బొగ్గు గని కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏదీ?

బొగ్గు గని కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏదీ?

దేశంలోని బొగ్గు గనుల తవ్వకాలు మొదలైన నాటి నుంచీ కార్మికుల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా నేటికీ పరిస్థితి మారలేదు. గని యాజమాన్యాలు బొగ్గు వెలికితీతలో లేటెస్ట్ టెక్నాలజీని వాడడంలో చూపిస్తున్న చొరవ.. కార్మికుల రక్షణ చర్యల విషయంలో కొరవడుతోంది. తూతూ మంత్రంగానే సేఫ్టీ మెజర్స్ ఉంటున్నాయి. నిత్యం గనుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా.. ప్రకృతికి విరుద్ధంగా భూమిని చీల్చుకొని కిలోమీటర్ల లోపలికి వెళ్లి తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రపంచానికి వెలుగునందిస్తున్న నల్ల సూర్యులు ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తే మళ్లీ సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేకుండాపోతోంది. తెలంగాణకు ఒక పెద్ద మణి లాంటి సింగరేణి బొగ్గు గనిలోనూ ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ప్రభుత్వం, యాజమాన్యాలు దృష్టి పెట్టి, అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన  అవసరం ఉంది.

దేశంలో ఏటా వందల మంది మృతి

బొగ్గు గనుల పుట్టుకకు 200 ఏండ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తంలో 500 మందికి పైగా కార్మికులు కోల్ మైన్స్ లో జరిగే ప్రమాదాల్లో మరణిస్తున్నారు. గడిచిన మూడేండ్లలో ఇండియాలోనే 150 మందికి పైగా మృతి చెందారు. ఒక్క జార్ఖండ్ లోని గనుల్లోనే ఈ మూడేండ్లలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోకి వెళ్లి చూస్తే1954 డిసెంబరు 10న మధ్యప్రదేశ్ లోని సిందువాడ వద్ద ద న్యూటన్ చిక్లీ కాలరీలో వరద నీరు చేరి 63 మంది కార్మికులు చనిపోయారు. 1958 ఫిబ్రవరి 19న చినకురి కాలరీలో జరిగిన ప్రమాదం 182 మందిని బలితీసుకుంది. 1965 మే 28న ధన్ బాద్ లోని డోరీ కాలరీ గనిలో అగ్నిప్రమాదం వల్ల 268 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. 1975 డిసెంబరు 27న బీహార్ లోని చాన్నాలా గనిలోకి నీరు చేరి 380 మంది జల సమాధి అయ్యారు. 1994 ఆగస్టు 28న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద రాజ్ పూర దారిబా గనిలో జరిగిన ప్రమాదంలో 30 మందికి పైగా చిక్కుకొని ప్రాణాలు వదిలారు. 2018 డిసెం బరు 18న మేఘాలయలోని జయంతియా హిల్స్ జిల్లాలో ర్యాట్ మైనింగ్ లో చిక్కుకొని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మీటర్ల లోతు నీళ్లలో వారు చిక్కుకోవడంతో 11 శవాలను బయటకు తీయలేకపోయారు. ఇక, 2020 జనవరి నాటికి గడిచిన ఐదేండ్లలో దేశమంతా కలిపి 577 మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో బొగ్గు గని ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇక్కడ ఆ దిశగా ప్రణాళిక ఏదీ నేటికీ కనిపించడం లేదు.

సింగరేణిలో ఈ ఏడాది 12 మంది మృతి

దేశంలో అతి పెద్ద బొగ్గు గనుల్లో ఒకటైన మన సింగరేణిలోనూ ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2006లో సింగరేణిలోని వీకే–1 షాఫ్ట్ గనిలో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు మరణించారు. 2009 జూన్ లో గోదావరిఖనిలోని 7 ఎల్ పీ గనిలో జరిగిన  ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించగా, అదే సంవత్సరం అక్టోబరు 17న గోదావరిఖనిలో 8ఏ గనిలో మరో ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 1936 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదాలు ఇవే. 2015లో అతి తక్కువ ప్రమాదాలే జరిగాయి. ఆ ఏడాది శాంతిఖని గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. అయితే ఆ తర్వాత మళ్లీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. 2016లో పది ప్రమాదాలు జరగగా 12 మంది మరణించారు. 2017లో 11 ప్రమాదాల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. 2018లో ఏడు ప్రమాదాలలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 2019లో 8 మంది మరణించారు. గడిచిన ఐదేండ్లలో 51 మంది కార్మికులు మరణించినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ నెల చివరిలో గోదావరిఖనిలోని వకీలపల్లి గనిలో జరిగిన ప్రమాదంలో నవీన్ అనే 28 సంవత్సరాల ఓవర్‌‌‌‌మెన్ మరణించాడు. అయితే అతడు రక్షణ చర్యలను పర్యవేక్షించే సూపర్ వైజర్ కావడంతో సేఫ్టీ మెజర్స్ విషయంలో యాజమాన్యం తీరుపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.

రక్షణ చర్యలపై సీరియస్​నెస్ అవసరం

గనుల్లో ప్రమాదాలు జరగకుండా కేంద్ర బొగ్గు శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలి. పలు సందర్భాల్లో ఓపెన్ కాస్టు గనుల్లోనూ బ్లాస్టింగ్స్ చేస్తుండగా సరైన జాగ్రత్తలు తీసుకోక కార్మికులు మరణించిన పరిస్థితులు ఉన్నాయి. కనీస సేఫ్టీ మెజర్స్ విషయంలో యాజమాన్యాలు అలసత్వం ప్రదర్శించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే హడావుడి చేయడం, విచారణల పేరిట ఏండ్ల తరబడి కేసులను వాయిదా వేయడం లాంటి చర్యలతో యాజమాన్యాల్లో భయం కొరవడుతోంది. 130 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణికి మరో 150 సంవత్సరాల భవిష్యత్తు ఉంది. గనుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

కార్మికుల కుటుంబాలకు భరోసా ఉండాలె

కార్మికుల కష్టంతో అటు కోల్ ఇండియా, ఇటు సింగరేణి వేల కోట్ల రూపాయలు లాభాలను గడిస్తూ తమ టర్నోవర్‌‌‌‌ను పెంచుకుంటూ క్యాష్ రిచ్ కంపెనీలుగా ఎదిగాయి. గోదావరి తీరమంతా బొగ్గు నిక్షేపాలున్నాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, కోల్ ఇండియాపై ప్రైవేటీకరణ ఉచ్చు ఎప్పుడు పడుతుందో తెలియని స్థితి నెలకొంది. మరోవైపు 500 బొగ్గు బ్లాకులను ప్రైవేటు, మల్టీ నేషనల్ కంపెనీలకు వేలం ద్వారా కట్టబెట్టబోతోంది కేంద్రం. ఈ పరిస్థితులు డ్యూటీలో ఉన్న కార్మికులు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు యాజమాన్యాలు, ప్రభుత్వాల నుంచి కనీస భరోసా కూడా అందకపోవడంతో వారి జీవితాలు గాలిలో దీపాల్లా మారాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు, కార్మిక సంఘాలు గనుల్లో ఎప్పటికప్పుడు రక్షణ విషయాలకు సంబంధించి సేఫ్టీ సమావేశాలను ఏర్పాటు చేసి, ప్రత్యక్షంగా గనుల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఉంది. రక్షణ పరికరాలు, సామగ్రి కొనుగోలులో నిబద్దతను పాటించి నాణ్యతను పరిశీలించి, కార్మికుల జీవితాలకు భద్రత కల్పించాలి.-ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్.