందుకని సమాచార కమిషనర్లని నియమించకపోవడం ద్వారా ఆ సంస్థని నిరర్ధకం చేయడం వాళ్ల ఉద్దేశం అని అన్నారు.

కమిషనర్ల నియామకంలో జాప్యం

అంజలి భరద్వాజ్, ఇతరులు వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2019లో పలు ఉత్తర్వులను జారీ చేసింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. జనవరి మొదటివారం వరకు కేంద్ర సమాచార కమిషన్​లో ముగ్గురు కమిషనర్లు మాత్రమే పనిచేస్తున్నారు. అందులో ఒకరు ప్రధాన సమాచార కమిషనర్. ఆ కమిషన్​లో 10మంది కమిషనర్లు ఉండాలి. మిగతా కమిషనర్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 2024లో కోరారు. కానీ, ఇంతవరకు నియామకం జరగలేదు. జార్ఖండ్​ రాష్ట్రంలో సెలక్షన్​ ప్రక్రియ జూన్​ 2024లో మొదలైంది.  ఆ రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఎంపిక పూర్తికాలేదు.  మిగతా రాష్ట్రాల్లో ఎంపిక ప్రక్రియ మొదలైంది. కానీ, పూర్తి కాలేదు..ఈ చట్ట ఉద్దేశాన్ని, స్ఫూర్తిని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోగొడుతున్నాయని సుప్రీంకోర్టు 2019వ సంవత్సరంలో అభిప్రాయపడింది. ఖాళీలు ఏర్పడటానికి రెండు నెలలు ముందే ఆ ఖాళీలను నింపే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఎలాంటి జాప్యం లేకుండా ఒకటి, రెండు నెలల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఇది గతంలోని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. తీర్పుదారి తీర్పుది. ప్రభుత్వాల దారి ప్రభుత్వాలది. 

సమాచార కమిషనర్లుగా బ్యూరోక్రాట్లు 

రాష్ట్రాలవారీగా ఇచ్చిన అఫిడవిట్​లను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి..సెలక్షన్​ కమిటీ పేరును మాత్రమే సూచించాలి. వారు ఏ నివేదిక ఇస్తారని ఉత్తరాఖండ్​ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన టైమ్​లైన్​  ప్రకారం కమిషనర్ల ఎంపిక జరగాలని సుప్రీంకోర్టు గతవారం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. అన్ని రంగాలకు చెందిన వ్యక్తులను సమాచార కమిషనర్లుగా ఏర్పాటు చేయాలన్నది సుప్రీంకోర్టు 2019లో చెప్పిన తీర్పు ఉద్దేశం.  బ్యూరోక్రాట్లను ఎక్కువగా నియమిస్తున్నారని సుప్రీంకోర్టు 2019లో అభిప్రాయపడింది. 

ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మళ్లీ వెలిబుచ్చింది. అన్ని రంగాలకు చెందిన వ్యక్తులను నియమిస్తుందో లేదో చెప్పలేం.  కనీసం కమిషన్​ను నిర్వీర్వం చేయకుండా వాళ్లని నియమిస్తే చాలన్న పరిస్థితిలోకి సమాచార హక్కు కార్యకర్తలు నెట్టివేయబడ్డారు. ఏ సమాచారమైనా పొందే పరిస్థితి ఉండాలంటే సంస్థ పనిచేసేవిధంగా ఉండాలి. అలా ఉండాలంటే కమిషనర్ల నియామకం జరగాలి. కోర్టు ఉత్తర్వులు జారీచేస్తే నియామకాలు జరిగే పరిస్థితి దాటిపోయింది. ఇప్పుడు కోర్టు ధిక్కార దరఖాస్తులు కూడా సరిపోవడం లేదు. మరేం చేయాలో కోర్టులే ఆలోచించాలి. 

సమాచార హక్కు చట్టంతో సుపరిపాలన

సమాచార హక్కు చట్టంలోని ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు.. కమిషనర్ల నియామకం సత్వరం జరపాలని గతంలో ఆదేశించింది.  ఈ చట్టం అమలు సక్రమంగా జరిగితే మంచి పాలన ప్రజలకు అందుతుంది. సుపరిపాలన అందించడం రాజ్యాంగ విజన్​లలో ఒకటి. అందుకు ఉపయోగపడే శాసనం ‘సమాచారహక్కు చట్టం’ ఇవన్నీ పేర్కొంటూ సుప్రీంకోర్టు 2019వ సంవత్సరంలో తన తీర్పుని ప్రకటించింది. సమాచార చట్టంలో చాలా మార్పులని తీసుకువచ్చారు. దానివల్ల హక్కులకి విఘాతం ఏర్పడింది. ఇప్పుడు వాటి గురించి కాకుండా ఈ సంస్థలను బతికించడం అనే స్థితికి సమాచార హక్కు కార్యకర్తలు మారిపోయారు. ఈ మార్పులు గురించి సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు కూడా చేయలేదు. గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులనే సుప్రీంకోర్టు బెంచ్​ పునరుద్ఘాటించింది. గతంలో కేంద్ర ఇన్ఫర్​మేషన్​ కమిషనర్​గా పనిచేసిన శైలేష్​గాంధీ మాటల ప్రకారం..సమాచార హక్కు అనేది ఇప్పుడు మారిపోయింది. ఇవ్వకపోవడం అనేది హక్కుగా మారిపోయింది. 

డా. మంగారి రాజేందర్
పూర్వ డైరెక్టర్,
తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్​ అకాడమీ