డిసెంబర్ 7 నుంచే పంపిణీ చేస్తామని ఎలక్షన్ సభలో ప్రకటన
2, 3 లక్షల మందికైనా సాయం అందిస్తామన్న మాట గాలికే..
అప్లయ్ చేసుకున్న కొందరికే పంపిణీ, సర్వే లేదు, సాయం లేదు..
ఇంకో 7 వేల మందే ఉన్నరన్న అధికారులు.. రెండున్నర లక్షల మందికిపైగా ఎదురుచూపులు
ఇండ్లు కోల్పోయిన వారికి ఇప్పటికీ రూపాయి కూడా ఇయ్యని దుస్థితి
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్లు అయిపొయినయి. సీఎం కేసీఆర్ చెప్పిన డేట్ దాటి పదిరోజులు అయింది. అయినా కొత్తగా ఎవరికీ వరద సాయం అందలే. గ్రేటర్ ఎలక్షన్ల కంటే ముందే మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న వారికి మాత్రం డబ్బులిచ్చి.. అందరికీ ఇచ్చేసినమంటూ చేతులు దులుపుకునే పనిలో పడ్డారు అధికారులు. జీహెచ్ఎంసీ పోలింగ్ తర్వాత మీసేవా కేంద్రాల్లో అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పినా.. తర్వాత మాట మార్చారు. అప్లై చేసేందుకు వెళ్లిన వాళ్లందరినీ వెనక్కి పంపేశారు. ఇండ్ల దగ్గరికే వచ్చి పేర్లు రాసుకుంటామన్నరు. కానీ ఒక్క పేరు కూడా రాసుకోకపోగా.. ఒకట్రెండు రోజుల్లో మొత్తానికే వరద సాయాన్ని ఆపేయబోతున్నట్టు సమాచారం. బుధవారం 5,615 మందికి సాయం అందజేశామని, ఇంకా 7,116 మంది మాత్రమే మిగిలి ఉన్నారని అధికారులు చెప్పారు. కొత్తగా అప్లై చేయాల్సిన వాళ్ల గురించి, ఇండ్లకు వెళ్లి పేర్లు రాసుకునే విషయం గురించి ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. దీనితో ఇక వరద సాయం అటకెక్కినట్టేనన్న సంకేతాలిచ్చారు.
అవకతవకలు.. అవినీతి మధ్య..
రెండు నెలల కింద కురిసిన కుండపోత వానలతో హైదరాబాద్ తల్లడిల్లింది. వేలాది కాలనీలు నీటమునిగా యి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. కొన్ని ఇండ్లు కూలిపోయాయి. దీంతో వరద బాధితులకు కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. నేరుగా బాధితుల ఇండ్లకు వెళ్లి సొమ్ము పంపిణీ చేయడం మొదలుపెట్టారు. కానీ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేతివాటం చూపి సొమ్ము కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో.. మీసేవ సెంటర్లలో అప్లై చేసుకోవాలని, అర్హులైనవారికి బ్యాంకు అకౌంట్లలో నేరుగా సొమ్ము జమ చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. గత నెల 16 నుంచి మీసేవా సెంటర్లలో బాధితులు అప్లై చేసుకున్నారు. వారిలో కొందరికి డబ్బులు జమ కావడంతో.. బాధితులు పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాలకు పోటెత్తారు. కానీ ఎలక్షన్ టైంలో వరద సాయం నిలిపేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో అప్లికేషన్ల స్వీకరణ ఆపేశారు. అప్పటికే మీసేవా ద్వారా 3 లక్షల 32 వేల 147 మంది అప్లై చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆదేశించేనాటికే.. 2 లక్షల 60 వేలమందికి వరద సాయం సొమ్ము అకౌంట్లలో పడింది. పోలింగ్ తర్వాత (ఈ నెల 7 నుంచి) 59,416 మందికి అకౌంట్లలో డబ్బు జమ చేసినట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. అంటే మీసేవా ద్వారా వచ్చిన 3 లక్షల 32 వేల 147 అప్లికేషన్లలో.. ఇప్పటివరకు 3 లక్షల 25 వేల 31 మందికి సొమ్ము అందింది. 7,116 మంది మాత్రమే మిగిలారు. వారికి ఒకట్రెండు రోజుల్లో సొమ్ము జమ చేసి.. వరద సాయాన్ని ఆపేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకా లక్షల మందికి అందలే..
ఎలక్షన్‌కు ముందు మీసేవా ద్వారా అప్లికేషన్ల స్వీకరణ ఆపేసే సమయానికే.. సుమారు లక్షన్నర అప్లికేషన్లు అప్లోడ్ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దానికితోడు డిసెంబర్ 7 నుంచి మళ్లీ సాయం ఇస్తామన్న సీఎం హామీ మేరకు.. ఆ రోజున పెద్ద సంఖ్యలో బాధితులు అప్లికేషన్లు పెట్టుకునేందుకు మీసేవా సెంటర్ల వద్ద క్యూ కట్టారు. తాము నిజమైన బాధితులమని.. తమ ప్రాంతాల పేర్లు, ఆధారాలనూ చూపారు. కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు అప్లికేషన్లు తీసుకోబోమనీ, తామే ఆయా ప్రాంతాలకు వచ్చి బాధితులను గుర్తించే సర్వే చేపడ్తామంటూ వెనక్కి పంపేశారు. కానీ సర్వే చేపట్టనేలేదు. బాధితులు పది రోజులుగా వేచి చూస్తూనే ఉన్నారు. సుమారు రెండున్నర లక్షల మంది వరద సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. టీఆర్ఎస్ నేతలు ఓట్లేయించుకొని తమను మోసం చేశారని వారంతా మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడైనా, ఏదైనా కార్యక్రమానికి వస్తున్నారంటే.. వరద బాధితులు అక్కడికి చేరుకుని, తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన కేటీఆర్‌ను కలిసేందుకు బాధితులు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు.
ఇండ్లు కోల్పోయిన వాళ్లను పట్టించుకుంటలేరు
వరదల వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి పాక్షికంగా నష్టం అయితే రూ.50 వేలు, ఎక్కువ దెబ్బతిని ఉంటే రూ.లక్ష సాయం ఇస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అందించలేదు. ఇండ్లు కోల్పోయి రోడ్డునపడ్డా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. వరదలొచ్చి రెండు నెలలైందని, ఇప్పుడు మీకు ఇండ్ల కోసం డబ్బులు ఎవరిస్తారని అధికారులు అంటున్నారని చెప్తున్నారు. ఓల్డ్ కమేలా ప్రాంతంలో వానలకు కొన్ని ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరడంతో అధికారులే కూల్చేశారు. అక్కడి 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాటి నుంచీ ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆఫీసుకి వెళ్తే.. ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లాలని చెప్తున్నారని.. అక్కడికి వెళ్లే ఎమ్మార్వో తమను పట్టించుకోవడమే లేదని అంటున్నారు.
ఇండ్లు పోయి రోడ్డున పడ్డం
మా ఇండ్లు పోయి రోడ్డున పడ్డం. ఎవరూ పట్టించుకుంట లేరు. వరదల టైంలో వచ్చి రూ.10 వేలు చేతిలో పెట్టి పొయిన్రు. ఇప్పటికి మమ్మల్ని ఎవరూ పట్టించుకుంట లేరు. ఇప్పుడు ఇల్లు లేదు. పని చేస్తే గానీ తిండికెళ్లని మాకు ఇల్లు ఎట్లా? సర్కారే ఆదుకోవాలె. లేకుంటే ఆందోళన చేస్తం.-లక్ష్మమ్మ, ఓల్డ్ కమేలా.