అద్భుతమైన పీఆర్సీ ఇదేనా?

సీఎం కేసీఆర్ చేసిన పీఆర్సీ ప్రకటన ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లలో నిరాశ మిగిల్చింది. కొత్త పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు, పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగులు, టీచర్ల సమస్యలు పరిష్కారం కొద్ది నెలల్లోనే జరిగిపోతాయని 2018 మే 16న ప్రకటించిన సీఎం దాదాపు మూడేండ్ల పాటు కాలయాపన చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేస్తే తన చెప్పుచేతల్లో ఉండరన్న దురాలోచనతో ఏదో ఒక కారణం చెబుతూ పీఆర్సీ ప్రకటనను సాగదీశారు. 2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్‌‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యోగులు టీఆర్ఎస్‌‌కు వ్యతిరేకంగా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్‌‌లో మెజారిటీ ఓట్లు ప్రతిపక్షాలకు పడ్డాయని తెలియడంతో టీఆర్ఎస్ షాక్ అయింది. దీంతో 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిస్తే ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం కష్టమని భావించి, ఉద్యోగ సంఘాలను పిలిచి సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విఫలం కావడంతో ఇక పనైపోయిందన్నట్టు చేతులు దులిపేసుకున్నారు.

వరుస ఎదురుదెబ్బలతో సర్కారులో భయం

ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత జరిగిన హుజూర్‌‌నగర్ బై ఎలక్షన్‌‌లో టీఆర్ఎస్ గెలవడంతో సీఎం కేసీఆర్ తమకు ఎదురు లేదని భావించారు. ఉద్యోగుల సమస్యలను ఇక గాలికొదిలేశారు. మళ్లీ 2020 మార్చి నుంచి కరోనా కారణంగా ఆర్థిక సమస్యల పేరు చెప్పి, పీఆర్సీ డిమాండ్‌‌ను పక్కనపెట్టారు. ఇలా ఎప్పటికప్పుడు వాయిదాలతో నెట్టుకొచ్చిన సీఎం కేసీఆర్‌‌కు దుబ్బాక బై ఎలక్షన్ బీజేపీ గెలుపు షాక్‌‌ ఇచ్చింది. ఆ తర్వాత జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాల నుంచి 56 సీట్లకు టీఆర్ఎస్ దిగజారిపోయింది. ఆ తర్వాత కొద్ది నెలలకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో టీఆర్ఎస్ అధినాయకత్వంలో భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఓట్లేసేదంతా గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత, టీచర్లు, ఉద్యోగులే కావడంతో ప్రభుత్వ ఉద్యోగులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రగతి భవన్‌‌లో మంత్రాంగం నడిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని అద్భుతమైన, గౌరవ ప్రదమైన పీఆర్సీ ఇస్తామని కేసీఆర్ మాయమాటలు చెప్పారు.

ఏపీ కంటే బెటర్ ఫిట్‌‌మెంట్ అంటూ..

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌‌లో కూడా టీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు గట్టిగా మాట్లాడే పరిస్థితి వస్తుందని కేసీఆర్‌‌కు అర్థమైంది. దీంతో నయానో, భయానో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు ప్రభుత్వం నియమించిన పే కమిషన్‌‌తో 7.5% ఫిట్‌‌మెంట్ ఇచ్చేలా నివేదిక ఇప్పించి, ఉద్యోగుల్లోకి ట్రైలర్ వదిలారు. నిరసనలను ముందే ఊహించిన కేసీఆర్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు తను చెప్పినట్టు ఆడే ఉద్యోగ సంఘాలను ప్రగతి భవన్‌‌కు పిలిపించుకుని, ఏపీలో ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌‌మెంట్ ఇచ్చారని అంతకంటే బెటర్‌‌ పీఆర్సీ ఇక్కడ ఇస్తామని చెప్పారు. ఆ ప్రకటనతోనే ఆ సంఘాల వాళ్లు కేసీఆర్ ఫోటోలకు పాలతో అభిషేకాలు చేసి ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇదేనా గౌరవప్రదమంటే?

తన అనుకూల సంఘాలతో మీటింగ్ పెట్టి అద్భుతమైన, గౌరవప్రదమైన పీఆర్సీ అని చెప్పి కేసీఆర్ ఎన్నికల కోడ్‌‌ను కూడా ఉల్లంఘించారు.  పైగా ఉద్యోగుల్లో ఏదో గొప్పగా పీఆర్సీ రాబోతోందన్న ఆశలు కల్పించి, ఇప్పుడు చూస్తే ఏపీ కంటే మూడు శాతం పెంచి, 30 శాతం ప్రకటించారు. ఇదేనా గౌరవప్రదమైన, అద్భుత పీఆర్సీ అంటే అనేలా ఉద్యోగులను ఉసూరుమనిపించారు. 63 శాతం ఫిట్‌‌మెంట్‌‌ ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. అయితే కనీసం 45 శాతమైనా ఇచ్చి ఉంటే గౌరవప్రదంగా ఉండేది. పీఆర్సీ కమిటీ నివేదికలో చెప్పిన 7.5 శాతం కంటే నాలుగు రెట్లు పెంచి 30 శాతం ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు గొప్ప ప్రయోజనం చేసినట్లు ప్రచారం చేసుకోవడం కేసీఆర్‌‌ ఒక్కరికే చెల్లింది. ఈ పీఆర్సీ ప్రకారం కింది స్థాయి జూనియర్ ఉద్యోగికి 4 వేలకు మించి వేతనం పెరగదు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ పెంచిన జీతంలో మూడు నెలల శాలరీ ఆదాయపుపన్ను చెల్లింపులకే సరిపోతుంది. ఇక సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల కేవలం ఆ ఉద్యోగి మరణిస్తే కుటుంబసభ్యులకు కొంత పెన్షన్ వస్తుంది తప్ప, ఆ ఉద్యోగికి రిటైర్మెంట్‌‌ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించడంపై క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఇవన్నీ పక్కన పెట్టేసి, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌‌కు సర్కారు ఆమోదం తెలిపితే నిజంగానే ఉద్యోగులకు మేలు చేసినట్లవుతుంది.
                                                                                                                                                      ....పి. సరోత్తం రెడ్డి,కో చైర్మన్, బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయిస్ సెల్