పాక్ లో అంతర్యుద్ధం తప్పదా? : సీనియర్ జర్నలిస్ట్ మల్లంపల్లి ధూర్జటి

పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ రాష్ట్రాలు మార్కెట్​లో గోధుమలు దొరక్క అలమటిస్తున్నాయి. పక్క రాష్ట్రాలు కూడా వాటికి సరఫరాలను నిలిపివేయడంతో జనం అరకొర గింజల కోసం కుమ్ములాటలకు దిగే పరిస్థితి వచ్చింది. సబ్సిడీ ధరలకు అందించే గోధుమల కొనుగోలు క్యూలు కొల్లేటి చాంతాడులను తలపిస్తున్నాయి. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆహార సంక్షోభం రానున్న వారాల్లో తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార శాఖ, పిండిమరల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వాల అసమర్థత ప్రజలను ఈ స్థితికి తెచ్చాయి. 

గత ఏడాది సంభవించిన వరదలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. పంట పొలాలు ధ్వంసమయ్యాయి. పాక్ లోని మౌలిక సదుపాయాలు, ఆహార సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరవై లక్షలకు పైగా గృహాలు నేలమట్టమయ్యాయి. కోట్లాది మంది నిర్వాసితులయ్యారు. ఉపాధి కోల్పోయారు. మొత్తం నష్టం మూడు వేల కోట్ల డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇది అత్యధిక ద్రవ్యోల్బణానికి దారి తీసింది. 

కరెంటు కొరత

అవసరాలు తీర్చేంత విద్యుదుత్పాదన లేకపోవడంతో పాక్ ప్రభుత్వం ఇటీవల జాతీయ ఇంధన సంరక్షణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దాని కింద మార్కెట్లను రాత్రి 8.30కి, కల్యాణ మండపాలను రాత్రి10 గంటలకు మూసివేయాలి. సంప్రదాయ లైట్ బల్బుల తయారీని ఫిబ్రవరి1 నుంచి, విద్యుత్తును ఎక్కువ వినియోగించుకునే పంఖాల తయారీని జులై నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సంక్షోభానికి మూలం అది రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ఇంధన మిశ్రమ రూపాంతరీకరణ విధానంలో ఉంది. విద్యుదుత్పాదనకు తోడ్పడే దేశీయ గ్యాస్ వనరులు తరిగిపోతూ వచ్చాయి. పాక్ విద్యుదుత్పాదనకు జల విద్యుచ్ఛక్తిపై కాకుండా దిగుమతి చేసుకునే ఫర్నేస్ ఆయిల్ పై ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించింది. దేశంపై అన్ని వైపుల నుంచి రుణాల ఒత్తిడి పెరిగిపోవడంతో ఈ ఫర్నేస్ ఆయిల్ లభ్యత తగ్గిపోయింది. మరోపక్క విద్యుత్తుకు డిమాండ్ 2006 నుంచి క్రమేపీ పెరుగుతూ వస్తోంది. విద్యుత్ కోతల వల్ల ఇటు సామాన్య ప్రజలు ఇబ్బందిపడటమే కాకుండా పరిశ్రమలు కూడా నష్టపోవడం మొదలైంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కోత 10 నుంచి18 గంటలపాటు కొనసాగుతోంది. విద్యుత్ లోటు సుమారుగా 7,468 మెగావాట్లకు చేరుకుంది.

తాలిబన్లతో తగవులు

అఫ్గాన్​ను పాలిస్తున్న తాలిబన్లకు పాక్ పాలకులకు పడటం లేదు. కొద్దికాలం సద్దుమణిగినట్లు ఉన్నా తెహ్రీక్- ఏ -తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) తిరిగి తీవ్రవాద చర్యలను, బలవంతపు వసూళ్లను, బందీలుగా పట్టుకోవడం వంటి చర్యలను మొదలుపెట్టేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్తాన్ లో తాలిబాన్ తీవ్రవాద వ్యతిరేక నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్​లోని టీటీపీ రహస్య స్థావరాలపై బాంబులు వేస్తామని పాకిస్తాన్ హోమ్ మంత్రి రానా సనోల్లా హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దానికి తాలిబాన్ “ఇది అఫ్గాన్​సామ్రాజ్యాలను (రష్యా, అమెరికా) సమాధి చేసిన దేశం.  (సిరియాలో కుర్దులపై టర్కీ బాంబులు వేయడాన్ని దృష్టిలో పెట్టుకుని) అఫ్గాన్ సిరియా కాదు. పాకిస్తాన్ టర్కీ అంతకంటే కాదు. మాపై సైనికపరమైన దాడి ఆలోచనే రానీయకండి. ఇండియాతో కుదుర్చుకున్న లాంటి ఒప్పందం తిరిగి కుదుర్చుకుంటే మీరే ఇరకాటంలో పడతారు” అని జవాబిచ్చింది. 

