తరచూ ఇప్పటికే 1970 దశకంలో ఎమర్జెన్సీ విధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నేతలు తప్పే జరిగిందని ఒప్పుకున్నా.. పీఎం మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాలు అప్పటి పీఎం ఇందిరా గాంధీ నిర్ణయాన్ని తప్పుపట్టడం చేస్తుంటారు. రాజ్యాంగ స్ఫూర్తిని మాజీ ప్రధాని నెహ్రూ దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని మోదీ ఆరోపణలు చేసారు.
సుప్రీంకోర్టు అధికారాలు తగ్గించేందుకు ఇందిరా గాంధీ ప్రయత్నం చేశారని, పత్రికల గొంతు నొక్కారని, వేలాది మందిని జైలు పాలు చేశారని విమర్శించారు. నాడు ఇందిర చేసిన తప్పిదాలను ఇప్పటి ప్రభుత్వమూ చేస్తూనే విమర్శించడం ఇంకా దేనికి?
గత పదేండ్ల కాలంలో పౌర హక్కులు, మానవ హక్కులు ఎలా కాలరాశారో విదితమే. వికలాంగుడు అయిన ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్ట్ చేసి సంవత్సరాలకొద్దీ జైల్లో పెట్టి, వేధించడంతో ఆయన విడుదల అయ్యాక కొద్ది నెలలకే ఆరోగ్యం క్షీణించి మరణించాడు. తప్పు చేయకుండానే నాలుగు ఏండ్లుగా జైల్లో ఉన్న ఓమర్ ఖాలిద్ సంగతి చెప్పరు. ఒక వార్త కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్ సిద్ధిక్ కప్పన్‌ను సంవత్సరాలపాటు జైల్లో ఉంచారు.
378 రోజుల రైతుల ఆందోళన, 10 వేల మంది మీద కేసులు, లాఠీచార్జీలు, కాల్పులు, వేధింపులు, ఆందోళనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల మళ్ళీ రైతులు ఆందోళనకు దిగితే వారి మీద లాఠీఛార్జి చేశారు. యూపీలోని లఖిమ్‌పూర్ ఖేరిలో స్వయంగా అప్పటి కేంద్ర హోం సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు వాహనంతో ఢీకొట్టి నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ హత్యకు కారణం అయ్యాడు.
కార్మిక చట్టాలను మార్చేశారు
44 కార్మిక చట్టాలను మార్చేసి, నాలుగు కోడ్లుగా చేసిన తీరు, కార్మిక హక్కులను హరించిన తీరు, ప్రభుత్వ రంగాల అమ్మకం చూశాం. మన దేశానికీ బుక్కెడు బువ్వ పెడుతున్న రైతులకు ఎమ్మెఎస్పీ, రుణమాఫీ లేదు. కానీ, దేశంలోని ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫ్యాక్టరీలు, గనులు, స్టేడియంలు, చివరికి రోడ్లు, రైల్వే, డిఫెన్స్ బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారు. 16 లక్షల కోట్లకు పైగా అదాని లాంటి వారికి రుణమాఫీ ఇచ్చి, దేశంలోని బ్యాంకులను దివాలా తీయించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. డబ్బులతో, పదవులు ఇచ్చి, విపక్షాల ప్రభుత్వాలను కూల్చి, వేల కోట్ల స్కాంలలో ఉన్నవారి కేసులను మాఫీ చేశారు.
ఎవరు నిజం.. ఎవరు అబద్ధం!
మణిపూర్‌లో జరిగిన అల్లర్లలో 200 మందిపైగా చనిపోయారు. ఎంతోమంది అత్యాచారాలకు గురయ్యారు. 50 వేల మందికి పైగా షెల్టర్ లేనివారు అయ్యారు. వందల ప్రార్థనా కేంద్రాలు దగ్ధం అయ్యాయి, మంత్రుల ఇండ్ల మీద దాడులు జరిగాయి. విపక్ష నేత,రాహుల్ గాంధీ, విపక్షాలు, జర్నలిస్టులు వెళ్లి వచ్చారు. కానీ, సమస్య పరిష్కారానికి పీఎంకు సమయం లేదు. అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ చేసి వచ్చిన ఎడిటర్స్ టీమ్ మీద కేసులు పెడతారు! ఇంకా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద గౌరవం తమకే ఉన్నట్లు పీఎం మోదీ మాట్లాడుతారు. బుల్ డోజర్ నీతిని అమలు చేసినవారే దేశ ప్రజల ఐక్యత గురించి మాట్లాడడం దయ్యం వేదాలు వల్లించినట్టుంది.
- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్-