
మానవ సమాజ ప్రగతికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం. అందరూ కలిసి ఆలోచించడం, సహకారంతో పనిచేయడం వల్లనే ఆది మానవుడు క్రమేణా ఆధునిక మానవుడు అయ్యాడు. ఈ ప్రయాణంలో ఏర్పాటు చేసుకున్న సంస్థలు కీలకంగా మారినాయి. అమెరికా దేశం ఏర్పడడానికి ముందు, తరువాత ఉన్న పరిస్థితులను బేరీజు వేస్తే సంస్థల పాత్ర కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. అనేక ప్రజాస్వామిక సంస్థల మధ్య సంబంధాలు కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యమే. వీటన్నింటినీ ఒకే గాటన నడిపించే ప్రాథమిక సూత్రం ప్రజాస్వామ్య విలువలలో ఇమిడి ఉన్నది. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం ప్రయోజనం ఎల్లకాలం కొనసాగకుండా ఈ సంస్థాగత వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిలుపుతున్నది.
వ్యక్తి ప్రయోజనాలు కాకుండా సామూహిక, ప్రజా ప్రయోనాలకు పెద్దపీట వేసేందుకు సంస్థలు దోహదపడ్డాయి. ఈ సంస్థలకు ఆదేశిక సూత్రాలు ఒక రాజ్యాంగంలో పొందుపరుచుకుని, ఆ రాజ్యాంగంలో అంగీకరించిన సూత్రాలు, విలువలు, పద్ధతుల ద్వారా పరస్పర వైరుధ్యాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ప్రజాస్వామ్య సంస్థలు తీర్చుతున్నాయి. అయితే, రానురాను ఆయా ప్రజాస్వామ్య సంస్థలలో సైద్ధాంతిక సంఘర్షణతో మొదలై క్రమంగా వర్గ ప్రయోజనాల ఘర్షణగా మారింది. ఇంకా తరచి చూస్తే వ్యక్తిగత ప్రయోజనాలే మూలంగా మారినాయి. అందుకే ప్రజాస్వామ్య సంస్థల మీద నమ్మకం తగ్గుతోంది.
ప్రపంచీకరణను ప్రాజెక్టుగా చేపట్టిన అమెరికా
ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్య ధోరణులు పెరుగుతున్నాయి. ఇది మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచీకరణను ఒక ప్రాజెక్టుగా చేపట్టిన అమెరికా దాంట్లో ప్రజాస్వామ్యాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేయలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలసవాద దోపిడీకి అవకాశం లేనందున, దేశాలను ఆక్రమించే పరిస్థితి లేనందున మొదలు వాణిజ్యాన్ని నెత్తికెత్తుకున్నది. అంతర్జాతీయంగా సంబంధాలు పెరుగుతాయి అనే ఒకే ఒక హామీతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు అంత ర్జాతీయ సంస్థలలో ప్రజాస్వామ్యం ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించలేదు. దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు లక్ష్యంగా మొదలుపెట్టిన ప్రక్రియ 5 దశాబ్దాల సుదీర్ఘ చర్చల తరువాత ప్రపంచ వాణిజ్యసంస్థ ఏర్పాటు అయ్యింది.
సభ్య దేశాలకు ఒకే ఓటు, ఏకాభిప్రాయం మేరకే నిర్ణయాలు వగైరా ఇందులో కీలకం. అయినా కూడా చిన్న, వర్ధమాన దేశాలకు ఇందులో సమానంగా పాల్గొనే అవకాశాలు తక్కువ ఉండడంతో ఆయా దేశాలకు వెసులుబాటు కల్పించారు. గత శతాబ్దంలో ఏర్పాటు అయిన అన్ని అంతర్జాతీయ సంస్థలలో ప్రపంచ వాణిజ్యసంస్థ విధి విధానాలు అత్యంత ప్రజాస్వామికంగా ఉండడానికి కారణం సుదీర్ఘ చర్చలు, చర్చలలో వర్ధమాన దేశాల ఐక్యత. ఐక్య రాజ్యసమితి భద్రతామండలిలో కొన్ని దేశాల ఆధిపత్యం, అందులో ఉన్న విధి విధానాలు మొదటి నుంచీ ప్రజాస్వామ్య వ్యతిరేకమే.
ట్రంప్ పెడధోరణి
అమెరికా దేశంలో ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులకు పరాకాష్టకు ఉదాహరణ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయి ప్రజాస్వామ్య సంస్థలతో కలిసి పనిచేయమని ప్రజలు అధికారమిస్తే తాను నియంతగా వ్యవహరిస్తూ ప్రజలు దానిని ఆమోదించారు అని వింతవాదన నెత్తికెత్తుకుని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. 2021లో సాధారణ అధికార మార్పిడికి డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోకపోవడం, శ్వేతసౌధం మీద దాడి ఈ పెడధోరణులకు నిదర్శనాలు. ప్రబలిన ఆర్థిక అసమానతలు, వాస్తవాలు, విలువల నుంచి తప్పుడు సమాచారాన్ని వేరు చేయడంలో ఇబ్బంది కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నది అని మేధావులు హెచ్చరిస్తున్నారు.