భారత్ లో విలీనమవుతామనే డిమాండ్

పాకిస్తాన్, అఫ్గాన్ లేదా ఇరాన్ లలో ఏర్పడే అస్థిర పరిస్థితుల ప్రతికూల ప్రభావం వాటి పొరుగునున్న దేశాలపైన కూడా పడుతున్నది. అస్థిరత నెలకొనకుండా ఉండాలంటే ముందు ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోకుండా ఉండటం అత్యవసరం. అయితే, ద్రవ్యోల్బణం, గోధుమల కొరత వంటి వాటి వల్ల బలూచిస్తాన్, గిల్గిత్ బాల్టిస్తాన్ లలో జనం తమ ప్రాంతాలను భారతదేశంలో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. చైనా – -పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్ లో చైనా రేవు నగర నిర్మాణానికి దిగింది. ఈ అభివృద్ధి ప్రణాళికలు తమ చేపల వేటకు గండికొడుతున్నాయని, ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇంధన వాయు, చమురు నిక్షేపాలకు బలూచిస్తాన్ ప్రసిద్ధి చెందింది. వైశాల్యం రీత్యా బలూచిస్తాన్ పెద్దదైనా అక్కడ జనాభా తక్కువే. కొందరు బలూచీయులు ఇరాన్, అఫ్గాన్​లలో కూడా ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్ లలో ఏదో ఒక దానిలో విలీనం కావాలని లేదా స్వతంత్ర దేశంగా వ్యవహరించవచ్చని బ్రిటీష్ పాలకులు చెప్పినపుడు బలూచిస్తాన్ రాజు స్వతంత్ర దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. కానీ, బలూచిస్తాన్ ఇంచుమించుగా ఒక ఏడాది మాత్రమే స్వతంత్ర దేశంగా ఉండగలిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం1948లో సైనిక, దౌత్య మిశ్రమంతో ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. కానీ, కొరవడిన అభివృద్ధి, మానవ హక్కుల ఉల్లంఘనలతో బలూచిస్తాన్ లో తిరుగుబాటు కార్యకలాపాలు1948 నుంచి సాగుతూనే ఉన్నాయి. 

అడుగంటిన విదేశీ మారక నిల్వలు

పాక్​ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఒక నెల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. దేశ రాజకీయ సంక్షోభంతో పాక్​ రూపాయి విలువ పతనమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ రుణ ప్రదాన సంస్థలు పాక్​కు నిధులు మంజూరు చేసేందుకు విముఖంగా ఉన్నాయి. దాంతో పాక్ నిధుల కోసం  చైనా, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలను, ఇతర అంతర్జాతీయ సంస్థలను దేబిరిస్తోంది.  పాక్ కేంద్ర బ్యాంకులో 200 కోట్ల డాలర్లను జమ చేస్తామని, మరో వెయ్యి కోట్ల డాలర్లను పెట్టుబడుల రూపంలో అందిస్తామని సౌదీ ప్రభుత్వం మాట ఇచ్చిందని పాక్ ​ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల వెల్లడించారు. పాక్ పునర్నిర్మాణానికి  ప్రపంచ సంస్థల్లో కొన్ని 9.7 బిలియన్ డాలర్ల మేరకు చేయూతనందించేందుకు సుముఖత చూపాయని కూడా షాబాజ్ చెప్పారు. అవన్నీ చేతికందినపుడు మాత్రమే ఫలితాలు కనబడతాయి. పాక్ వద్ద ప్రస్తుతం దాదాపు 4.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయి. 

పాముల పుట్టలు

కనీసం డజను తీవ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం ఇస్తున్నది. అందులో లష్కర్-ఏ-తోయిబా, జైష్ -ఏ -మహమ్మద్ వంటి ఐదు సంస్థలు కేవలం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా దుశ్చర్యలకు పాల్పడేవి, అఫ్గాన్​ను దృష్టిలో పెట్టుకున్నవి, దేశీయమైనవి, వర్గ పరమైనవి(షియా వ్యతిరేక) కూడా ఉన్నాయి. ఇవి అడపాదడపా పాక్​ పౌరులను కూడా బలిగొంటున్నాయి. 

అసలు కొరత ప్రజాస్వామ్యమే

పాక్​లో ముఖ్యంగా దేనికైనా కొరత ఉందంటే అది ప్రజాస్వామ్య కొరతే. అక్కడ పౌర ప్రభుత్వాలను తోలు బొమ్మలను చేసి సైన్యమే పెత్తనం చెలాయిస్తూ వస్తున్నది. పాక్​లోని అధ్వాన పరిస్థితులతో మనకు శరణార్థుల సమస్య తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడ  పౌర ప్రభుత్వం, రాజ్యాంగపరమైన ఆధిపత్యం స్థిరపడాల్సి ఉంది. న్యాయమూర్తులు, సైనికాధికారులు తమ అహాన్ని పక్కనపెట్టి  రాజ్యాంగానికే ఉన్నత స్థానం కట్టబెడితే పరిస్థితులు కొంతవరకు చక్కదిద్దుకునే అవకాశం ఉంది. కనీసం ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పాక్​ అరాచకంలోకి, అంతర్యుద్ధంలోకి జారిపోగల ప్రమాదం కనిపిస్తున్నది. 

- మల్లంపల్లి ధూర్జటి

సీనియర్ జర్నలిస్ట్