సీక్రెట్​​కెమెరా ఉందా ? లేదా?.. ఇలా ఈజీగా కనిపెట్టొచ్చు

సీక్రెట్​​కెమెరా ఉందా ? లేదా?.. ఇలా ఈజీగా కనిపెట్టొచ్చు

హిడెన్ లేదా సీక్రెట్ కెమెరాలు ఆడపిల్లల, మహిళల భద్రత, ఆత్మగౌరవాలకి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హాస్టల్స్, హోటల్ రూమ్స్​లో ఉండాల్సి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకు సీక్రెట్​ కెమెరాలు ఉన్నట్టు గమనించగలగాలి. అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి గురించి అవేర్​నెస్​ ఉంటే చాలు సీక్రెట్ కెమెరాల పని పట్టొచ్చు అంటున్నారు సైబర్​ ఎక్స్​పర్ట్స్​.

హిడెన్ కెమెరా ఉందా? లేదా? తెలియాలంటే చేతిలో స్మార్ట్​ ఫోన్, ఆ ఫోన్​లో కొన్ని యాప్స్ఉండాలి. అలాంటి యాప్స్​లో కొన్నింటి గురించి...

హిడెన్ డివైజ్ డిటెక్టర్ : ఈ డిటెక్టర్​తో హిడెన్ కెమెరాలను, స్పై డివైజ్​లను కనిపెట్టొచ్చు. ఇది ఫోన్​లోని కెమెరా, మ్యాగ్నెటిక్ సెన్సర్ ద్వారా హిడెన్ కెమెరాలను, ఇతర గాడ్జెట్స్​ను కనిపెడుతుంది. ఈ యాప్ లే అవుట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. వాడడం కూడా చాలా తేలిక. ఇందులో ఉండే సౌండ్, వైబ్రేషన్ అలర్ట్​ సిస్టమ్​ కూడా హిడెన్ కెమెరాలు ఉన్న ప్లేస్​ను వెంటనే గుర్తించేందుకు సాయపడుతుంది.

స్పై కెమెరా ఫైండర్ : ఈ యాప్​ కూడా హిడెన్ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలను కనిపెట్టేందుకు పనికొస్తుంది. ఇది ఫోన్ కెమెరా, ఫ్లాష్​ ద్వారా హిడెన్ కెమెరాలను డిటెక్ట్ చేస్తుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. వైర్​లెస్ కెమెరాలను కూడా గుర్తిస్తుంది. ఇందులో కూడా సౌండ్, వైబ్రేషన్ నోటిఫికేషన్ సిస్టమ్​ ఉంది. దానిద్వారా హిడెన్ కెమెరాలున్న లొకేషన్​ని పిన్​ పాయింట్ చేసి అలర్ట్ చేస్తుంది. 

యాంటీ స్పై కామ్ : ఈ యాప్ ఫోన్​లోని కెమెరా, మ్యాగ్నెటిక్ సెన్సర్ వాడి హిడెన్ కెమెరాలు, ఇతర ఎక్విప్​మెంట్స్​ను గుర్తిస్తుంది. ఈ యాప్​ యూజర్ ఫ్రెండ్లీ. లే అవుట్ అందరికీ అర్థం అవుతుంది. సౌండ్, వైబ్రేషన్ అలర్ట్స్ ఉంటాయి. అవే కాకుండా అనేక రకాల కస్టమైజ్డ్​ ఆప్షన్స్​ కూడా ఉంటాయి. అవి అవసరానికి తగ్గట్టు సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసేందుకు ఉపయోగపడతాయి.

ఇటువంటి హిడెన్ కెమెరా డిటెక్షన్ యాప్స్​లో కామన్​గా మూడు ఫీచర్లు ఉంటాయి. అవి.. లైవ్​ కెమెరా డిటెక్షన్, ఇన్​ఫ్రారెడ్ కెమెరా డిటెక్షన్, మ్యాగ్నెటిక్ కెమెరా డిటెక్షన్. అవెలా పనిచేస్తాయంటే..

లైవ్ కెమెరా డిటెక్షన్ : ఈ యాప్స్​లో  రియల్ టైం కెమెరా డిటెక్షన్ అనేది పాపులర్ ఫీచర్. కెమెరా ఆన్​ చేసి రూమ్​ మొత్తాన్ని స్క్రీన్​లో చూడాలి. హిడెన్ కెమెరా ఉంటే ఫోన్​లో తెలిసిపోతుంది. అదెలాగంటే... హిడెన్ కెమెరా డిటెక్షన్ యాప్​ ఫోన్ నుంచి వీడియో తీసుకుంటుంది. ఆ వీడియోలో హిడెన్ కెమెరాకు సంబంధించిన ఫ్లాష్​, లైట్​, విచిత్రమైన ఆకారాలు కనిపిస్తాయి.

ఇన్​ఫ్రారెడ్ కెమెరా డిటెక్షన్ : ఇది హిడెన్ డిటెక్షన్ కెమెరా యాప్స్​లో ఉండే మరో ఫీచర్. స్మార్ట్​ ఫోన్​లో ఉండే ఇన్​ఫ్రారెడ్ సెన్సర్ వాడి రూమ్​లో ఉన్న హిడెన్ కెమెరాలను గుర్తిస్తుంది. ఇన్​ఫ్రారెడ్ కెమెరాలు ఒక ప్రత్యేకమైన వెలుగుని ప్రసరింపచేస్తాయి. ఆ వెలుగు​ కంటికి కనిపించదు. కానీ,  ప్రత్యేకమైన సెన్సర్ల ఆధారంగా దాగి ఉన్న కెమెరాలను డిటెక్ట్ చేస్తాయి.

మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్షన్ : కెమెరా ఎలక్ట్రానిక్​ వస్తువు కాబట్టి అందులో ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్​ని ఈ​ ఫీచర్ కనిపెడుతుంది. రూమ్ మొత్తాన్ని స్మార్ట్​ ఫోన్​తో తనిఖీ చేస్తే.. మాగ్నెటిక్ ఫీల్డ్​ అస్తవ్యస్తంగా ఉంటే కనుక అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్టే.

గడియారాలు, పవర్ బ్యాంక్​లు, ల్యాంప్, ప్లగ్స్, పెన్స్, యూఎస్​బీ, ఫొటో ఫ్రేమ్​, డెకరేటివ్ ఐటెమ్స్​లో హిడెన్ కెమెరాలను ఉంచే అవకాశం ఉంది.

గదిలోకి వెళ్లగానే లైట్స్ ఆపేసి చీకటిలోనే ఫోన్ కెమెరా ఆన్​ చేసి గది మొత్తం చూడాలి. అప్పుడు ఏదైనా వెలుగు కనిపిస్తే అది హిడెన్ కెమెరా అని అనుమానిం చాల్సిందే.

కొన్ని రకాల హిడెన్​ కెమెరాలు డాటా షేర్ చేయడానికి బ్లూటూత్ వాడతాయి. అది తెలుసుకునేందుకు ఫోన్​లో స్కాన్ చేయొచ్చు. కొన్ని కెమెరాలు వైఫై నెట్​వర్క్​తో కూడా పనిచేస్తాయి. అది కూడా గమనించుకోవాలి.

కొన్ని థర్మల్ డిటెక్టర్ల ద్వారా కూడా హిడెన్ కెమెరాలను గుర్తించొచ్చు.

మీరు ఉన్న రూమ్​ నుండి ఫోన్ కాల్​ చేయండి. ఫోన్​ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సౌండ్, వైబ్రేషన్ వంటివి వినిపిస్తే కెమెరాలు ఆ గదిలో దాక్కుని ఉన్నట్టే.