ఈ సవాళ్లు ప్రజాస్వామ్య చర్చకు, రాజకీయ ప్రక్రియలపై అంగీకారానికి కొత్త అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ, సమాచార, సాంకేతిక విప్లవాలు అన్నీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, సమానత్వానికి వ్యతిరేకంగా ప్రబలుతున్నాయి. అమెరికా దేశంలో రెండు మూడు రాష్ట్రాలలో ఒక విష రసాయనాల కంపెనీకి చెందిన రసాయనాల వల్ల రోగులుగా మారినవారు నష్టపరిహారం కేసులు వేయకుండా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. కంపెనీకి రక్షణగా చట్టం చేయడమంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని నీరుగార్చడమే.
వివాదాస్పద ఆదేశాలు
డొనాల్డ్ ట్రంప్ వరుసపెట్టి విడుదల చేస్తున్న కార్యనిర్వాహక ఆదేశాలు అన్నీ కూడా వివాదాస్పదమవుతున్నాయి. అన్నింటిలో కూడా తనకు ఉన్న అత్యవసర అధికారాలను వాడుతున్నట్టు పేర్కొనడం ఆధిపత్య ధోరణికి అద్దంపడుతున్నాయి. తనకు తానే అధికారాలను ఆపాదించుకోవడం విమర్శకు దారి తీస్తున్నది. ఈ రకమైన విస్తృత అధికారాలను స్వయంగా ప్రకటించుకోవడం ఒక నియంత మాత్రమే చేస్తాడు.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థకు గణనీయమైన ముప్పును సూచిస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు, కొందరు ఈ చర్యలకు చట్టపరమైన సవాళ్లు అనివార్యమని సూచిస్తున్నారు.
ప్రజాస్వామ్య సంస్థలలో పని చేసే అధికారుల నుంచి వ్యక్తిగత విధేయతను కోరుతున్న వైనం కూడా ఒక పెడ ధోరణే. తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు అధికారులను మేం అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామని బెదిరించడం ఈ కోవలోకే వస్తుంది. వేల కోట్ల అప్పులు చేసి, కొందరికే ఉపయోగపడే ప్రాజెక్టులు చేసి, ఆ అప్పుల భారం అందరి మీద రుద్దే నిర్ణయాలు కనీస చర్చ చేయకుండా తీసుకోవడం కూడా ప్రజా
స్వామ్యానికి వ్యతిరేకం.
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం బహుముఖ ముప్పును ఎదుర్కొంటోంది. మన దేశంలో, రాష్ట్రాలలో కూడా ప్రజాస్వామ్యం అనేకవిధాలుగా కొందరి స్వార్ధం వల్ల బలహీనపడుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏకవ్యక్తిస్వామ్య నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు ఓటు వేసినా, అధికారంలోనించి దించివేసినా అధికారంలోకి వచ్చినవారు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమాగా ప్రకటిస్తున్నారు. ప్రజలకు గత్యంతరం లేదు అని భావించడంవల్లనే ఈ ధీమా. ప్రజలు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో విలువలు, ప్రక్రియలు, పద్ధతులను కూడా జోడిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టడం అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తిరిగి వేళ్లూనుకునేందుకు అందరూ నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రజాస్వామ్యం స్థానంలో ధనస్వామ్యం
ప్రతి దేశ రాజకీయాలలో ప్రపంచ పరిణామాల ప్రభావం రానురాను పెరిగిపోయింది. అన్ని దేశాల ప్రజలకు తమ దేశ పాలనలో తాము నిర్ణయించుకునే అవకాశం లేకుండా అంతర్జాతీయ ధోరణులు అననుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు పెడధోరణుల బాట పడుతున్నారు. వర్గ ప్రయోజనాలు లక్ష్యంగా ప్రజాస్వామ్యం స్థానంలో ధనస్వామ్యం రాజ్యమేలుతున్నది.
ఎన్నికయ్యేవరకు స్థానిక సమస్యల మీద హామీలు గుప్పించే ఈ నియంతలు తదుపరి అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరుచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తామే ఎల్లకాలం అధికారంలో ఉండేలా ధనసేకరణ, వనరుల సేకరణ లక్ష్యంగా పావులు కదుపుతూ, అవినీతికి పాల్పడుతూ, ప్రజాస్వామ్య సుస్థిరతకు ఏర్పాటు చేసుకున్న సంస్థలను బలహీనపరుస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. తమ పాలనకు అననుకూల పరిస్థితులు ఎదురైతే పోలీసు వ్యవస్థను ప్రజలమీదకు ఉసికొల్పుతున్నారు. డిజిటల్ యుగంలో ఆయా సాధనాలను వాడి తమ నిఘా వ్యవస్థను పటిష్టపరుచుకుంటున్నారు. అధికారం కోసం వ్యాపారాన్ని వాడడం ప్రజాస్వామ్య దేశాలలో ఒక విష సంస్కృతిగా మారింది.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్